ఫిబ్రవరి 28నుంచి ఇంటర్.. మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు
ఇక పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు ‘పరీక్షాకాలం’ మొదలైంది. టెన్త్, ఇంటర్ పరీక్షలను తమ పిల్లలు ఎలా రాస్తారోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు ఉంటారు.

- మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు
- ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ విద్యార్థులకు
- పక్కాగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- పరీక్ష కేంద్రాల వద్ద సకల సదుపాయాలు
- సమీక్షించిన వనపర్తి జిల్లా కలెక్టర్
ఫిబ్రవరి 28నుంచి ఇంటర్.. మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు
విధాత వనపర్తి: ఇక పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు ‘పరీక్షాకాలం’ మొదలైంది. టెన్త్, ఇంటర్ పరీక్షలను తమ పిల్లలు ఎలా రాస్తారోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు ఉంటారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగింపునకు వస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు సిద్ధం చేసుకోవాలని జిల్లా విద్యాధికారులను కలెక్టర్లు ఆదేశిస్తున్నారు.
పరీక్ష కేంద్రాల్లో సరిపడా బెంచీలు, సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్తు, లైట్లు తదితరాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు.. మరుగుదొడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రథమ చికిత్స వంటి అన్ని వసతులు ఉండాలన్నారు. ప్రశ్న పత్రాల కస్టడీ సెక్యూరిటీ రూమ్, ఉదయం నిబంధనల మేరకు ప్రశ్న పత్రాల తరలింపు, సీసీ కెమెరాల ముందు మాత్రమే ప్రశ్న పత్రాలు తెరవడం వంటి జాగ్రత్తలు చేపట్టనున్నారు. పరీక్షలు నిర్వహించే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు.
144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సమయానికి ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై వనపర్తి జిల్లా తేజస్ నంద లాల్ పవార్ సోమవారం ప్రజావాణి హాల్లో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు లైన్ డిపార్ట్ మెంట్లు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితిలోనూ చిట్టీలు, మాల్ ప్రాక్టీస్ నడిచేందుకు ఆస్కారం ఇవ్వరాదని ఆదేశించారు. ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీ అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద పారిశుధ్యంపై బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షకు వనపర్తి జిల్లాలో మొదటి సంవత్సరం 6576 మంది, ద్వితీయ సంవత్సరం 5881 మంది.. మొత్తంగా 12,457 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పదో తరగతి పరీక్షలకు 6906 మంది రెగ్యులర్ విద్యార్థులు, 63 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు.
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. వేసవి కాలంలో పరీక్షలు జరుగుతున్నందున తాగునీరు, ప్రథమ చికిత్సకు సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేశ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.