హంగ్ ఇండియా!

రాబోయే లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే మోదీని ఓడించలేక పోయినా ఏకపక్ష

హంగ్ ఇండియా!
  • మోదీ ఏకపక్ష విజయాలకు ఇక చెల్లు?
  • గట్టి పోటీనివ్వనున్న ఇండియా కూటమి
  • 400 సీట్లలో ఉమ్మడి అభ్యర్థికి చాన్స్‌
  • 143 స్థానాల్లోనే మిత్రుల మధ్య పోటీ!
  • బహుముఖ పోటీ తప్పించే పనిలో నేతలు
  • అభివృద్ధి అంశాలు పక్కన పెట్టిన మోదీ
  • పదేళ్ల తర్వాత కూడా రాముడిపైనే భారం
  • అయోధ్య ఆలయంపై బీజేపీ ‘ఓటు’ ఆశలు
  • దక్షిణాదిలో కనీస బలం లేని బీజేపీ
  • హిందీ రాష్ట్రాల్లో మాత్రమే గట్టి పట్టు
  • వాటి మీదుగా రాహుల్‌ న్యాయ్‌ యాత్ర
  • గట్టి ప్రభావం చూపగలిగితే అద్భుతాలే!

రాబోయే లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే మోదీని ఓడించలేక పోయినా ఏకపక్ష విజయాలను మాత్రం ప్రతిపక్ష ఇండియా కూటమి అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నికల నాటికి కనీసం హంగ్‌ ఏర్పడే పరిస్థితినైనా సృష్టించగలవని అంటున్నారు. ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ అయోధ్య రాముడిని వాడుకుంటున్నదని, గుడిపైనే ఓటు ఆశలు పెట్టుకున్నదని విశ్లేషిస్తున్నారు.

విధాత ప్రత్యేకం: ఇప్పటిదాకా తనకు ఎదురేలేదని భావిస్తున్న మోదీకి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎదురుగా నిలబడగలదా? ఏకపక్ష విజయాలు సాధిస్తూ వచ్చిన బీజేపీని నిలువరించగలదా? మతం ప్రాతిపదికనే ఓట్లు వేయించుకోవాలని చూస్తున్న కాషాయ పార్టీ పన్నాగాలను ఇండియా కూటమి విచ్ఛిన్నం చేయగలదా? ఈ ప్రశ్నలకు రాజకీయ పరిశీలకులు, సీనియర్‌ పాత్రికేయులు అవుననే సమాధానమే ఇస్తున్నారు. బీజేపీ ఏకపక్షంగా ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. హంగ్‌ ఏర్పడే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. రాహుల్‌ భారత్‌ న్యాయ్‌ యాత్ర ప్రభావం చూపితే.. ఆశ్చర్యకరమైన ఫలితాలకూ అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు. ప్రత్యేకించి ఇటీవల ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్ల్యూలో ప్రధాని మోదీ నోట సైతం సంకీర్ణ ప్రభుత్వం అనే పదం రావడం కీలక అంశమని ప్రస్తావిస్తున్నారు. బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పుకోవాల్సిన మోదీ.. ‘ప్రజలు, నిపుణులు, ప్రజాభిప్రాయాన్ని మలిచేవాళ్లు, మీడియా మిత్రులు.. అందరూ సంకీర్ణ ప్రభుత్వం వద్దనే కృతనిశ్చయంతో, ఏకాభిప్రాయంతో ఉన్నారు’ అని వారందరి తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం గెలుపుపై సడలిన ధీమాకు నిదర్శనంగా చెబుతున్నారు.

400 సీట్లలో ఇండియా ఉమ్మడి అభ్యర్థి!

దేశవ్యాప్తంగా కనీసం 400 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశగా ఇండియా కూటమి నేతలు చర్చలు సాగిస్తున్నారు. తద్వారా బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు బలంగా ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బహుళ అభ్యర్థులు నిలబడే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఆప్‌, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒంటరిగానే బీజేపీని ఢీకొంటామని చెబుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్‌ విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో దాదాపు 190 స్థానాల్లో కాంగ్రెస్‌ ఒక్కటే పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉంటుందని చెబుతున్నారు.

