బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. 18 మంది నిరసనకారులు మృతి
బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు రాజుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాపై (government jobs quota) కొనసాగిన నిరసనల సందర్భంగా అధికరా ఆవామీ లీగ్ (Awami League) కార్యకర్తలకు, ఆందోళనకారులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చేటు చేసుకున్నాయి

ఢాకా: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు రాజుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాపై (government jobs quota) కొనసాగిన నిరసనల సందర్భంగా అధికరా ఆవామీ లీగ్ (Awami League) కార్యకర్తలకు, ఆందోళనకారులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చేటు చేసుకున్నాయి. ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామాకు ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘర్షణల్లో ఆదివారం 18 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇటీవలి ఘర్షణల్లో 200 మందికిపైగా చనిపోయిన విషయం తెలిసిందే. వీరిలో అత్యధికులు విద్యార్థులే. 1971 నాటి బంగ్లా విమోచన యుద్ధంలో (Bangladesh’s War of Independence) పాల్గొన్నవారి కుటుంబీకుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కొనసాగించడాన్ని యువత వ్యతిరేకిస్తున్నది.
తాజా ఘర్షణలు ఆదివారం ఉదయం చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిర్వహించిన సహాయ నిరాకరణ కార్యక్రమం సందర్భంగా అధికార ఆవామీ లీగ్ విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్ (Chhatra League), జుబో లీగ్ (Jubo League) కార్యకర్తలతో వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం కార్యకర్తలకు ఘర్షణ జరిగింది. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తిన అల్లర్లలో సుమారు 18 మంది చనిపోయారని, అనేక మందికి గాయాలయ్యాయని ఢాకా ట్రిబ్యూన్ పత్రిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి నిరవధిక కర్ఫ్యూ (indefinite countrywide curfew) విధించాలని హోంశాఖ నిర్ణయించింది.
ఆందోళన పేరుతో దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నవారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులని ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటివారిని కఠినంగా అణచివేయాలని పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. దేశ త్రివిధ దళాధిపతులతోపాటు, పోలీస్, ఆర్‌ఏబీ, బీబీబీ తదితర ఉన్న విభాగాల ఉన్నతాధికారులు ఇతర భద్రతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రంగ్‌పూర్‌లో నలుగురు అవామీ లీగ్ కార్యకర్తలు చనిపోయారు. బోగ్రా, మగురాలో ఇద్దరు చొప్పున హత్యకు గురయ్యారు. చనిపోయినవారిలో ఛాత్ర దళ్ నాయకుడు కూడా ఉన్నాడు.సిరాజ్‌గంజ్‌లో సుమారు నలుగురు చనిపోయారు. నిరసనల నేపథ్యంలో ఢాకాలోని (Dhaka) అనేక దుకాణాలు, మాల్స్ మూతపడ్డాయి. ఢాకాలోని షాబాగ్ వద్దకు చేరుకున్న వందల మంది విద్యార్థులు, వృత్తినిపుణులు అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ ఆందోళనలు వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం (Anti-Discrimination Students Movement) ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ప్రధాని రాజీనామా సమర్పించాలని, చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.