డీజీపీ రేసులో ఎవరెవరు..? అదృష్టం ఎవర్ని వరించనుందో..?
Telangana DGP | విధాత: తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ 31న రిటైర్మెంట్ కానున్నారు. మరి కొత్త డీజీపీ ఎవరు? రేసులో ఎవరెవరు ఉన్నారు? ఎవర్ని అదృష్టం వరించనుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అనురాగ్ శర్మ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2017 వరకు సేవలందించారు అనురాగ్ శర్మ. ఆ తర్వాత మహేందర్ రెడ్డి డీజీపీగా నియామకం అయ్యారు. మహేందర్ రెడ్డి డిసెంబర్ 31న పదవీ […]

Telangana DGP | విధాత: తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ 31న రిటైర్మెంట్ కానున్నారు. మరి కొత్త డీజీపీ ఎవరు? రేసులో ఎవరెవరు ఉన్నారు? ఎవర్ని అదృష్టం వరించనుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అనురాగ్ శర్మ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.
2017 వరకు సేవలందించారు అనురాగ్ శర్మ. ఆ తర్వాత మహేందర్ రెడ్డి డీజీపీగా నియామకం అయ్యారు. మహేందర్ రెడ్డి డిసెంబర్ 31న పదవీ విరమణ పొందనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎవరు? అనే అంశం ఉత్కంఠగా మారింది. ఇదే విషయంపై అటు పోలీసు వర్గాల్లో, ఇటు ప్రజల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.
రాష్ట్ర పోలీసు శాఖలో ప్రస్తుత సీనియారిటీ ప్రకారం.. 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేశ్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన గోవింద్ సింగ్, అంజనీకుమార్, రవి గుప్తా డైరెక్టర్ జనరల్ ర్యాంకులో ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్, సీవీ ఆనంద్ అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. అయితే ఈ సీనియారిటీ ప్రకారం.. సీనియర్‌గా ఉన్న ఉమేశ్ 2023, జూన్‌లో పదవీ విరమణ పొందనున్నారు.
సీఐడీ డైరెక్టర్ గోవింద్ సింగ్ కూడా ఈ నెల 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఏసీబీ డీజీ అంజనీ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ప్రస్తుతం డీజీ హోదాలో ఉన్నారు. వీరు రాష్ట్ర పోలీసు బాస్ రేసులో ఉంటారు. ఇక గోవింద్ సింగ్ పదవీ విరమణతో ఖాళీ అయ్యే డీజీ ర్యాంకు పోస్టులోకి రాజీవ్ రతన్ పదోన్నతి పొందనున్నారు.
ఒకే బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా.. ప్రభుత్వం ఎక్స్ కేడర్ కోటా కింద మరో డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించేందుకు అవకాశం ఉంది. అంటే సీవీ ఆనంద్‌కు కూడా డీజీ ర్యాంకు పదోన్నతి రావొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా అంజనీ కుమార్, రవి గుప్తాలతో పాటు రాజీవ్ రతన్, సీవీ ఆనంద్ కూడా రాష్ట్ర పోలీసు బాస్ రేసులో ఉండేందుకు అవకాశం ఉంటుంది.
డిసెంబర్ రెండో వారంలో యూపీఎస్సీకి జాబితా
కొత్త డీజీపీ నియామకానికి సంబంధించి ప్యానల్ జాబితాను డిసెంబర్ రెండో వారంలో యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకుని అదనపు డీజీపీ హోదాలో ఉన్న వారి పేరునూ డీజీపీ పోస్టు కోసం పరిశీలించే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన అదనపు డీజీపీ జితేందర్ పేరూ నియామక ప్యానల్ జాబితాలోకి వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.
ఉమేష్ షరాఫ్, రవిగుప్తా, అంజనీకుమార్, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్ పేర్లను పంపే అవకాశం ఉంది. 2023 జూన్‌లో రిటైర్ కానున్న ఉమేష్ షరాఫ్ పేరును పరిగణనలోకి తీసుకోకున్నా డీజీ హోదా అధికారి కాబట్టి పంపడం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం పంపే జాబితా నుంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీ తిరిగి సూచిస్తుంది. అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకునే అవకాశం ఉంటుంది.