ఆ మూడుచోట్ల ఓడినా ఓట్లు చెదరని కాంగ్రెస్‌

ఇటీవలి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ గెలువలేకపోయింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో అధికారం కోల్పోయింది. అయితే.. ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్‌ ఓట్ల శాతం భద్రంగా ఉండటాన్ని విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఓడిపోయినా.. బీజేపీకంటే 0.23 శాతం ఓట్లను పెంచుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ పరిగణనలోకి తీసుకోలేని స్థాయిలోనే ఓట్లు తగ్గాయి. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఓటింగ్‌ చెక్కు చెదరలేదని అర్థమవుతున్నది. మరోవైపు దక్షిణాదిలో గతంలోనే కర్ణాటకలో విజయం సాధించగా, తాజాగా తెలంగాణను తన ఖాతాలో వేసుకున్నది. ఇది కాంగ్రెస్‌కు బలమైన అంశంగా పరిశీలకులు భావిస్తున్నారు.

దక్షిణాది ఇండియా కూటమిదే

దక్షిణాది రాష్ట్రాల్లో ఇండియా కూటమి బలంగా కనిపిస్తున్నది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడులో అధికార డీఎంకే బలంగా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్‌తో పొత్తుకు ఇబ్బంది ఏమీ లేదని అంటున్నారు. కేరళలో ఇండియా కూటమి భాగస్వామి సీపీఎం నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్‌ కూడా కొన్ని సీట్లలో వామపక్షాలపై పోటీ చేసే అవకాశం ఉన్నా.. మొత్తంగా ఎవరు గెలిచినా ఇండియా కూటమి సీట్ల కింద చూడాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఏది ఏమైనా బహుళ అభ్యర్థులను నివారించే కృషి గట్టిగానే జరుగుతున్నదని సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఇప్పటికైతే వైసీపీ గెలిచినా, టీడీపీ-జనసేన గెలిచినా ఎన్డీయే వైపు మొగ్గు చూపుతారన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు కూటమి పార్టీల మధ్య పోటీని కనిష్ఠస్థాయికి తగ్గించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వం, బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌ చొరవ చేస్తున్నారు. దాదాపు 400 లోక్‌సభ స్థానాల్లో ఇండియా పార్టీల ఉమ్మడి అభ్యర్థి విషయం దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో 11 రాష్ట్రాల‌లోని 190 సీట్ల‌లో ఒక్క కాంగ్రెస్ పార్టీనే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ‌రో 9 రాష్ట్రాల‌లోని 268 స్థానాల్లో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు పోటీ చేసే వీలున్నది. కాంగ్రెస్‌కు స్వ‌త‌హాగా బ‌లం లేని ఏపీతో స‌హా ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని మ‌రో 85 సీట్ల‌లో కూడా కాంగ్రెస్ పార్టీనే పోటీ చేయ‌నున్న‌ది. ఇందులో క‌నీసం 20 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుచుకునే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ పరిశీల‌కులు అంటున్నారు. ఫలితాలు హంగ్‌ పార్లమెంటును సూచిస్తే ఈశాన్య రాష్ట్రాల పార్టీలతోపాటు, ఏ కూటమిలోనూ లేని పార్టీలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి కొత్త ప్రభుత్వం కొలువుతుందని అంచనా వేస్తున్నారు.

రాహుల్‌ తాజా యాత్రపై కాంగ్రెస్‌ ఆశలు

భారత్‌ జోడో యాత్ర ద్వారా కొంత ప్రభావం చూపగలిగిన రాహుల్‌.. రెండో విడుతలో మణిపూర్‌ నుంచి ముంబై వరకు అంటే.. తూర్పు నుంచి పశ్చిమానికి భారత్‌ న్యాయ్‌ యాత్ర పేరిట యాత్ర చేయనున్నారు. ప్రత్యేకించి ఈ యాత్ర బీజేపీ బలంగా ఉందని భావించే హిందీ రాష్ట్రాల మీదుగా సాగనున్నది. ఇటీవల కాంగ్రెస్‌ ఓడిపోయిన మూడు రాష్ట్రాలతోపాటు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌, శివసేనను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహారాష్ట్రలోనూ ఆయన పర్యటన సాగనున్నది. ఇటీవల ఓడిపోయిన మూడు రాష్ట్రాల్లో ఓటు శాతం భద్రంగానే ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత ఓటింగ్‌ను రాహుల్‌ యాత్ర మెరుగుపర్చడంతోపాటు.. ఇతర ప్రాంతాల్లోనూ గట్టి ప్రభావం చూపగలిగితే లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతాలే ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఇండియా తురుపు ముక్కలా కులగణన

