Delimitation: డీలిమిటేషన్‌పై.. స్టాలిన్ ఆల్ పార్టీ మీట్ కీలక నిర్ణయాలు
దేశ ప్రయోజనాల కోసం జనాభా నియంత్రణ పద్ధులను చురుకుగా అమలు చేసినందుకు పార్లమెంటులో తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించడం పూర్తిగా అన్యాయం.. అని తీర్మానంలో పేర్కొన్నారు. మరో మూడు దశాబ్దాల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని సమావేశంలో మాట్లాడిన స్టాలిన్ డిమాండ్ చేశారు.

delimitation : 2026లో చేపట్టనున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది. డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక తీర్మానాలు ఆమోదించారు. డీఎంకేతోపాటు ఏఐఏడీఎంకే, కాంగ్రెస్, విదుతలాయి చిరుతాయిగళ్ కట్చి, తమిళగ వెట్రి కళగం, కమ్యూనిస్టు పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. బీజేపీ, నామ్ తమిళర్ కట్చి, తమిళ మనీల కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. డీలిమిటేషన్ ప్రక్రియ తమిళనాడును బలహీనపరుస్తుందని, భారత సమాఖ్య వ్యవస్థకే ముప్పుగా పరిణమిస్తుందంటూ ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. కేవలం రాబోయే జనాభా లెక్కల సేకరణ గణాంకాల ఆధారంగానే నిర్వహించే డీలిమిటేషన్ తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తీర్మానం పేర్కొన్నది.
దేశ ప్రయోజనాల కోసం జనాభా నియంత్రణ పద్ధులను చురుకుగా అమలు చేసినందుకు పార్లమెంటులో తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించడం పూర్తిగా అన్యాయం.. అని తీర్మానంలో పేర్కొన్నారు. మరో మూడు దశాబ్దాల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని సమావేశంలో మాట్లాడిన స్టాలిన్ డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన వివిధ రాజకీయ పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేయాలని కూడా అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. డీలిమిటేషన్‌పై పోరాటంలో కలిసి రావాలని అన్ని దక్షిణాది రాష్ట్రాల పార్టీలకు సమావేశం ఆహ్వానం పలికింది.
జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడిగా ఎదుర్కొనాలని స్టాలిన్ అన్నారు. పార్లమెంటులో 39 మంది ఎంపీలు ఉన్న తమిళనాడు గొంతును కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. డీలిమిటేషన్ ప్రక్రియతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోతుందని హెచ్చరించారు. తమిళనాడు ఎంపీల సంఖ్య డీలిమిటేషన్ తర్వాత 31కి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడుకు అతిపెద్ద ప్రమాదంగా పరిణమించే డీలిమిటేషన్‌ను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డీలిమిటేషన్‌పై పోరాటాన్ని తమిళనాడు హక్కుల కోసం జరిగే పోరాటంగా ఆయన అభివర్ణించారు.