Breast Milk | తల్లి పాలలో యురేనియం…పరిశోధనలో కలకలం

తల్లిపాలు అంటే ఈ సృష్టిలో అమృతం లాంటివి. పుట్టిన పసికందుకు అమ్మపాలే ఆహారం.. ఆయవు. శిశువు ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఈ పాలు శిశువుల మెదడు అభివృద్ధికి, రోగనిరోధక శక్తి పెరుగుదలకు కీలకమైనవి.

Breast Milk | తల్లి పాలలో యురేనియం…పరిశోధనలో కలకలం

తల్లిపాలు అంటే ఈ సృష్టిలో అమృతం లాంటివి. పుట్టిన పసికందుకు అమ్మపాలే ఆహారం.. ఆయవు. శిశువు ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఈ పాలు శిశువుల మెదడు అభివృద్ధికి, రోగనిరోధక శక్తి పెరుగుదలకు కీలకమైనవి. బాలారిష్టాల నుంచి రక్షణ కల్పించడంలో తల్లిపాలు చేసే మేలు అపారమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ అమృతపానమే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ప్రమాద సూచనలు మోసుకువస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. బిహార్‌లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తల్లిపాలలో రేడియో యాక్టివ్ పదార్థమైన యురేనియం (U-238) గుర్తించినట్లు కథనాలు రావడం చర్చనీయాంశంగా మారింది.

AIIMS న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ అశోక్ శర్మ వివరాల ప్రకారం.. బిహార్‌లోని పలు గ్రామాల్లో నివసించే సుమారు 40 మంది బాలింతల నుంచి పాలను సేకరించిన నిపుణులు పరీక్షలు నిర్వహించారు. వాటిలో చాలా నమూనాల్లో యురేనియం ఉన్నట్లు నిర్ధారించినట్లు వెల్లడైంది. ఈ మోతాదులు అధికం కాకపోయినా, దీర్ఘకాలం పాటు ఈ పాలు తాగే శిశువులకు క్యాన్సర్‌కు సంబంధించిన.. అనారోగ్య సమస్యలు రావచ్చని, ముఖ్యంగా కొన్ని అవయవాల పనితీరుపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని శర్మ తెలిపారు. అంతేకాకుండా దీనివల్ల తల్లుల ఆరోగ్యంపైనా కొంత ప్రభావం ఉండే అవకాశాన్ని కూడా పరిశోధకులు సూచించారు.

ఇదిలా ఉండగా, ఈ విషయంపై జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దినేష్ అస్వాల్ స్పందించారు. దీనిపై ఆందోళన అవసరంలేదని స్పష్టం చేశారు. అధ్యయనంలో గుర్తించిన యురేనియం స్థాయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన అనుమతించదగిన పరిమితుల్లోనే ఉన్నాయని చెప్పారు. శిశువులకు ఎటువంటి ప్రమాదం లేదని ఆయన ధీమా కల్పించారు. సహజసిద్ధంగా భూమిలో కొద్దిమట్టిలో యురేనియం ఉంటుందని, తల్లులు ఆహారం లేదా నీటితో శరీరంలోకి తీసుకునే యురేనియం ఎక్కువ భాగం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుందని చెప్పారు. తల్లిపాలలో చాలా స్వల్పమాత్రలో మాత్రమే మిగులుతుందని డాక్టర్ అస్వాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరిశోధకుల సూచనలు, NDMA ఇచ్చిన స్పష్టీకరణ మధ్యలో ప్రజల్లో ఆందోళన పెరగకుండా ప్రభుత్వం విస్తృత స్థాయిలో సమాచారం అందించి, శుద్ధి చేసిన తాగునీరు, పర్యావరణ భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.