MLC Kavitha | హస్తినకా.. అసెంబ్లీకా..! వచ్చే ఎన్నికల్లో కవిత దారెటు?

MLC Kavitha ఇందూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా కవిత అన్ని తానై పార్టీ విజయాలకు ఎమ్మెల్సీ కృషి కవిత పోటీపై జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తి (విధాత ప్రతినిధి, నిజామాబాద్) నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న కవిత.. ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారా? లేక యథావిధిగా ఎంపీ స్థానానికే పోటీ పడతారా? అన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది. ఆమె నాయకత్వంలో జిల్లాలో బీఆర్ఎస్‌కు గత రెండు ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల […]

MLC Kavitha | హస్తినకా.. అసెంబ్లీకా..! వచ్చే ఎన్నికల్లో కవిత దారెటు?

MLC Kavitha

  • ఇందూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా కవిత
  • అన్ని తానై పార్టీ విజయాలకు ఎమ్మెల్సీ కృషి
  • కవిత పోటీపై జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తి

(విధాత ప్రతినిధి, నిజామాబాద్)
నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న కవిత.. ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారా? లేక యథావిధిగా ఎంపీ స్థానానికే పోటీ పడతారా? అన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది. ఆమె నాయకత్వంలో జిల్లాలో బీఆర్ఎస్‌కు గత రెండు ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి.

2018 ఎన్నికల్లో కవిత కీలక పాత్ర పోషించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు రావటంతో జిల్లాకు ఆ మధ్య రావటం తగ్గించిన కవిత.. ఇటీవల పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా నిర్వహిస్తున్న పర్యటనలు పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపుతున్నాయి. ఇటీవల జగిత్యాల, నిజామాబాద్ పర్యటనలతో క్యాడర్ ఉత్సాహంతో ఉన్నది. ఇదే సమయంలో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేక ఎంపీగానే అనే చర్చ కూడా నడుస్తున్నది.

ఎంపీగానే?

కవిత అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం ఆ మధ్య జరిగింది. కానీ ఆమె ఇటీవలి కాలంలో అటు జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనటంతోపాటు.. ఇటు నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొనటంతో మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పసుపు బోర్డు హామీతో గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అరవింద్ ఆ హామీ నెరవేర్చలేదు. అరవింద్ హామీ ఏమైందని చాలాకాలంగా జిల్లాలో పసుపు రైతులు నిలదీస్తూ వస్తున్నారు..

ఓడినా.. తగ్గని ఓట్లు!

గత ఎన్నికల్లో కవిత ఓట్లు ఏ మాత్రం తగ్గలేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మాదిరే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చాయి. అయితే 185 మంది నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఇందులో 175 మందికి పైగా పసుపు బోర్డు కోసం పోటీకి దిగిన రైతులు ఉన్నారు. దీంతో కొన్ని ఓట్లు కవితకు మైనస్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీని అంతగా పట్టించుకోలేదన్న వాదన ఉంది. కొంత కాంగ్రెస్ ఓట్లు చీలటంతో అరవింద్‌కు కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎంపీగా విశేష కృషి

కవిత ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశారు. బీడీ కార్మికులకు పింఛన్‌ ఇప్పించటం మొదలుకుని.. కేంద్ర నిధుల నుంచి వికలాంగులకు బ్యాటరీ వెహికిల్స్ అందించడం, ఆశా వర్కర్లకు జీతాలు పెంచటంలో కవిత కృషి ఉందని, లక్కంపల్లి సెజ్ కంపెనీలను తీసుకొచ్చారని కార్యకర్తలు చెబుతుంటారు.

పసుపు బోర్డు కోసం కవిత ఎంతో కృషి చేశారు. మహిళల్లో కవితకు మంచి ఆదరణ ఉంది. ఈ పరిస్థితుల్లో కవిత వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్లమెంట్‌కే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అటు ఎంపీ అరవింద్‌కు కూడా కవిత సవాల్ విసిరారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటబడి మరీ ఓడిస్తానని ప్రెస్‌మీట్‌లో కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్సీ కవిత.

మరోవెపు పసుపు బోర్డు హామీ నేరవేర్చటంలో అరవింద్‌ విఫలమయ్యారన్న భావన ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పసుపు రైతుల్లో ఉంది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గాల ప్రజలు ఇప్పుడు మళ్లీ కవిత వైపే మొగ్గుచూపుతున్నారని తెలుస్తున్నది.

టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారి.. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ కవిత పాత్రను దేశ రాజకీయాల్లో వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీగా చేసిన అనుభవం కవిత సొంతం. వివిధ పార్టీ నాయకులతో కవితకు మంచి సంబంధాలున్నాయి.

దీంతో సీఎం కేసీఆర్ కూడా కవితను ఎంపీగా మరోసారి పార్లమెంట్‌కు పంపేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కవిత ఎంపీగా పోటీ చేసినా ఎమ్మెల్యేగా పోటీచేసినా.. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్న ధీమా వ్యక్తంచేస్తున్నారు.

తాను గెలవడమే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బీఅరెస్ అభ్యర్థులను మరో మారు గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే కవిత గ్రౌండ్‌ వర్క్‌ ప్రారంభించారు.