దేశ వ్యాప్తంగా లక్షల్లో పేరుకపోయిన కేసుల సత్వర పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు చేపట్టిన ‘సమాధాన్ సమరోహ్ 2026’లో భాగంగా తొలి రోజు ఆగస్టు 21 ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 400కు పైగా కేసులను పరిష్కరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకత్వంలో ప్రారంభమైన ఈ ప్రత్యేక లోక్ అదాలత్, రెండు రోజుల పాటు కొనసాగి ఆగస్టు 23తో ముగుస్తుంది. తొలి రోజే సుమారు 600లకు పైగా కేసులు రాగా..400కేసులను పరిష్కరించారు. కుటుంబ తగాదాలు, ఆస్తుల వివాదాలు, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహారాలు, భూసేకరణ, పన్నులకు సంబంధించిన కేసులు ఇందులో ఉన్నాయి.
పెండింగ్‌లో వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి వీలు కల్పించడం, ప్రజలకు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సమాధాన్ సమరోహ్ నిర్వాహణ కోసం సుప్రీంకోర్టులో 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి బెంచ్‌లో సుప్రీంకోర్టు సిట్టింగ్ రిటైర్డ్/సిట్టింగ్ న్యాయమూర్తులతో పాటు సీనియర్ న్యాయవాదులు ఉంటారు. కక్షి దారులు నేరుగా ఢిల్లీకి వెళ్లకుండా వర్చువల్ (ఆన్‌లైన్) విధానంలో కూడా హాజరయ్యే వెసులుబాటు కల్పించారు.
