పార్టీని ఎప్పుడూ వీడలేదు.. బయట నుంచీ రాలేదు: ఉత్తమ్ కుమార్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎంపికపై నా అభిప్రాయాన్ని నేను పార్టీ హైకమాండ్‌కు చెప్పానని హుజూర్‌నగర్ తాజా ఎమ్మెల్యే ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

- సీఎం పదవిపై నా అభిప్రాయం హైకమాండ్‌కు చెప్పాను
- ఎవరి పేరు ప్రకటించినా నాకు ఓకే
విధాత : తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎంపికపై నా అభిప్రాయాన్ని నేను పార్టీ హైకమాండ్‌కు చెప్పానని, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు తాను ఢిల్లీ వచ్చానని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ, హుజూర్‌నగర్ తాజా ఎమ్మెల్యే ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా నేను కూడా సీఎం రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని, సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సర్యం జరుగలేదని, ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా దాటలేదన్నారు.
సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తానన్నారు. పార్టీ విధేయులను గుర్తించాలని హైకమాండ్‌ను డిమాండ్ చేశానన్నారు. నేను మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, బయట నుంచి రాలేదన్నారు. ఆరు సార్లు నేను ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, నేను నా భార్య ఎప్పుడు ప్రజా క్షేత్రంలోనే ఉంటామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70సీట్లు వస్తాయని అంచనా వేశానని, 64 దగ్గర ఆగిపోవడం నిరాశపరిచిందన్నారు.
ప్రతి ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని, నేను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు బీఆరెస్ ప్రభుత్వంపై ఇంతటి వ్యతిరేకత లేదన్నారు. ఇప్పుడు చాలా వ్యతిరేకత పెరిగిందని, కాంగ్రెస్‌కు మరిన్ని సీట్లు రావాల్సిఉండేనన్నారు. హైద్రాబాద్‌లో వాష్ అవుట్ అయ్యామని, గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో పార్టీ ఇలాంటి ఫలితాలు ఉహించలేదన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. నేను పీసీసీ ప్రెసిడెంట్ కాదు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేయలేదన్నారు. పార్టీ నాకు ఇచ్చిన పనిని ఎప్పుడైనా సమర్థంగా నిర్వహించానన్నారు.