Maha Shivratri: శివరాత్రి జాగరణ ఎందుకు చేస్తారు? ఎలా చేయాలి!

- శివ సాన్నిధ్యం పొందాలంటే..? శివరాత్రి రోజున వీటిని తప్పక ఆచరించాలి
హిందువులకు ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ప్రధానమైనది. ఆ రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానమాచరించి.. శివుడికి తమ శక్తి కొలది పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు. మరి శివరాత్రి.. పండుగ రోజు ఎందుకు అయింది? ఆ రోజున జాగరణ ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? చేస్తే ఏ ఫలితాలు ప్రాప్తిస్తాయి.. తదితర విషయాలు మీ కోసం. -విధాత
18న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కథనం.
శివరాత్రి.. శివ అంటే శివుడు.. రాత్రి అంటే పార్వతి. వీరిద్దరికి వివాహమైన రాత్రే శివరాత్రి. వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించరు. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అంటారు. వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది అయినది కాబట్టే శివరాత్రి విశ్వానికంతటికీ పర్వదినం అయింది. అంతేకాదు ఈ ఏడాది వస్తున్న మహాశివరాత్రి పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉన్నది. శని త్రయోదశితో కలిసి వస్తున్న శివరాత్రి 12 పుష్కరాలకు అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.
అంతేకాదు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి వారికి జ్క్షానోపదేశం చేసినది ఈ శివరాత్రి నాడే. అందుకే మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావించి శివారాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది. ఈ శివరాత్రి పర్వదినం నాడే శివపార్వతులకు కళ్యాణం చేసి కొలుచుకోవడం ఆనవాయితీ అయింది.
అభిషేకం ఎందుకు చేయాలి?
‘అభిషేక ప్రియం శివః’ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం. నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివుడికి చాలా ఇష్టం. నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందుకే శివుడికి నీరు అంటే చాలా ఇష్టం. శివుడికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటి స్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో శివుడు పులకిస్తాడు.
‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః’
శివుడికి ప్రీతికరమైన అభిషేకం..
శివుడికి ఎన్నో రకాల పదార్థాలతో, ద్రవ్యాలతో భక్తులు అభిషేకాలు చేస్తుంటారు. అయితే అభిషేకాలన్నిం టిలో జలాభిషేకం అంటేనే శివుడికి ప్రీతికరం. అందులోనూ గంగా జలంతో అభిషేకం చేస్తే మురిసి పోతాడు. ఎందుకంటే ‘గంగ విష్ణుపాదోద్భవ’ విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం. అందుకే శివుడు గంగను తన శిరసున ధరించి గౌరవించాడు. జలం తర్వాత చితాభస్మంతో అభిషేకాన్ని శివుడు ఇష్టపడతాడు.
చితాభస్మాభిషేకం..
మహాశివుడు చితాభస్మాంగదేవుడు కదా! ఈ అభిషేకం ఉజ్జయినిలో మహాకాలేశ్వరునికి ప్రతి నిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది. ఏది ఏమైనా శివాభిషేకం సంతతధారగా జలంతో చేయడమే ఉత్తమం. ఎందుకంటే జలధార శివః ప్రియః అన్నారు కదా! ఈ అభిషేకాన్ని రుద్రైకాదశిని అనబడే నమక, చమకాలతో చేయాలి.
వాయుపురాణంలో…
అనంతరం మారేడు దళాలతో, తుమ్మి పూలతో అర్చించాలి. నమకంలోని నమశ్శివాయ అను పంచాక్షరీ మంత్రంలో శివ అనే రెండు అక్షరాలు జీవాత్మ అనే హంసకు రెండు రెక్కల వంటివి. జీవుని తరింప జేయడానికి శివాభిషేకం అత్యంత ఉత్తమైన సులభమార్గమని వాయుపురాణం చెబుతుంది. వేదేషు శతరుద్రీయం దేవతాను మహేశ్వరః అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో వేదాలో శతరుద్రీయం అంత గొప్పది.
నిత్యాభిషేకం కుదరకపోతే..
నమక చమకాలు గల ఈ రుద్రంతో శివుడికి అభిషేకం చేస్తే సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు రుషి చెప్పాడు. అందుకే శివుడిని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చేయడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంత పుణ్యం లభిస్తుంది.
శివుడు దేవతలకు చెప్పిన రహస్యం..
శివరత్రౌ అహోరాత్రం నిరాహోరో జితేంద్రియః
ఆర్చయేద్వా యధాన్యయం యధాబలమ చకం
యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం
తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్
శివరాత్రి నాడు పగలు, రాత్రి ఉపవాసముండి ఇంద్రియ నిగ్రహంతో శక్తి వంచన లేకుండా శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చంచిన వారికి సంవత్సరమంతా నన్ను అర్చంచిన ఫలం ఒక్క శివరాత్రి అర్చన వలన లభిస్తుందని శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
ఓం నమశ్శివాయ మంత్రాన్ని పఠిస్తూ…
శివరాత్రికి ముందురోజున అనగా మాఘ బహుళ త్రయోదశి నాడు ఏకభుక్తం చేసి ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిద్ర చేయాలి. మరునాడు మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి పర్వదినం కనుక ప్రాతఃకాలంలో లేచి స్నానాదికాలు పూర్తి చేసుకొని శివాలయానికి వెళ్లి ఆ రోజు మొత్తం శివుడిని అభిషేకించాలి.
