పాలమూరులో విజయకేతనం ఎగరేస్తా
వెనుకబడిన పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచి పాలమూరు గడ్డపై కాంగ్రెస్ విజయకేతనాన్ని ఎగరేస్తానని చల్లా వంశీచంద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

- కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని నిలబెడుతా
- మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి
విధాత, హైదరాబాద్ : వెనుకబడిన పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచి పాలమూరు గడ్డపై కాంగ్రెస్ విజయకేతనాన్ని ఎగరేస్తానని చల్లా వంశీచంద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ తొలి విడతగా ప్రకటించిన 39 మంది అభ్యర్థుల జాబితాలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా నాకు చోటు కల్పించినందుకు కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. పార్టీ అధ్యక్షులు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని చెప్పారు.
తనకు అండగా నిలిచి, పాలమూరు అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14స్థానాలకు పైగా విజయం సాధించనుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే నిలబెట్టుకుంటున్న తీరు, కష్టాలు తీరుస్తూ… భవిష్యత్తును నిర్మించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న విధానం ప్రజల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోందని, పాలమూరు న్యాయ యాత్రలో జనం గుండె చప్పుడు నేను విన్నానని చెప్పారు.
పాలమూరు నిర్మాణానికి 10వేల కోట్లు
కాంగ్రెస్ ఎప్పుడైనా విధానాలకు కట్టుబడి లక్ష్య సాధన కోసం పని చేసే పార్టీనని సీఎం రేవంత్‌రెడ్డి తొలి మూడు నెలల్లోనే పాలమూరు పునర్నిర్మాణం కోసం 10 వేల కోట్లకుపైగా వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. నారాయణ పేట కొడంగల్ పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రతిష్టాత్మక విద్య వైద్య సంస్థల ఏర్పాటు, రోడ్లు మౌలిక సదుపాయాల నిర్మాణంతో సహా ప్రతి రంగంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరులో తనదైన ముద్ర వేస్తున్నారని తెలిపారు.
గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆరెస్ పార్టీ నక్కజిత్తులతో పాలమూరు మోసపోయి గోస పడిందని, ఇదే కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మన తెలంగాణనే కాదు వెనుకబడిన మహబూబ్ నగర్ ను కూడా పట్టించుకున్న సందర్భం ఒక్కటి లేదన్నారు. ఆ పదేండ్ల నష్టాన్ని పూడుస్తూ భవిష్యత్ వైపు పాలమూరు ప్రగతిని నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థమైన విధానంతో అడుగు వేస్తోందని, అందుకే అడుగడుగునా ప్రజా మద్దతు తోడు అవుతోందన్నారు.
కరువు లేని మహబూబ్ నగర్ – అనే ఆకాంక్ష ఇన్నాళ్లకు వాస్తవం కాబోతున్నదని, ప్రాజెక్టులు నిర్మించి, జల కళ తెచ్చి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో నేను మీ ముందుకు వస్తున్నానని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో పాలమూరు కోసం కాంగ్రెస్ సిద్ధం చేసిన అభివృద్ధి ప్రణాళికను మీరు చేతల్లో చూడబోతున్నారని హామీ ఇచ్చారు. ఎంపీగా విజయం సాధించి నేను పుట్టిన గడ్డకు కరువు నుంచి విముక్తి కల్పించడం నా ముందున్న ముఖ్య లక్ష్యమని, ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో మహబూబ్ నగర్ రాత మారుస్తాననే నమ్మకం నాదని, అలాగే మన అందరిదీ అని స్పష్టం చేశారు.