UPI Digital Payments| భారత్ లో 85శాతం దాటిన యూపీఐ డిజిటల్ చెల్లింపులు !
దేశంలోని డిజిటల్ చెల్లింపులలో.. 85 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

విధాత : భారత దేశంలో ఆర్థిక లావాదేవిల రంగంలో డిజిటల్ చెల్లింపుల(Digital Payments) విధానం రోజురోజుకు వృద్ధి చెందుతుంది. తాజాగా దేశంలోని డిజిటల్ చెల్లింపులలో.. 85 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు యూపీఐ(UPI) ద్వారానే జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) వెల్లడించారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీని విలువ సుమారు 280 బిలియన్ డాలర్లకు సమానం అని ఆయన వివరించారు. దేశ డిజిటల్ ఎకానమీలో యూపీఐ పెను విప్లవమని ఆయన అభివర్ణించారు. ఇదే అంశాన్ని వాషింగ్టన్ లో జరిగిన వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సమావేశాల్లో మల్హోత్రా ప్రకటించడం విశేషం. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చెల్లింపుల ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మార్చేసినట్టు చెప్పారు.‘వసుధైవ కుటుంబకం’యొక్క నిజమైన స్ఫూర్తితో డీపీపీల ప్రయోజనాలు ప్రపంచమంతటికీ అందుబాటులో ఉండాలని మేము ఆశిస్తున్నామని గవర్నర్ మల్హోత్రా అన్నారు.
యూపీఐ పరిధి దేశాలు దాటింది
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా మారిన యూపీఐ పరిధి.. దేశాలు దాటిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు. ఇండియాలో డిజిటల్ చెల్లింపు లావాదేవీలు యూపీఐ ద్వారానే కొనసాగుతున్నాయని తెలిపారు. డిజిటల్ గుర్తింపునకు ఉద్దేశించిన ఆధార్, రియల్‌టైమ్ చెల్లింపులకు వీలు కల్పిస్తున్న యూపీఐ ద్వారా.. తక్కువ వ్యయాలతో, ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించే వ్యవస్థలకు ఎలా నిర్మించొచ్చో విజయవంతంగా చూపించినట్టు పేర్కొన్నారు. యూపీఐ సురక్షితంగా, పారదర్శకంగా ఉండే డిజిటల్ పబ్లిక్ ప్లాట్ ఫామ్ అని..డిజిటల్ పబ్లిక్ ప్లాట్ ఫామ్ ల విషయంలో దేశ యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానం ఒక కేస్ స్టడీగా మారగలదని మల్హోత్రా వ్యాఖ్యానించారు. డిజిటల్ పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ లు సమ్మిళత వృద్ధి, ఆవిష్కరణలకు శక్తివంతమైన ఉత్ప్రేరకంగా మారాయని తెలిపారు. త్వరలోనే క్యాష్ లెస్(నగదు రహిత) చెల్లింపులు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ దేశాల్లో యూపీఐ సర్వీసులు
భారత దేశంలోని డిజిటల్ లావాదేవీలలో యూపీఐ దాదాపు 85శాతం వాటాను కలిగి ఉంది. ప్రపంచంలోని మొత్తం రియల్-టైమ్ డిజిటల్ పేమెంట్లలో సగం వాటాను యూపీఐ కలిగి ఉంది. యూపీఐ సర్వీసులు ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, నేపాల్, మారిషస్, పెరూ, సింగపూర్, శ్రీలంక, ఖతార్, భూటాన్‌లలో అందుబాటులో ఉంది. జపాన్‌తో పాటు NPCI 2025లో థాయిలాండ్, ఖతార్, ఆగ్నేయాసియా దేశాలతో సహా 4 నుంచి 6 కొత్త దేశాలకు యూపీఐని విస్తరించాలని యోచిస్తోంది. విదేశాల్లో కూడా యూపీఐ పేమెంట్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విస్తరణ అంతర్జాతీయంగా కనిపిస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగమైన NIPL, NTT డేటా జపాన్‌తో ఒప్పందంపై తాజాగా సంతకం చేసింది. ఈ ఒప్పందంతో భారత్ యూపీఐ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో తన గుర్తింపును పొందుతోందని, అంతర్జాతీయ లావాదేవీలను సులభతరం చేస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, NTT DATAతో అనుబంధం ఉన్న జపాన్ దుకాణదారులు ఇప్పుడు భారతీయ పర్యాటకుల నుండి యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తారు. అంటే భారతీయ పర్యాటకులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా తమ మొబైల్ నుండి చెల్లింపులు చేయవచ్చు.