Monkey Trap | మంకీట్రాప్ అంటే తెలుసా..? అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం
మంకీ ట్రాప్ అంటే కోతులను పట్టుకోవడానికి వేసే ఎర. వివిధ దేశాల్లోని ఆటవిక తెగలు కోతులను వేటాడానికి ఉపయోగించే టెక్నిక్ ఇది. ఒక రకంగా మన ఎలుకల కోసం పెట్టే బోను లాంటి ఆలోచన.

(Monkey Trap) కోతులను వేటాడటానికి చిన్న రంధ్రం ఉన్న చెట్టునో లేదా ఓ ఎండు కొబ్బరిబోండాంనో ఎంపిక చేసుకుని, దానికి సరిగ్గా కోతి చేయిపట్టేంత రంధ్రం చేస్తారు. ఈ రంధ్రం ఎలా ఉంటుందంటే, కోతి చేయి నేరుగా పట్టేంత పెద్దగా.. పిడికిలి(Fist) మూస్తే బయటకు రానంత చిన్నగా ఉంటుంది. అప్పుడు ఈ బొరియలో కోతి ఇష్టపడే అహారాన్ని పెడతారు. దీనికి ఆశ పడిన కోతి అందులో చేయి పెట్టి ఆహారాన్ని పట్టుకుంటుంది. కానీ ఆహారంతో మూసుకున్న పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ ఆటవికులు ఆ కోతిని పట్టుకుంటారు. విచిత్రమేమింటే, ఆటవికులు తనను పట్టుకోవడానికి సమీపిస్తున్నా, అది పిడికిలి వదిలేసి, ఖాళీ చేయి బయటకు తీసుకుని తప్పించుకునే అవకాశమున్నా, పిడికిలి వదలదు, చేయి బయటకు రాదు. దాంతో ఆటవికులకు చిక్కి ప్రాణాలు కోల్పోతుంది. ఇదే మంకీ ట్రాప్.
ఈ మంకీ ట్రాప్ ఈ మధ్య హ్యుమన్ ట్రాప్‌గా కూడా మారింది. తెలియకుండానే మనం ఈ ట్రాప్‌లో పడిపోతున్నాం. చేజేతులారా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. వాస్తవానికి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి(If you want something, then lose something) అనే మాట ఒకటుంది. కానీ మనం వదలం. పట్టుకుని కూర్చొంటాం. దానివల్ల జరగాల్సిన నష్టం జరిగేటప్పటికి మనం మిగలం. ఎందుకో, ఏమిటో తెలియదు గానీ, చాలామంది తెలియకుండానే ఈ ట్రాప్‌లో పడిపోయి జీవితాలను అంతం చేసుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం పేపర్లో వచ్చిన వార్త.. హైదరాబాద్‌లో ఒక యాచకుడి మృతి. పోస్టుమార్టంలో తేలిందేంటంటే, అతనికి 14 రోజుల నుంచి ఆహారం లేదు. అంటే ఆకలి చావు. నిజానికి ఇది కూడా పెద్ద వార్త కాదు, కానీ ఆ బిచ్చగాడి సంచిలో 1,34,000 అంటే, అక్షరాల మొత్తం 1లక్ష 34 వేల రూపాయలు ఉన్నాయి. పేపర్లో హెడ్డింగ్ కూడా ఇదే. “బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం(Beggar’s hunger death with 1 lakh cash in bag)”. ఇక్కడ విషయం ఏంటంటే అంత డబ్బు ఉంచుకున్న బిచ్చగాడు ఒక పూట భోజనం ఎందుకు కొనుక్కోలేకపోయాడు? అదీ ఆకలితో తన ప్రాణం పోతున్నాకూడా. 14 రోజుల నుంచి ఆకలితో పస్తులున్నాడు కానీ, తన ప్రాణం కోసం డబ్బు ఖర్చు పెట్టలేకపోయాడు. ఎందుకు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి బలహీనత అందరిలో ఉంటుందా అంటే, అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం.
మనకు ప్రమాదమని, తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిసీ, కొన్నిటిని వదులుకోలేకపోతే ఆ కోతికి మనకు తేడా లేనట్లే. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బులను దాచీ దాచీ, జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు రాక, ప్రాణాలు పోగొట్టుకున్నావారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. కారణం డబ్బు పట్ల ఆశా? నిజంగా డబ్బు మనిషిని అంతగా బలహీనులను చేస్తుందా? తన ప్రాణాలను కాపాడలేని డబ్బు ఎన్ని వేల కోట్లున్నా ఏం లాభం? ఎంత డబ్బుంటే అంత సంతోషం ఉంటుందా? కాదు. లేదు. ఇదంతా కేవలం మన భ్రాంతి మాత్రమే. కానీ ఆ భ్రాంతి మనం పూర్తిగా నష్టపోయేదాకా వదిలిపెట్టదు. ఇదే మనల్ని అంతం చేసే మంకీ ట్రాప్. డబ్బులున్నా, తినలేక చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనం, తెలియకుండానే అదే ట్రాప్‌లో మనమూ ఉన్నామనే విషయం గ్రహించకపోవడం విషాదం.
ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్లు ఎంతమంది లేరు? మాట పట్టింపుకు పోయి మరెన్నో బంధాలను దూరం చేసుకుని ఏకాకిగా మిగిలిపోయి పోయినవాళ్లు, వ్యాపారాలంటూ, అధికారమంటూ, పేరు ప్రతిష్ఠలంటూ వృత్తికి అంకితం అయిపోయి భార్యాపిల్లల్ని నిర్లక్ష్యం చేసి, చివరకు తాము అదే నిర్లక్ష్యానికి గురై తనువు చాలించినవారినీ చూస్తూనే ఉన్నాం. అందుకే, చిన్నదో, పెద్దదో .. మనం కూడా ఇటువంటి ట్రాప్‌లో ఏమైనా ఉన్నామేమో? ఆత్మపరిశీలన చేసుకోవాలి. విడిపోయిన బంధం, డబ్బు, కీర్తి, పదవి.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అది మనకే ప్రమాదంగా మారుతోందనుకున్నప్పుడు వదులుకోగలగాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం.
- మనల్ని ఏడిపించే జ్ఞాపకం, నో చెప్పలేని మోహమాటం, తిరిగి అడగలేని అప్పు, ఊపిరి సలపనివ్వని పనులు, ఒత్తిడి పెంచే కోరికలు, ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు, పేరు కోసం తీసే పరుగులు… అన్నీ మంకీ ట్రాప్లే..
అందుకే అనవసరంగా సంపాదించడం తెలిసినప్పుడు, అవసరానికి వదిలేయడమూ తెలిసుండాలి. దీన్నే జల, వాయు రవాణా పరిభాషలో జెట్టిసన్(jettison) అంటారు. అంటే విమానం కూలిపోయే, పడవ మునిగిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు, మరింతసేపు తేలిఉండటానికి, విమానం/నావలో ఉన్న బరువులను ఒక్కొక్కటిగా పడేస్తారు. దానివల్ల విమానం/పడవ తేలికవుతూఉంటుంది. ఆఖరికి ఇంధనం కూడా. ప్రాణాలు నిలుపుకుంటే ఎవరైనా వచ్చి కాపాడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కదా.!