Plane Crash | అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. అనేక మంది మృతి! ఇదే విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం?

Plane Crash | అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. అనేక మంది మృతి! ఇదే విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం?

Plane Crash | అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బ్రిటన్‌లోని గాడ్విక్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు టేకాఫ్‌ తీసుకున్న ఎయిర్ ఇండియా విమానం కొద్ది నిమిషాల్లోనే సమీపంలోని ఒక నివాస ప్రాంతంపై కూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 252 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో అనేకమంది చనిపోయారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ విమానం ఒక డాక్టర్ల హాస్టల్ భవంతిపై కూలిపోయింది. విమానంలో 11 మంది చిన్నారులు సహా 242 మంది ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీసు, ఒకరు కెనడియన్‌ ఉన్నారని ఎయిర్‌ ఇండియా తెలిపింది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం కనీసం 170 మంది చనిపోయి ఉండవచ్చని తెలుస్తున్నది. కూలిపోయిన విమానం బోయిన్ 787 – 8 డ్రీమ్ లైనర్ అని ఫ్లైట్ రాడార్ 24 తెలిపింది. ఇది అత్యంత అధునాతనమైన ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, మరిన్ని వివరాలు తెలియజేస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్ లో పేర్కొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీప హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

విమానం కూలిపోవడంతో ఘటనా స్థలంలో భారీగా మంటలు, దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది.. క్షతగాత్రులను స్ట్రెచర్‌ల ద్వారా అంబులెన్సుల్లోకి తరలించిడం ఒక వీడియోలో కనిపిస్తున్నది. మధ్యాహ్నం 1:30 గంటలకు 23వ నంబర్‌ రన్‌వే నుంచి ఈ విమానం బయలుదేరిందని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ట్రాఫిక్ కంట్రోల్ తెలిపింది. వెంటనే ఎమర్జన్సీ సంకేతమైన మేడే కాల్‌ వచ్చిందని, కొన్ని క్షణాలకే విమానంతో సంబంధాలు తెగిపోయాయని ఫ్లైట్‌రాడార్‌24 వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఈ ఘటన విషయంలో వివరాలు తెప్పించుకుంటున్నామని బోయిన్ కంపెనీ పేర్కొన్నది.

విమానం ఆకాశంలో 625 అడుగుల గరిష్ఠ బారోమెట్రిక్‌ ఆల్టిట్యూడ్‌కు చేరుకున్న తర్వాత (విమానాశ్రయం నుంచి 200 అడుగుల ఎత్తున) ఒక్కసారిగా కిందికి జారిపోవడం ప్రారంభించింది. నిమిషానికి 475 అడుగుల వేగంగా కిందపడిపోయిందని ఫ్లైట్‌రాడార్‌ 24 తెలిపింది. ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందికి జారిపోవడం అనేది అత్యంత ప్రమాదానికి సంకేతం. ఇంజిన్‌ వైఫల్యం లేదా నియంత్రణ కోల్పోవడం లేదా, యంత్రాల్లో సమస్యల కారణంగా ఇది చోటు చేసుకుంటుంది. అయితే.. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయం దర్యాప్తు తర్వాతే వెల్లడి అవుతుంది.

ప్రయాణికుల్లో గుజరాత్‌ మాజీ సీఎం?

అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన భార్య అంజలి రూపానీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఆమెను తీసుకొని వచ్చేందుకు విజయ్‌ రూపానీ ఇదే విమానంలో బయల్దేరారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. విమాన ప్రయాణానికి విజయ్‌ రూపానీ ఏర్పాట్లు చేసుకున్న విషయాన్ని బీజేపీ గుజారాత్‌ అధికార ప్రతినిధి యజ్ఞేశ్‌ దవే ధృవీకరించారు. అయితే.. ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదని పేర్కొన్నారు. విజయ్‌ రామ్‌నికల్‌ రూపానీ బిజినెస్‌ క్లాస్‌ (జెడ్‌ క్యాటగిరీ)లో 12వ ప్రయాణికుడిగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే.. దీనిని ఏవియేషన్‌ వర్గాలు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఆయన జాడ తెలియని నేపథ్యంలో రూపానీ నివసించే రాజ్‌కోట్‌ నివాసం వద్ద ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు అభిమానులు, పొరుగువారు ఆయన నివాసం వద్ద గుమిగూడారు.

ఘటనా స్థలం నుంచి సమీప హాస్పిటల్స్‌కు సుమారు 100 మృతదేహాలను తరలించినట్టు రాయిటర్స్‌ తెలిపింది. ప్రమాద ఘటన నేపథ్యంలో కొద్ది గంటలపాటు విమాన రాకపోకలను నిలిపివేసిన అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌.. అనంతరం 4.02 గంటల నుంచి వాటిని పునఃప్రారంభించింది.