Yadadri: యాదాద్రి పరిధి.. మరింత విస్తరణ: CS శాంతి కుమారి | ఆదాయ వనరులు పెరిగేనా

విధాత: ప్రస్తుత యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ ఏరియా (వై.టి.డీ.ఏ) పరిధిని మరింత విస్తరించి, స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ, శిల్పారామాల అభివృద్ధి లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ప్రస్తుతం YTDA పరిధిలో కేవలం 7 గ్రామాలే ఉన్నందున, ఈ పరిధిని మరింత విస్తరించాలని, ఇందుకుగాను ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. దేవస్థాన పరిసర ప్రాంతాలను, […]

Yadadri: యాదాద్రి పరిధి.. మరింత విస్తరణ: CS శాంతి కుమారి | ఆదాయ వనరులు పెరిగేనా

విధాత: ప్రస్తుత యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ ఏరియా (వై.టి.డీ.ఏ) పరిధిని మరింత విస్తరించి, స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ, శిల్పారామాల అభివృద్ధి లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ప్రస్తుతం YTDA పరిధిలో కేవలం 7 గ్రామాలే ఉన్నందున, ఈ పరిధిని మరింత విస్తరించాలని, ఇందుకుగాను ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.

దేవస్థాన పరిసర ప్రాంతాలను, గ్రామాలను అభివృద్ధి పరిచి స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు. యాదాద్రి దేవస్థానం నిర్మాణం అద్భుతంగా ఉందని, ముందు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా రూపొందుతుందని సి.ఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దేవస్థానానికి సంబంధించిన ఆడిట్ నివేదికలను, శిల్పారామాల పనితీరును సమీక్షించారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ , పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయశాఖ కమీషనర్ అనిల్ కుమార్, YTDA VC & CEO కిషన్ రావు, యాదాద్రి దేవస్థానం EO గీత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పరిధి పెంపుతో ఆదాయం పెరిగేనా?

వైటిడిఏ పరిధి పెంపుతో దానికి ఎంతవరకు ఆదాయ వనరులు పెరుగుతాయన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం యాదగిరిగుట్ట, పాత గుట్టలతో పాటు గుండ్లపల్లి, యాదగిరిపల్లి, సైదాపురం, మల్లాపురం, రాయగిరి, బస్వాపురం గ్రామాలను వైటిడిఏ పరిధిలో పేర్కొన్నారు. మైలార్ గూడెం, గొల్ల గుడిసె గ్రామాలను కూడా వై టి డి ఏ పరిధిలో చేర్చాలని గతంలో భావించారు.

అయితే ఆయా గ్రామాల పరిధిలో ఇప్పటికే అధిక శాతం భూములను డిటిసిపి లేఅవుట్ ప్రకారం వెంచర్లు చేసేశారు. కొత్తగా వైటిడిఏ పరిధిలో చేరే గ్రామాలు ఏమిటన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినా ఇప్పటికే గుట్ట పరిసర గ్రామాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్ల లేఅవుట్లు పూర్తయి ఉన్న నేపథ్యంలో అదనంగా వైటీడీఏకు ఎంత మేరకు ఆదాయం సమకూరుతుందన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.

వెంచర్ల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఏ విధంగా ఆదాయం పెంచుకోవాలన్న దానిపై వైటిడిఏ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా శిల్పారామాలు, వివిధ రకాల పార్కులు, బస్వాపురం జలాశయంలో బోటింగ్ పాయింట్, రెస్టారెంట్లు, నవగిరుల పై నవ నరసింహ విగ్రహ ప్రతిష్టాపనలు, అక్కడ టూరిజం కార్యక్రమాల రూపకల్పన వంటి వాటి ద్వారా ఆదాయ మార్గాలు పెంచుకోవాలని వైటీడీఏ భావిస్తుంది. అయితే ఎందుకు వైటిడిఏ ముందుగా భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అటు వై.టి.డి.ఏ పరిధిలోకి మరిన్ని గ్రామాలను చేర్చే ప్రక్రియపై ఆ గ్రామాల ప్రజలు ఎంత మేరకు సానుకూలత వ్యక్తం చేస్తారన్నది కూడా సందిగ్ధంగా మారింది. ఇప్పటికే యాదాద్రి ప్రధానాలయాన్ని నిర్మించి భక్తులకు అవసరమైన మౌలిక వసతులను వైటిడిఏ నిర్లక్ష్యం చేసిందని, స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బతీసిందని విమర్శలు చోటు చేసుకున్నాయి.

అలాగే పెద్దగుట్టపై 850 ఎకరాల్లో ప్రతిపాదించిన టెంపుల్ సిటీ నిర్మాణ మాస్టర్ ప్లాన్ పనులు కూడా అటకెక్కాయి. మొదట విడుదల 200 ఎకరాల్లో లేఅవుట్ చేసి ఫ్లాట్ల అభివృద్ధి చేశారు. సూట్ల నిర్మాణం కోసం 43 మంది దాతలు రెండు కోట్ల విరాళాలు చొప్పున ప్రకటించారని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ప్రస్తుతం ఉన్న ఫ్లాట్లకు తోడు మరో 650 ఎకరాల్లో లేఅవుట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే సిద్ధం చేసిన లే అవుట్లలో 365 క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి పనులు మాత్రం మొదలు పెట్టలేదు. 25 లక్షలు, 50 లక్షలు, కోటి, రెండు కోట్ల విరాళాలతో నాలుగు రకాల సూట్లను నిర్మించాలని వైటీడీఏ ప్రతిపాదించింది. అందుకు భక్తుల నుంచి ఆశించిన స్థాయిలో విరాళాలు లేకపోవడంతో ఇక్కడ క్వార్టర్స్ ల నిర్మాణం అటకెక్కింది.

మరోవైపు ప్రధానాలయం స్వామి వారి గర్భగుడి విమాన గోపుర స్వర్ణ తాపడ కార్యక్రమం సైతం ముందుకు సాగడం లేదు. 125 కిలోల బంగారం అవసరమని లెక్కలు వేసి ఇందులో 65 కోట్ల మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తన వంతుగా తొలి విరాళంగా ఒక కిలో 16 తులాల బంగారాన్ని సీఎం కేసీఆర్ విరాళంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ఎనిమిదిన్నర కేజీల బంగారం, 14.21కోట్ల నగదు మొత్తంగా 20 కోట్ల మేరకు నగదు, బంగారం విరాళంగా అందింది.

మరో 45 కోట్ల మేరకు విరాళాలు అందితేనే విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు కార్యరూపం దాల్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైటిడిఏ పరిధి మరింత విస్తరించి ఎంత మేరకు తమ ఆదాయాన్ని పెంచుకోగలుగుతారన్నదాని పైన, భక్తులకు వసతుల సౌకర్యాల కల్పన పైన, ఇప్పటికే నిర్దేశించిన మాస్టర్ ప్లాన్ అమలుపైన ఏ విధంగా విజయవంతమవుతుందన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.