Warangal | ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ సభా?
Warangal కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు మొన్న ములుగు, నేడు మానుకోట మారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీరు కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇటీవల ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి పార్టీ సభకు తేడా లేకుండా పోతోంది. ప్రభుత్వ కార్యక్రమ పరిధిని మరిచిపోయి అధికారిక కార్యక్రమాల్లో రాజకీయంగా తమకు గిట్టని పార్టీలపై, పార్టీ నాయకులపై విమర్శలు చేయడం రివాజుగా మారింది. అధికారంలో ఉన్నామనే ఒకే కారణంతో అధికారుల సమక్షంలో ఎదుటి […]

Warangal
- కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు
- మొన్న ములుగు, నేడు మానుకోట
- మారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీరు
- కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇటీవల ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి పార్టీ సభకు తేడా లేకుండా పోతోంది. ప్రభుత్వ కార్యక్రమ పరిధిని మరిచిపోయి అధికారిక కార్యక్రమాల్లో రాజకీయంగా తమకు గిట్టని పార్టీలపై, పార్టీ నాయకులపై విమర్శలు చేయడం రివాజుగా మారింది. అధికారంలో ఉన్నామనే ఒకే కారణంతో అధికారుల సమక్షంలో ఎదుటి రాజకీయపక్షాన్ని విమర్శించడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇవేమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మొన్న ములుగు జిల్లా పర్యటన సందర్భంగా, నేడు శుక్రవారం పోడుపట్టాల పంపిణీ సందర్భంగా మానుకోటలో జరిగిన అధికారిక సభల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు. అయితే ఇదే వేదిక నుంచి ప్రధానమంత్రిని కూడా మంత్రి ప్రశ్నించారు.
ప్రధాని విభజన హామీల పై విమర్శలు
చట్టబద్ధమైన రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడం గురించి ప్రధానిని ప్రశ్నించడం మేరకు ఒక విధంగా అంగీకరించే అంశం. సభలో కేటీఆర్ మాట్లాడుతూ విభజన హామీలను అమలు చేయని ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
అంతటితో ఆగకుండా మంత్రి కేటీఆర్ తమ పార్టీని, పార్టీ నాయకుల పేరు ఉచ్చరిస్తూ మాట్లాడమేంటంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ తీరుపై మండిపడుతున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాదయాత్ర చేస్తూ ప్రశ్నించాడని, పిసిసి అధ్యక్షుడి పేరు చెప్పకుండా విమర్శించారు. ఇక 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటూ మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ లాంటి కాంగ్రెస్ నాయకులు మళ్లీ వస్తారని విమర్శించారు. 50 ఏళ్లు చేసిన మోసాలు గుర్తు చేసుకోవాలని, ఆగం కావద్దని తనదైన రీతిలో పార్టీ సభల్లో ప్రసంగించినట్లు ప్రసంగించారు.
జిల్లా అధికారుల సమక్షంలో
ఇదే వేదికపై జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు పక్కనే జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ పవార్ ఇతర అధికారులు ఆసీనులై ఉండటం గమనార్హం. అధికారుల సమక్షంలో, అధికారిక కార్యక్రమంలో ఎదుటి రాజకీయపక్షాలను విమర్శించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది.
మొన్న ములుగు దశాబ్ది ఉత్సవాలలో..
ఇప్పటికే మొన్న ములుగులో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అధికారుల సమక్షంలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై చేసిన ప్రసంగంపై స్థానిక ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు.
నేడు మానుకోటలో..
శుక్రవారం మానుకోటలో కూడా కేటీఆర్ అదే పునరావృతం చేయడం విమర్శలకు తావిస్తోంది. మరో విషయం ఏంటంటే మానుకోట జిల్లా పరిధిలోని కొత్తగూడెం, గంగారం మండలాలు సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. వాస్తవానికి ఈ అధికారిక కార్యక్రమానికి ఎమ్మెల్యేగా ఆమె కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కారణమేదైనా సీతక్క హాజరుకాలేదు.
ఆమె ఈ అధికారిక సభల్లో భాగస్వామ్యమైతే ఆమె ముందే మంత్రులు కాంగ్రెస్‌ను విమర్శించడాన్ని ఆమె అంగీకరిస్తారా? ఇలాంటి సందర్భాల్లో ఎదుటి పక్షం ప్రజాప్రతినిధులు అదే వేదికపై ప్రశ్నిస్తే వివాదానికి తావివ్వవా? అంటూ పరిశీలకులు అంటున్నారు. ఎవరైనా, ఏ పార్టీ అయినా, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం, పార్టీ మధ్య ఉన్న తేడాలను గుర్తించి మసలుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.