Khushbu Sundar | ‘మోదీ అంటే అవినీతి’ అన్న ఖుష్బూపై చర్యలు ఉంటాయా.. నాటి ట్వీట్లతో కొత్త తలనొప్పి

విధాత‌: ఏది ఏమైనా.. సిద్ధాంతాలు నమ్మి ఒక పార్టీలో ఉన్నప్పుడు.. మరో పార్టీ నేత మీద ఊరికే ఎగిరెగిరి పడకూడ‌దు! సీజన్‌కో పార్టీ మారేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చాన్నాళ్ల ముందు మాట్లాడే విషయంలో అన్నింటికి మించి ట్విట్టర్‌ కూతల్లో కాస్త సంయమనం పాటించాలి. ఎందుకో తెలియాలంటే గతకాలపు అందాల నటి.. ఇప్పటికే పలు పార్టీలు మారిన రాజకీయ నేత.. ప్రస్తుత బీజేపీ నాయకురాలు ఖుష్బూ (Khushbu Sundar) కామెంట్ల కథ తెలుసుకోవాలి. సుశీల్‌ […]

Khushbu Sundar | ‘మోదీ అంటే అవినీతి’ అన్న ఖుష్బూపై చర్యలు ఉంటాయా.. నాటి ట్వీట్లతో కొత్త తలనొప్పి

విధాత‌: ఏది ఏమైనా.. సిద్ధాంతాలు నమ్మి ఒక పార్టీలో ఉన్నప్పుడు.. మరో పార్టీ నేత మీద ఊరికే ఎగిరెగిరి పడకూడ‌దు! సీజన్‌కో పార్టీ మారేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చాన్నాళ్ల ముందు మాట్లాడే విషయంలో అన్నింటికి మించి ట్విట్టర్‌ కూతల్లో కాస్త సంయమనం పాటించాలి.

ఎందుకో తెలియాలంటే గతకాలపు అందాల నటి.. ఇప్పటికే పలు పార్టీలు మారిన రాజకీయ నేత.. ప్రస్తుత బీజేపీ నాయకురాలు ఖుష్బూ (Khushbu Sundar) కామెంట్ల కథ తెలుసుకోవాలి. సుశీల్‌ మోదీ, నీరవ్‌ మోదీ తదితరులను ప్రస్తావిస్తూ దొంగలందరికీ మోదీ అనే తోక ఉన్నదేంటని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్య.. ఆయన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయేందుకు దారి తీసింది.

ఇదే తరహాలో ఖుష్బూ కూడా గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ట్విట్టర్‌లో ‘మోదీ’ ఇంటిపేరును ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. అప్పుడంటే ఆమె చోటా నాయకురాలు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. ఇప్పడు ఇదే అంశంలో రాహుల్‌గాంధీ అనర్హత వేటు ఎదుర్కొన్న సమయంలో ఆమె బీజేపీలో ఉన్నారు.

ఇదే సమయమని.. ఆమె గతంలో మోదీ ఇంటి పేరును వాడుతూ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నది. ఖుష్బూ ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఆమెపై కూడా కేసు వేస్తారా? అని గుజరాత్‌ మంత్రి పూర్ణేశ్‌ మోదీని ప్రశ్నిస్తున్నది.

తమిళనాడుకు చెందిన ఖుష్బూ సుందర్‌.. 2020లో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి, బీజేపీలో చేరారు. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఉన్నారు. 2018లో మోదీపై ఒక ట్వీట్‌ చేసిన ఖుష్బూ.. మోదీ అంటే అర్థం అవినీతి అని మార్చాలని పేర్కొన్నారు. ‘మోదీ అన్ని చోట్లా ఉన్నారు. కానీ ఏంటిది? మోదీ అనే ఇంటి పేరు అవినీతితో సంబంధం కలిగి ఉన్నది. మోదీ అంటే అవినీతి. నీరవ్‌, లలిత్‌, నమో అవినీతి’ అని ఆమె పోస్ట్‌ చేశారు.

ఈ పోస్టు ఇప్పడు తెగ వైరల్‌ అవుతున్నది. మరి ఖుష్బూపై చర్యలు ఉంటాయా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణలో పడిపోయిన ఖుష్బూ.. అసలు విషయం చెప్పకుండా.. తాను చేసిన పాత ట్వీట్‌ను కాంగ్రెస్‌ పార్టీ రేకెత్తిస్తున్న‌ద‌ని, ఆ పార్టీ ఎంత నిస్పృహలో ఉన్నదో తెలుసుకునేందుకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. అసలు ఆ ట్వీట్‌ చేసినందుకు తానేమీ సిగ్గుపడటం లేదని, అప్పడు తాను ఉన్న పార్టీ తరఫున ఆ పార్టీ నాయకత్వం భాషనే ఉపయోగించానని సమర్థించుకున్నారు కూడా. ఏదైనా.. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎగిరెగిరి వ్యాఖ్యలు చేయడం.. ప్రత్యేకించి ఎప్పడూ పార్టీలు మారే వారికి మంచిది కాదని రాజకీయ పరిశీలకులు సలహా ఇస్తున్నారు.