VC Sajjanar and CP Anand | నూతన బాధ్యతల్లో సజ్జనార్…ఆనంద్
సీనియర్ ఐపీఎస్ వీ.సీ. సజ్జనార్ హైదరాబాద్ సీపీగా, సీ.వీ. ఆనంద్ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు చేపట్టారు.

విధాత, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ లు వీ.సీ.సజ్జనార్, సీ.వీ. ఆనంద్ లు మంగళవారం తమ కొత్త బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ను హైదరాబాద్ సీపీగా, ఆ పోస్టులో ఉన్న ఆనంద్ ను రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం తాజాగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరు కూడా తమకు కేటాయించిన కొత్త పోస్టుల్లో చేరిపోయారు.
హైదరాబాద్ కొత్త సీపీగా చార్జ్ తీసుకున్న సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పోలీస్ కు దేశంలో మంచిపేరు ఉందని..ఆ పేరును మరింత ఇనుమడించేలా బాధ్యతలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు కూడా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. రౌడీయిజం..సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్స్, మహిళల పట్ల నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ లక్ష్యమైన డ్రగ్స్ రహిత సిటీ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు, డ్రంక్ ఆండ్ డ్రైవ్ నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరాల నివారణకు మరింత ఆధునిక టెక్నాలాజీ వినియోగిస్తామని.. సీసీ కెమెరాలకు తోడుగా డ్రోన్ ల వినియోగం పెంచుతామన్నారు.