రాత్రంతా జాగరణ చేసి శివుడిని అర్చించాలి. లింగోద్భవ కాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి. తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి చతుర్దశి ఘడియలు పోకుండా అన్న సమారాధన చేయాలి. నమక చమకాలతో అభిషేకం చేయలేని వారు ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.
బిల్వ పత్రాల విశిష్టత
శివపూజకు బిల్వ పత్రాలు(మారేడుదళాలు) సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం అని శాస్త్రప్రమాణం. మారేడు దళాలతో శివార్చన చేయడం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది. సాలగ్రామ దాన ఫలం. శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం లభిస్తుంది.
వేయి అన్నదానాలు చేసిన ఫలం. కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం. ఒక బిల్వదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని బిల్వాష్టకంలో చెప్పబడింది. ఏకబిల్వం శివార్పణం అని శివుడిని అర్చిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయి. బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, తమో గుణాలకూ… శివుడి త్రినేత్రాలకూ.. త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు.
బిల్వదళం ముందు భాగంలో అమృతం. వెనుక భాగంలో యక్షులు ఉంటారు. బిల్వదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి. ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆ లోపు ఆ బిల్వ దళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
జాగరణ ఎందుకు చేయాలి..
క్షీరసాగర మథన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు.. మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ శివుడికి నిద్ర రాకుండా ఉండాలని తెల్ల వార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే శివరాత్రి నాడు భక్తులకు ఆచరణీయమైనది.
జాగరణ అంటే నిద్ర పోకుండా సినిమాలు చూస్తూ గడపడం కాదు. జాగరూకతో శివుడిని భక్తిగా అర్చించడం. శివుడు నిరాడంబరుడు.. శివుడు నిర్మల హృదయుడు.. శుద్ధ స్ఫటిక మనస్కుడు అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలూ, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు. మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది.
ఐశ్వర్య ప్రదాత…
శరీర వ్యామోహం లేనివాడు కనుకే తైల సంస్కారంలేని జటాజుటంతో చితా భస్మాన్ని పూసుకుని గజ చర్మాన్ని ధరించి పాములను మాలలుగా వేసుకొని నిగర్విగా తిరుగుతాడు. ఆయన జీవనవృత్తి భిక్షాటనం. అందుకనే ఆయనను ఆది భిక్షువు అంటారు. ఆయన భుజించే భోజనపాత్ర కపాలము. ఆయన నివాస స్థానము శ్మశానం. ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడా కనిపించడు. ఈ నిర్జనుడు మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత.
శివ సాన్నిధ్యం పొందాలంటే…
ఈశ్వర భక్తుడైన రావణుడు ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే. బ్రాహ్మణ వంశంలో జన్మించి వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా మహాశివరాత్రి నాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి శివపూజ చేసి శివప్రసాదం తిన్న గుణనిధి మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు. అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే శివరాత్రి మహత్యం.
శివా అని ఆర్తిగా పిలిస్తే…
రావణసంహారం చేసిన శ్రీరాముడు బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో సైకతలింగ ప్రతిష్ఠ చేసి పాపవిముక్తుడు అయ్యాడు. ఆ క్షేత్రమే రామేశ్వరం. శివుడిని శరణుకోరి మార్కండేయ యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు. శివునికి తన నేత్రాలతో అర్చించిన తిన్నడు భక్త కన్నప్పగా వాసికెక్కాడు.
ఇలా చెబుతూ పోతే ఎందరో మహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి. అట్టి నిరాకార నిర్గుణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ నిటేక్షుని ప్రేమానురాగాలు అనంతం. ఎల్లలు లేనిది ఆయన మమకారం. శివా అని ఆర్తిగా పిలిస్తే చెంతనుండు ఆశ్రిత వత్సలుడాయన.
శ్మశానంలోనూ తోడుండే దేవ దేవుడు…
దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివదేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆతర్వాత వెంట ఎవరూ రారు. కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్లిపోతారు. దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర నీకు నేనున్నారురా దిక్కు అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు శివుడు ఒక్కడే.
సదాశివుడి రుణం తీర్చేదెలా..?
పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి. ఆ పరమేశ్వరుడు ఒక్కడే.. ఇది చాలదా మన జన్మకు.. ఏమిస్తే ఆ సదాశివుడి రుణం తీరుతుంది. భక్తిగా ఓ గుక్కెడు నీళ్లతో అభిషేకించడం తప్ప.. ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప.. తృప్తిగా నమశ్శివాయ అంటూ నమస్కరించడం తప్ప.. అందుకే మహాశివరాత్రి నాడైనా మహాదేవుడిని స్మరించి తరిద్దాం.. మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం.
ఈశానస్సర్వ విద్యానం ఈశ్వరస్సర్వభూతానం
బ్రహాధిపతిర్ బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు.
ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకర…