Tamil Nadu | క‌మ‌లం పువ్వుకు రెండాకులు జ‌త‌? కండిష‌న్స్ అప్లై అంటున్న‌ ప‌ళ‌నిస్వామి!

‘పొత్తుల గురించి మాట్లాడటానికి ఎన్నికల తేదీలను ప్రకటించారా? 2019లోగానీ, 2021లోగానీ మేం కూట‌మి గురించి ఎన్నిక‌ల ముందు మాత్ర‌మే మాట్లాడుకున్నాం. కూట‌మి, సిద్ధాంతం వేరు. మా సిద్ధాంతంలో మార్పులేదు. కూట‌మికి అప్ప‌టి ప‌రిస్థితులు మాత్ర‌మే ఆధారంగా ఉంటాయి. ఆ ప‌రిస్థితులే కూట‌మిని నిర్ణ‌యిస్తాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉంది’ అని పళనిస్వామి చెప్పారు. 

Tamil Nadu | క‌మ‌లం పువ్వుకు రెండాకులు జ‌త‌? కండిష‌న్స్ అప్లై అంటున్న‌ ప‌ళ‌నిస్వామి!
  • త‌మిళ‌నాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు యత్నాలు!
  • మొన్న అమిత్‌షాతో అన్నాడీఎంకే నేత‌ ప‌ళ‌నిస్వామి భేటీ
  • హోంమంత్రిని కలిసేందుకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు అన్నామ‌లై
  • రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు?
  • రాష్ట్ర పాలిటిక్స్‌లో అన్నామలై పాత్ర తగ్గించాలన్న పళనిస్వామి?

Tamil Nadu | త‌మిళ‌నాడులో రాజ‌కీయ వాతావ‌ర‌ణం హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. రెండు రోజుల క్రితం అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎడ‌ప్పాడి కే ప‌ళ‌నిస్వామి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను క‌లువ‌గా.. గురువారం అదే అమిత్‌షాను క‌లిసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కే అన్నామ‌లై ఢిల్లీ రావ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తి రేపింది. మంగ‌ళ‌వారం అమిత్‌షాను పళనిస్వామి ప్రైవేటుగా క‌లిసి సుమారు 15 నిమిషాలు చ‌ర్చ‌లు జ‌రిపారు. త‌మిళ‌నాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును పున‌రుద్ధ‌రించే విష‌యంలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు సాగిన‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌ళ్లీ పొత్తు పెట్టుకోవాలంటే కొన్ని నిర్దిష్ట ష‌ర‌తుల‌ను ప‌ళ‌నిస్వామి ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తున్న‌ది. ప్ర‌త్యేకించి 2026 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మికి అన్నాడీఎంకే నాయ‌క‌త్వం వ‌హించేట్ట‌యితేనే పొత్తుకు ఒకేచెబుతామ‌ని తేల్చేసిన‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో అన్నామ‌లై పాత్ర‌ను త‌గ్గించాల‌న్న డిమాండ్‌ను కూడా అమిత్‌షా ముందు ఉంచార‌ని తెలుస్తున్న‌ది. మ‌రోవైపు కూట‌మి క‌ట్టే విష‌యంలో టీటీవీ దిన‌క‌ర‌న్‌, వీకే శ‌శిక‌ళ‌, ఓ ప‌న్నీర్ సెల్వం వంటివాళ్ల‌ను తాను ప‌ట్టిచుకునే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశార‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు చెబుతున్నాయి.

కానీ.. మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం.. అబ్బే.. పెద్దాయ‌న్ను క‌లుద్దామ‌ని వ‌చ్చా, రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పైనే మాట్లాడుకున్నాం.. అంటూ మీడియాకు సెల‌విచ్చారు. ‘ప్రజలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకే మేం వచ్చాం. సెన్సేషనల్ చేయడానికే మీడియా పొత్తుల గురించి వార్తలు ఇస్తున్నది. అయినా ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది కాలం ఉంది..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఎన్నికలకు ముందు మాత్రమే పొత్తు అంశాలు వస్తాయని పళనిస్వామి నొక్కి చెప్పారు. ‘పొత్తుల గురించి మాట్లాడటానికి ఎన్నికల తేదీలను ప్రకటించారా? 2019లోగానీ, 2021లోగానీ మేం కూట‌మి గురించి ఎన్నిక‌ల ముందు మాత్ర‌మే మాట్లాడుకున్నాం. కూట‌మి, సిద్ధాంతం వేరు. మా సిద్ధాంతంలో మార్పులేదు. కూట‌మికి అప్ప‌టి ప‌రిస్థితులు మాత్ర‌మే ఆధారంగా ఉంటాయి. ఆ ప‌రిస్థితులే కూట‌మిని నిర్ణ‌యిస్తాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉంది’ అని పళనిస్వామి చెప్పారు.

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC)తో సంబంధం ఉన్న ఈడీ కేసు విషయంలో హోం మంత్రితో చర్చలు జరిపినట్టు మాజీ సీఎం చెప్పారు. ఈ విషయంలో లోతుగా విచారణ చేపట్టాలని అమిత్‌షాను కోరినట్టు తెలిపారు. ‘తమిళనాడుకు సంబంధించిన వివిధ అంశాలపైనా చర్చించాం. జాతీయ విద్యావిధానం భాషా సూత్రం పైనా, నిధుల విడుదల, రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి తదితర అంశాలూ చర్చకు వచ్చాయని తెలిపారు. 2023లో కూటమి విచ్ఛిన్నమైన దగ్గర నుంచీ బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు తమిళనాడులో ప్రత్యర్థి పక్షాలుగా ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు పార్టీలు చేతులు కలిపాయి. ఆ సమయంలో బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకోగలిగింది. 2016లో పార్టీ అధినేత్రి జయలలిత మరణానంతరం బీజేపీకి అన్నాడీఎంకే దగ్గరయింది. తాజాగా మరసారి రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు, పళనిస్వామి పలు కీలక డిమాండ్లను అమిత్‌షా ముందు ఉంచడం వంటి పరిణాల నేపథ్యంలో అన్నామలై అమిత్‌షాతో ఏం చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.