ఈ ఏడాదిలో కొత్తగా రానున్న ఐదు యూపీఐ రూల్స్‌ ఇవే..!

కరోనా మహమ్మారి తర్వాత యూపీఐ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగాయి. ఎక్కడకు వెళ్లినా అందరూ ఎక్కువగా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు

ఈ ఏడాదిలో కొత్తగా రానున్న ఐదు యూపీఐ రూల్స్‌ ఇవే..!

UPI Rules 2024 | కరోనా మహమ్మారి తర్వాత యూపీఐ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగాయి. ఎక్కడకు వెళ్లినా అందరూ ఎక్కువగా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. వినియోగదారులకు సురక్షితంగా, సులభంగా లావాదేవీలు జరుపుకునేలా ఆర్‌బీఐ మార్పులు తీసుకువస్తున్నది. ఈ ఏడాది కొత్తగా పలు నిబంధనలు తీసుకురాబోతున్నది. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంయుక్తంగా నిబంధనలను రూపొందించాయి. వీటితో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ అనుభవం, ఇతర పేమెంట్‌ అనుభవం మరింత మెరుగుపడనున్నది.


డైనమిక్‌ యూపీఐ ఐడీలు


సంవత్సరంలో ఒక్కసారిగా వినియోగించకుండా ఉన్న యూపీఐ ఐడీలను డీ యాక్టివేట్‌ చేయాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, బ్యాంకులు ఏవైనా సరే పేమెంట్‌ యాప్‌ ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ నుంచి సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు గనక జరుకపోతే ఆ ఐడీ డీ యాక్టివేట్‌ అవుతుంది. డిజిటల్‌ లావాదేవీల్లో మోసాలను నియంత్రించేందుకు ఎన్‌సీపీఐ ఈ నిర్ణయం తీసుకుంది.


సెకండరీ మార్కెట్‌లో యూపీఐ..


త్వరలో సెకండరీ మార్కెట్లో సైతం యూపీఐని వినియోగించే అవకాశం రానున్నది. ఇందు కోసం ఎన్పీసీఐ (NPCI) చర్యలు చేపడుతున్నది. ఈ అవకాశం అమల్లోకి వచ్చిన తరువాత కస్టమర్ల ఖాతాలో ఫండ్స్‌ను యూపీఐ ఐడీ ద్వారా బ్లాక్ చేసుకుని, ట్రేడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత డెబిట్‌ అయ్యేలా చేసుకునే వీలుంటుంది.


యూపీఐ ఏటీఎం..


హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్ భాగస్వామ్యంతో ఎన్పీసీఐ దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వినియోగదారులు డెబిట్‌కార్డు అవసరం లేకుండానే యూపీఐని ఉపయోగించి.. ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే యూపీఐ ఏటీఎం ప్రారంభం కాగా.. త్వరలోనే దేశవ్యాప్తంగా పలు నగరాల్లోనూ తీసుకురానున్నారు.


పెరుగనున్న ట్రాన్సాక్షన్‌ లిమిట్‌..


యూపీఐ లావాదేవీల చెల్లింపు పరిమితిని త్వరలో పెంచనున్నారు. ముఖ్యంగా, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చేసే చెల్లింపుల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచనున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్నది. భారీ మొత్తంలో చెల్లింపులు జరిపేవారికి ఈ నిర్ణయంతో మరింత సౌలభ్యం కనుగనున్నది.


సెక్యూరిటీ ఫీచర్‌ టైమ్ లిమిట్..


యూపీఐ పేమెంట్స్‌లో మోసాలను అరికట్టేందుకు ఎప్పటికప్పు సెక్యూరిటీ ఫీచర్స్‌ను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టైమ్ లిమిట్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. తొలిసారి ఒక వ్యక్తికి పేమెంట్ చేస్తున్నప్పుడురూ.2వేల కన్నా ఎక్కువ మొత్తమైతే.. ఆ లావాదేవీకి సంబంధించిన మొత్తం 4 గంటల తర్వాత ఎదుటి వ్యక్తి ఖాతాలో జమ అవుతుంది. ఈ లోపు లావాదేవీలను రద్దు చేసుకోవడంతో పాటు పంపే డబ్బుల విషయంలోనూ మార్పులు చేసేందుకు వీలు సైతం ఉంటుంది.