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహిస్తామని ఇండియా కూటమి ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకూ జనాభా లెక్కలు జరుతూ ఉన్నా.. కుల గణన జరిగింది లేదు. ఏ కులంవారు ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు. కేవలం అంచనాల ఆధారంగా ఇన్నాళ్లూ సాగింది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి, కులాల లెక్కలు తీసి, వారి జనాభా దామాషా ప్రకారం వారికి సంక్షేమ ఫలాలు, ఇతర ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతో కులగణన నినాదాన్ని ఇండియా కూటమి తీసుకున్నది. దీనికి విశేష మద్దతు వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

బీజేపీ పాలనలో బడుగు జీవుల గోస

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగించేశామని గోడీ మీడియా ద్వారా చాటుకుంటున్నప్పటికీ పరిస్థితులు అంత గొప్పగా ఏమీ లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్రత్యేకించి ధరల భారం ప్రజలను అతలాకుతలం చేస్తున్నది. పేదరికం పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. నిరుద్యోగిత పీడిస్తున్నది. ఆక‌లి సూచీలో 125 దేశాల‌లో భార‌త 111 స్థానంలో ఉంది. గ‌త ఏడాది 107లో ఉండ‌గా ఈ ఏడాది మ‌రింత దిగ‌జారి 111కు ప‌డిపోయింది. నిరుద్యోగం 2014లో 5.44 శాతం ఉండ‌గా 2023లో 10.05 శాతానికి పెరిగింది. రూపాయి విలువ ఆనాడు డాల‌ర్‌కు రూ.60.95 ఉంటే నేడు రూ.83.25కి పడిపోయింది. ప్ర‌జ‌లు సంతోషంగా లేరన‌డానికి గ్లోబ‌ల్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ను ప‌రిశీలిస్తే 146 దేశాల‌లో 126వ స్థానంలో భార‌త్ ఉంది. మీడియా స్వేచ్ఛను ప‌రిశీలిస్తే 180 దేశాల‌లో భార‌త్ 161 స్థానంలో ఉంది. ఇదే స‌మ‌యంలో కార్పొరేట్లకు భారీ లబ్ధి జరిగేలా మోదీ చర్యలు తీసుకున్నారు. వారికి దాదాపు రూ.10 ల‌క్ష‌ల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారు. దీని భారం అంతా ప్ర‌జ‌లపై ప‌రోక్షంగా వేశారు’ అని ఒక సీనియర్‌ జర్నలిస్టు పేర్కొన్నారు. నిజానికి మోదీ పాలనలో దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని చెప్పుకొనే పరిస్థితి లేకనే బీజేపీ నేతలు రామనామ స్మరణ చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. పదేళ్ల పరిపాలన తర్వాత కూడా మోదీ ప్రభుత్వం రాముడిని, అయోధ్యలో రామాలయాన్ని ముందుకు పెట్టుకుని ఓటు రాజకీయం చేస్తుండటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. స్ప‌ష్ట‌మైన మెజార్టీతో అధికారంలోకి వ‌స్తామ‌నే న‌మ్మకాన్ని అధికార పక్షం కోల్పోవడం వల్లే మళ్లీ మత అజెండాను తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు. జనవరి 22న ఆలయం ప్రారంభించింది మొదలు లోక్‌సభ ఎన్నికల దాకా అయోధ్య సందర్శన అంశాన్ని పెద్ద ఎజెండాగా పెట్టుకున్నారని అంటున్నారు. ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయలేమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి కళ్ల ముందు ఉన్నా.. సంక్షేమ పథకాలు అందిస్తున్నా మూడోసారి కూడా ఎందుకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో బీఆరెస్‌ను అధికారం నుంచి తప్పించారని పేర్కొంటున్నారు. మోదీ విషయంలో ఇది కూడా ఒక ఫ్యాక్టర్‌గా నిలిచే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఇవన్నీ కలగలిపి చూస్తే.. మోదీని అధికారానికి దూరం ఉంచలేకపోయినా.. బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేసే అవకాశాలు లేకపోలేదని, హంగ్‌ తీర్పు వెలువడినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.