ఇండియా కూటమి కన్వీనర్‌గా ఖర్గే?

ప్రతిపక్ష ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించాలని శనివారం నిర్వహించిన కూటమి నేతల వర్చవల్‌ భేటీలో ప్రతిపాదన వచ్చిందని సమాచారం.

ఇండియా కూటమి కన్వీనర్‌గా ఖర్గే?
  • నేతల వర్చువల్‌ సమావేశంలో ప్రతిపాదన!
  • మమత, కేజ్రీవాల్‌తో చర్చల అనంతరం తుది నిర్ణయం
  • ఇండియా కూటమి నేతల వెల్లడి

న్యూఢిల్లీ : ఇండియా కూటమి కన్వీనర్‌గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు ప్రతిపాదనకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీట్ల సర్దుబాటు, భవిష్యత్తు వ్యూహరచన, ఆదివారం నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌యాత్రలో భాగస్వామ్యం తదితర అంశాలపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ఖర్గే పేరును కన్వీనర్‌ పదవికి నేతలు ప్రతిపాదించినట్టు సమాచారం. తొలుత జేడీయూ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పేరు వచ్చినప్పటికీ.. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా లేరని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. కన్వీనర్‌ పోస్టుపై బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో చర్చించిన తర్వాత స్పష్టత వస్తుందని నేతలు చెబుతున్నారు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో ఖర్గే పేరు కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మమతా బెనర్జీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం మద్దతు పలికారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ లోక్‌సభ సమన్వయకర్తల సమావేశం నిర్వహించిన ఖర్గే.. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పని చేయాలని సూచించారు. తొలుత గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవా, దాద్రా నాగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయ్యూ నేతలతో సమావేశమైన ఖర్గే.. అనంతరం ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, చండీగఢ్‌, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ నేతలతో సంప్రదింపులు జరిపారు.