గడ్డి అమ్మి వందశాతం ఆదాయం పన్ను మినహాయింపు ఇలా పొందొచ్చట! వీడియో చూసి నవ్వులే నవ్వులు!

మనోళ్లలో హాస్యానికి ఏ మాత్రం కొదవలేదు. గతంలో పత్రికలు, మ్యాగజైన్లకు జోకులు పంపుకొనేవారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు విస్తృతస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి ప్రతిభ ప్రపంచం అంచులకు చేరుతున్నది.

గడ్డి అమ్మి వందశాతం ఆదాయం పన్ను మినహాయింపు ఇలా పొందొచ్చట! వీడియో చూసి నవ్వులే నవ్వులు!

బెంగళూరు: మనోళ్లలో హాస్యానికి ఏ మాత్రం కొదవలేదు. గతంలో పత్రికలు, మ్యాగజైన్లకు జోకులు పంపుకొనేవారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు విస్తృతస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి ప్రతిభ ప్రపంచం అంచులకు చేరుతున్నది. ఈ క్రమంలోనే అనేక మంది అనేక విషయాలపై తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు అప్పుడప్పుడు సలహాలు కూడా ఇస్తుంటారు. ఒక్కోసారి అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిపోతుంటాయి. ఇదే పద్ధతిలో ఒక వ్యక్తి ఆదాయం పన్ను తగ్గించుకోవడం ఎలా? అనే అంశంపై ఒక వ్యంగ్యాత్మక వీడియో చేశారు. అదికూడా వందశాతం పన్ను లేకుండా! అతడు ఇచ్చిన సరదా సలహా నెట్టింట నవ్వులు పూయిస్తున్నది.

ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే.. గడ్డి పెంచి, మీ యజమానులకు అమ్మడమే! అలా గడ్డి అమ్మడంతో ఆదాయం పన్ను నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారా? దానికి ఆయన వివరణ కూడా ఇచ్చాడా కర్ణాటక వ్యక్తి. కంటెంట్‌ క్రియేటర్‌ శ్రీనిధి హాండే అనే వ్యక్తి జూలై 23, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం ఈ వీడియోను పోస్టు చేశాడు. అందులో ఉద్యోగస్తులు వందశాతం ఆదాయం పన్ను ఎలా తప్పించుకోవచ్చో వివరించాడు. ఇన్‌స్టాలో ఆయన వీడియోకు 20 లక్షల వ్యూస్‌ వచ్చాయి. అదే వీడియోను అఖిల్‌ పచోరి అనే ఎక్స్‌ యూజర్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్లు పడీపడీ నవ్వుతున్నారు. దీంతో ఎక్స్‌లో కూడా అది వైరల్‌గా మారింది. ‘వందశాతం ఆదాయం పన్ను నుంచి ఎలా మినహాయింపు పొందొచ్చో నేను ఈ వీడియోలో చెబుతాను’ అంటూ మొదలు పెట్టిన హాండే.. అందుకు మూడు స్టెప్పులు పేర్కొన్నాడు. ‘అవి చాలా సులభం.. చట్టబద్ధం, చేయడం కూడా ఈజీయే’ అని పేర్కొన్నాడు.
‘మీ ఇంట్లో లేదా బాల్కనీలో లేదా మీ ఇంటి టెర్రస్‌పై గడ్డి పెంచండి. ఇది చాలా సులభం. చట్టబద్ధం కూడా. ఇప్పుడు మీ హెచ్‌ఆర్‌ దగ్గరకు వెళ్లండి. నాకు జీతం అవసరం లేదు అని చెప్పండి. వారు చాలా సంతోషిస్తారు. అయితే.. తన జీతం ఎంతో అంత మేరకు తాను పెంచిన గడ్డిని కొనాలని చెప్పండి. మీ జీతం 50వేలు అయితే.. ఒక్కో గడ్డిమోపు వెయ్యి చొప్పున 50 మోపులు అమ్మండి. అంతా చట్టబద్ధం’ అని హాండే చెప్పాడు.

తన సలహా వెనుక ఉన్న లాజిక్‌ను వివరించిన హాండే.. ‘ఇప్పుడేమవుతుంది? మీకు జీతం రూపంలో వచ్చే ఆదాయం సున్నా అవుతుంది. మీరు వ్యవసాయోత్పత్తిని అమ్మటం ద్వారా సంపాదించే సొమ్ము పన్ను పరిధిలోకి రాదు. ఇలా చేస్తే మీరు వందశాతం ఆదాయం పన్ను నుంచి మినహాయింపు పొందుతారు. మీకు టీడీఎస్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బాధే ఉండదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రతి విషయానికి సరదాగా తీసుకోవడంలో మన తర్వాతే ఎవరైనా అని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

2024 కేంద్ర బడ్జెట్‌లో ట్యాక్స్‌ స్లాబులను సవరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. స్టాండర్డ్‌ డిడక్షన్‌ లిమిట్‌ను 50వేల నుంచి 75వేలకు పెంచిన విషయం తెలిసిందే.