మోసకారుల ముందు మోకరిల్లిన మోదీ: ఖ‌ర్గే

మోసకారుల ముందు మోకరిల్లిన మోదీ: ఖ‌ర్గే
  • అప్పుల ఊబిలోకి నెడుతున్న స‌ర్కార్‌
  • న‌ల్ల‌ధ‌నం తెస్తామ‌న్న హామీ ఏమైంది?
  • ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే

న్యూఢిల్లీ : బ్యాంకుల్లో ప్రజల డబ్బును కొల్లగొట్టే మోసకారులు మోదీ హయాంలో రోజురోజుకూ పెరుగుతున్నారని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే విమ‌ర్శించారు. కోట్ల కొద్దీ ప్రజాధనాన్ని తనకిష్టమైన మోసకారులే కొల్లగొట్టి విదేశాలకు పారిపోతున్నారని, వారు కొల్లగొట్టిన ధనాన్ని ప్రభుత్వం వసూలు చేయలేని నిస్స‌హాయ స్థితిలో ఉన్న‌ద‌ని అన్నారు. కాళ్లు ఈడ్చుకుంటూ వారి వెనుక నడుస్తూ, ప్రజలకు సర్ది చెప్పటంపైననే ప్రభుత్వ పాలసీలు ఉంటున్నాయ‌ని విమర్శించారు.


దేశ అర్ధిక వ్యవస్థను అప్పుల ఊబిలోకి దించుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆర్థిక నేర‌గాళ్ల‌ మోసాలు, కుంభకోణాలు ఎటువంటి భయం లేకుండా జరిగి పోతున్నాయని అన్నారు. రోజుకు 100 కోట్లకు పైగా ఆర్థిక నేర‌స్తులు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నార‌ని పేర్కొన్నారు. మోదీజీ మీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల ఊబిలో ముంచుతున్నది. మరోవైపు మీరు మీ ఇష్టమైన వారికి ఫ్రీగా డబ్బు సంచులు కుమ్మరిస్తూన్నారు. మీ పరిచయస్తులు, మీ స్నేహితులు, మీ మేలుకోరే వారు, కోట్లు కొల్లగొట్టేలా సహ‌కరిస్తూ దేశాన్ని నిలువెల్లా ముంచుతున్నారు అని మండిప‌డ్డారు. 14.56 లక్షల కోట్ల మొండిబకాయల విషయం గురించి కేంద్ర ప్ర‌భుత్వం దాచిపెడుతున్న‌ద‌ని విమ‌ర్శించారు.


ఆర్థిక నేర‌స్థులు ఇటువంటి మోసాల‌కు పాల్ప‌డేలా మోదీ ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తున్న‌ద‌ని ఆరోపించారు. ప్రభుత్వ సహాయం అందకపోతే వీరేలా విదేశాలకు పారిపోయార‌ని ప్ర‌శ్నించారు. విదేశాల్లో దాచిన న‌ల్ల‌ధ‌నాన్ని వాప‌స్ తెప్పిస్తామ‌ని చేసిన వాగ్దానం ఏమైంద‌ని నిల‌దీశారు. దేశ ఆర్ధిక వ్యవస్థ బలపడేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోగా.. ధరలు పెంచుతున్నద‌ని ఖ‌ర్గే విమ‌ర్శించారు. రైతులు ఇతర వృత్తుల వాళ్ల అవ‌స‌రాల‌కు బ్యాంకు రుణాలు అంద‌డం లేద‌ని, కానీ.. మోదీకి ఇష్ట‌మైన‌వారికి మాత్రం డ‌బ్బు సంచులు అందుతున్నాయ‌ని ఆరోపించారు. మోదీ ప్ర‌భుత్వ మోసాల‌ను దేశ ప్ర‌జ‌లు గుర్తించార‌ని, రాబోయే ఎన్నిక‌ల్ల త‌గిన శాస్తి చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు.