తలనొప్పి వస్తోందని హాస్పటల్‌కు.. తుడిచిపెట్టుకుపోయిన 30 ఏళ్ల జ్ఞాపకాలు
తలకు ఏదో దెబ్బ తగలడం.. హఠాత్తుగా గతం మరిచిపోవడం అక్కడి నుంచి వారి కథ మారిపోవడం.. ఇలాంటి స్టోరీ లైన్ చాలా సినిమాల్లో కనిపిస్తుంది

విధాత: తలకు ఏదో దెబ్బ తగలడం.. హఠాత్తుగా గతం మరిచిపోవడం అక్కడి నుంచి వారి కథ మారిపోవడం.. ఇలాంటి స్టోరీ లైన్ చాలా సినిమాల్లో కనిపిస్తుంది. నిజంగా మన గతాన్ని మరచిపోవడం సాధ్యమేనా లేదా అలా జరుగుతుందా అని మనకు అనుమానం రావడం సహజమే. అలా సినిమా కథని తలదన్నేలాంటి నిజమైన మెమొరీ లాస్ ఘటన ఒకటి అమెరికా (America) లో జరిగింది. లూసియానా రాష్ట్రంలోని 60 ఏళ్ల కిమ్ డెనీకోలా (Memory Loss Grandma) కథే ఇది.
కాగా.. ఆమెకు 56 ఏళ్లు ఉన్నపుడు.. అంటే 2018లో సామూహిక బైబిల్ పఠనంలో ఉండగా తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం వంటి ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారు. అమె కోలుకున్న లేచిన తర్వాత అడిగిన ప్రశ్నలను విని కుటుంబసభ్యులు, డాక్టర్లు తెల్లబోయారు. నా యవ్వనం అంతా ఏమైపోయింది?, నాకు అప్పుడే ఎందుకు ఇంత వయసు వచ్చేసింది? మీరంతా ఎవరు అని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన డాక్టర్లు ఆమె గతాన్ని మరచిపోయిందని గుర్తించారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎవరని ప్రశ్నించగా రోనాల్గ్ రీగన్ అని కిమ్ బదులిచ్చింది. దీంతో ఆమె తన 30 ఏళ్ల జ్ఞాపకాలను కోల్పోయిందని వైద్యులు గుర్తించారు. కిమ్‌కు చివరిగా ఉన్న జ్ఞాపకం తన స్కూల్ చివరి రోజు ఇంటికి రావడమే. ఆ తర్వాత ఆమెకు పెళ్లై పిల్లలున్నారని, వారి పిల్లలకు అమ్మమ్మనయ్యానన్న జ్ఞాపకాలేవీ కిమ్‌కు లేకపోవడం విశేషం. కిమ్‌ను పూర్తిగా పరిశీలించిన డాక్టర్లు ఆమె ట్రాన్షియంట్ గ్లోబల్ అమ్నీసియా (టీజీఏ) బారిన పడినట్లు గుర్తించారు.
టీజీఏ అనేది తాత్కాలిక సమస్యేనని.. మధ్యవయసు నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారు ఎవరికైనా ఇది రావొచ్చని ద నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. అయితే ఆ ఘటన జరిగిన 5 ఏళ్ల అనంతరం.. 2023లో కూడా కిమ్‌కు జ్ఞాపకాలేవీ తిరిగిరాలేదు. ఈ క్రిస్‌మస్ సందర్భంగా ఆవిడ ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఈ వార్త వైరల్ అవుతోంది. నేను బైబిల్ స్టడీస్‌కు వెళతానని కానీ, ఒక ఆసుపత్రిలో చేరతానని కానీ, అక్కడ లేచేసరికి 60 ఏళ్ల ముసలిదానిలా అవుతానని ఎప్పుడూ అనుకోలేదు అని కిమ్ డెనీకోలా భావోద్వేగానికి గురైంది.
ఇప్పటికీ తాను గతం మరిచిపోయానని నమ్మలేకున్నానని.. నా 30 ఏళ్ల జీవితం కోల్పోయానని ఆమె భావిస్తూ ఉంటుంది. అయితే మెమొరీ లాస్ అవ్వకముందే ఆమె తన జీవితాన్ని ఒక జర్నల్ రాసుకున్నారు. అందులో తన పెళ్లి, ప్రేమ విషయాలనూ పంచుకున్నారు. అయితే అవి ఇప్పుడు చదువుతుంటే ఎవరివో బయటి వ్యక్తి విషయాలను చదువుతున్నట్లు ఉందని.. ఆ జీవితం తనది కాదని కిమ్ చెప్పుకొచ్చారు.
కొన్ని పేజీలు చదివేటప్పటికి చిరాకు వచ్చి వాటన్నింటినీ చించేశానని తెలిపారు. అయితే ఇప్పుడు తాను బాధ నుంచి మెల్లిగా బయటపడి.. చిన్నప్పుడు తాను చేయాలనుకున్న పనులను నేర్చుకుంటున్నానని.. జీవితానికి ఒక కొత్త అర్థం వెదకటానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఈ క్రిస్మస్‌కు తన కుటుంబంతో కలిసి ఒకే ఇంట్లో ఉండటం మరింత ఆనందాన్నిస్తోందని చెప్పుకొచ్చారు.