Sleep Debt | నిద్ర అప్పు – ఆధునిక మనిషి జీవనాన్ని నాశనం చేస్తున్న అజ్ఞాత శత్రువు
‘నిద్ర అప్పు’ అనేది ఇప్పటి జీవనవిధానానికి కనబడని శత్రువు. తక్కువ నిద్ర వలన హృదయ వ్యాధులు, డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. పరిష్కార మార్గాలు తెలుసుకోండి.

Sleep Debt | హైదరాబాద్‌లోని ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేసే శేఖర్ ప్రతిరోజూ రాత్రి 12 గంటలకన్నా ఆలస్యంగా ఇంటికొస్తాడు. ఉదయం మళ్లీ 7 గంటలకల్లా లేవాలి. ట్రాఫిక్, డ్యూటీలు, లేట్ మీటింగ్స్ – ఇవన్నీ అతనిని నిద్రకు దూరం చేసాయి. వారం రోజులకే శరీరం అలసిపోతుంది. అయితే శేఖర్‌కి ఇది కొత్తేమీ కాదు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇదే అలవాటు. కానీ వైద్యులు చెబుతున్నారు – “ఇలాంటి జీవనశైలి వలన శరీరం నిశ్శబ్దంగా నాశనం అవుతోంది. దీన్నే నిద్ర అప్పు (Sleep Debt) అంటారు.”
నిద్ర అప్పు అంటే ఏమిటి?
మన శరీరానికి ప్రతిరోజూ ఒక నిర్దిష్ట నిద్రాకాలం అవసరం. పెద్దవాళ్లకి సాధారణంగా 7–8 గంటలు. కానీ మనం ఆ అవసరానికంటే తక్కువగా నిద్రిస్తే, అది ‘అప్పు’గా మారుతుంది. ఉదాహరణకు రోజుకు 8 గంటలు నిద్ర అవసరమని అనుకుందాం. కానీ మనం కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతే… ప్రతిరోజూ 2 గంటల నిద్ర అప్పు తీసుకున్నట్టే. ఈ అప్పు ఒక్కరోజులో తీరేది కాదు. అది పేరుకుపోతుంది. వారాలు, నెలల తర్వాత శరీరం ఆ ధర వసూలు చేస్తుంది. ఎలా?
నిద్ర లోటు – శరీరానికి భయంకరమైన ముప్పు
- హృదయ సంబంధ వ్యాధులు – నిద్ర లేకపోవడం వలన రక్తపోటు పెరిగి గుండెపోటు ముప్పు పెరుగుతుంది.
- డయాబెటిస్ – రక్తంలో చక్కెర స్థాయిలు అసమతౌల్యానికి లోనవుతాయి.
- బరువు పెరుగుదల – హార్మోన్ల అసమతౌల్యం వలన ఆకలి పెరుగుతుంది. ఫలితంగా ఊబకాయం.
- రోగనిరోధక శక్తి తగ్గుదల – చిన్న జలుబు, ఫ్లూ, జ్వరాలు కూడా తరచుగా వస్తుంటాయి.
- మానసిక సమస్యలు – చిరాకు, ఉత్సాహం లేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం.
- ప్రాణహాని ప్రమాదం – నిద్ర లేమి వల్ల డ్రైవింగ్‌లో తప్పిదాలు, పనిలో ప్రమాదాలు పెరుగుతాయి.
ఆధునిక జీవనశైలే కారణమా?
- షిఫ్ట్ డ్యూటీలు – ముఖ్యంగా ఐటీ, మీడియా, పారిశ్రామిక, వైద్య రంగాల్లో ఇది పెద్ద సమస్య.
- ట్రాఫిక్ & ప్రయాణం – ప్రతిరోజూ గంటల తరబడి రోడ్ల మీద గడపాల్సిరావడం.
- సోషల్ మీడియా & వినోదం – రాత్రిపూట ఫోన్లు, ల్యాప్‌టాపులు వాడటం.
- మరింత సంపాదించాలి అన్న ఒత్తిడి – నిద్ర కన్నా పనికి ప్రాధాన్యం ఇచ్చే మనస్తత్వం.
అమెరికాలో మూడింట ఒక వంతు మంది పెద్దవాళ్లు 7 గంటలకు తక్కువగా నిద్రపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశంలోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా యువతలో రాత్రి 2–3 గంటలవరకు మేల్కొని ఉండటం కొత్త ట్రెండ్‌గా మారింది.
“మన శరీరం అలవాటు పడుతుంది” – తప్పుడు భావన
చాలామంది మనం తక్కువ నిద్రపోయినా శరీరం అలవాటు పడుతుంది అని అనుకుంటారు కానీ అది మన భ్రమేనని పరిశోధనలు చెబుతున్నాయి – శరీరం బయటికి సహజంగా కనిపించినా, లోపల మాత్రం శక్తి తగ్గిపోతుంది. మానసికంగా తేలికగా అనిపించినా, జ్ఞాపకశక్తి, శారీరక శక్తి, ప్రతిస్పందన వేగం అన్నీ పడిపోతాయి.
ఈ అప్పు తీర్చుకోవచ్చా?
- వారాంతంలో ఎక్కువగా నిద్రపోవడం – కొంత ఉపశమనం కలిగించినా, అది పూర్తి పరిష్కారం కాదు.
- మధ్యాహ్నం నిద్ర – 15–20 నిమిషాల చిన్న నిద్ర శరీరానికి తాత్కాలిక శక్తినిస్తుంది.
- పరిశోధన ఫలితాలు – ఒక గంట నిద్ర కోల్పోతే తిరిగి శరీరం పూర్వస్థితికి రావడానికి కనీసం 4 రోజులు పడుతుంది. దీర్ఘకాలిక నిద్ర లోటు నుంచి బయటపడటానికి వారాల తరబడి పట్టవచ్చు.
- రోజూ సరైన నిద్రాకాలం – అన్నిటికంటే ఉత్తమ పరిష్కారం రోజు ఒకే సమయానికి నిద్ర పోవడం, సరిపడినంత నిద్ర పోవడం. ఇదొక్కటి చాలు.
నిద్ర శుభ్రత (Sleep Hygiene) – పరిష్కారానికి మొదటి అడుగు
- ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం.
- పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలు (ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ) మానేయడం.
- పడకగదిని చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం.
- కాఫీ, టీని రాత్రిపూట మానేయడం.
- పగటిపూట వ్యాయామం చేయడం, తగినంత సూర్యకాంతి పొందడం.
నిద్ర అనేది విలాసం కాదు, ప్రాణాధారం – అది జీవనానికి అవసరమైన ఆక్సిజన్ లాంటిది. నిద్ర అప్పు అనేది మనకు తెలియని వ్యాధి. కానీ దీని ధర మాత్రం గుండెపోటు, డయాబెటిస్, మానసిక కుంగుబాటు రూపంలో వసూలవుతుంది. కాబట్టి, డబ్బు అప్పు చేసుకున్నా పరవాలేదు కానీ నిద్ర అప్పు మాత్రం శరీరానికి తీవ్రహాని కలిగిస్తుంది. కనుక నిద్రను కూడా ఆహారంలా భావించి దేహానికి సరిపడా అందివ్వాలి.
ఇవి కూడా చదవండి..
Health Tips : రాత్రి 7 గంటలకు ముందే భోజనం ఎందుకు చేయాలి?
Brain Health | 40 ఏళ్ల తర్వాత కూడా బ్రెయిన్ యంగ్ గా ఉండాలంటే..
Rainy Season Health Tips | ఈ ఇన్‌ఫెక్షన్ల కాలంలో ఇమ్యూనిటీ పెంచేదెలా?