ఆడ శిశువుకు జన్మనిచ్చిన అవివాహిత.. డస్ట్‌బిన్‌లో పడేసి పరారీ
ఓ వివాహిత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన మాతృత్వాన్ని దాచుకునేందుకు ఆ పసికందును ఆస్పత్రి డస్ట్‌బిన్‌లో పడేసి పరారైంది

ముంబై : ఓ వివాహిత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన మాతృత్వాన్ని దాచుకునేందుకు ఆ పసికందును ఆస్పత్రి డస్ట్‌బిన్‌లో పడేసి పరారైంది. ఈ ఘటన ముంబైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ధారవికి చెందిన ఓ 23 ఏండ్ల అవివాహిత.. ఇటీవలే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పెళ్లి కాకుండానే బిడ్డను కనడంతో ఆమె ఆందోళనకు గురైంది. దీంతో ఆ పాపను ఆస్పత్రి టాయిలెట్ వద్ద డస్ట్‌బిన్‌లో పడేసి, ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
గత శుక్రవారం డస్ట్‌బిన్‌లో పాప ఉండటాన్ని స్వీపర్ గుర్తించి, వైద్యులకు సమాచారం అందించింది. పసిగుడ్డును పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. పోలీసులకు వైద్యులు సమాచారం అందించడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ధారవిలో ఉన్న ఆమెను అరెస్టు చేశారు. అవివాహితను పోలీసులు విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించింది.