KTR: నన్ను అరెస్టు చేస్తారేమో : కేటీఆర్

KTR : ఫార్ములా ఈ కారు రేస్ కేసులో నన్ను అరెస్ట్ చేసి..జైలుకు పంపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో, మాజీ మంత్రి టి.హరీశ్ రావుతో భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ధ మీడియాతో మాట్లాడారు. నన్ను ఈ రోజు అరెస్టు చేయవచ్చని..నాకు జైలు కొత్తేమీ కాదని..తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిని అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ-రెస్ అంశంలో నాలుగు గోడల మధ్య నన్ను విచారించడం కాదు..దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని చెబితే ..చర్చించే దమ్ము, ధైర్యం లేక సీఎం రేవంత్ రెడ్డి పారిపోయాడన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలనే దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా హాజరువతాననని.,మాకు చట్టం అంటే గౌరవం ఉన్నదని..విచారణకు సహకరిస్తానన్నారు.
వేయి కేసులు పెట్టినా..కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తాం
కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టారని..నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారని..మాపై అక్రమ కేసులతో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కేసులతో వేధించినంత మాత్రానా ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపబోమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు, 420హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటామన్నారు. వేయి కేసులు పెట్టిన ప్రశ్నించడం ఆపేది లేదన్నారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలా ఉండేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదని..ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతామని..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీల అమలుపై వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అందాల పోటీలు పెట్టి ప్రపంచం ముందు తెలంగాణను అభాసుపాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మెుగోడైతే.. దమ్ముంటే ఏసీబీ కేసుల్లో తనతో పాటు లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ చేశారు.
బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక ఎన్నికలా?
కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందని…బీసీలు అన్ని గమనిస్తున్నారన్నారు. రైతుబంధును ఎలక్షన్ బందుగా మార్చి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని రాష్ట్ర మహిళలు గమనిస్తున్నారన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చేసిన మోసాన్ని నిరుద్యోగులు యువత గమనిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకునేందుకు ఏం లేకనే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఏదో ఒక కమిషన్ ఎంక్వయిరీ అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. దున్నపోతు ఈనింది అంటే దూడనీ కట్టేయమన్నట్టుగా రాష్ట్రంలో బీజేపీ వైఖరి ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీల దొంగనాటకాలు.. దొంగ బాగోతం అంతా తెలంగాణ ప్రజలకు అంతా అర్థమవుతుందన్నారు.