Yadadri Bhuvanagiri
విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 45వ రోజున ఆదివారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం నుండి ఆలేరు నియోజకవర్గం గుండ్లగూడెం చేరుకోవడం ద్వారా భట్టి పాదయాత్ర యాదాద్రి జిల్లాలోకి ప్రవేశించింది.
ఇప్పటివరకు 526 కిలోమీటర్ల మేరకు భట్టి పాదయాత్ర కొనసాగింది. ఆలేరు నియోజకవర్గం గుండ్లగూడెం వద్ద భట్టి విక్రమార్కకు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి, పోత్నాక్ ప్రమోద్ కుమార్, ఆలేరు నియోజకవర్గం నేతలు మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్, బీర్ల ఐలయ్య యాదవ్, కల్లూరి రామచంద్రారెడ్డి, జనగాం ఉపేందర్ రెడ్డి, వంచ వీరారెడ్డిలు సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
నేటి నుండి మే 6వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 86 కిలోమీటర్ల మేరకు భట్టి పాదయాత్ర కొనసాగనుంది. ఆలేరు నియోజకవర్గంలో 48కిలోమీటర్లు, భువనగిరి నియోజకవర్గంలో 38 కిలోమీటర్లు కొనసాగి జలాల్పూర్ మీదుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొత్తగూడెంలోకి ప్రవేశించనుంది.