జోడో యాత్రలో నడుస్తున్నది రాహుల్ కాదట!
రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా అసోం ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ మధ్య సాగుతున్న మాటల యుద్ధం కొత్త మలుపు తీసుకున్నది

- అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విచిత్ర విమర్శ
- కాంగ్రెస్ పార్టీ సాఫ్ట్ నక్సల్ పార్టీ అంటూ వ్యాఖ్య
- సామాజిక మాధ్యమాల్లో శర్మను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
గువాహటి: రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా అసోం ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ మధ్య సాగుతున్న మాటల యుద్ధం కొత్త మలుపు తీసుకున్నది. రాహుల్ గాంధీ తన రెండో శరీరంతో యాత్ర చేస్తున్నారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. జోడో యాత్రలో ఉన్నది అసలు రాహుల్ కాదని, వేరే రాహుల్ అని అన్నారు. ‘నేను చూడలేదు కానీ.. ఈ విషయంలో వచ్చిన కొన్ని వార్తలను చూశాను. రాహుల్ గాంధీ సాధారణంగా బస్సు లోపల 8 మంది కూర్చునేందుకు వీలున్న గది ఉంటుందని, అందులో రాహుల్ కూర్చొని ఉంటారని కొందరు కాంగ్రెస్ నాయకులు నాతో అన్నారు. మరైతే బస్సులో దూరం నుంచి చూస్తే రాహుల్‌గాంధీలా కనిపిస్తూ జనానికి చేతులు ఊపేది ఎవరు?’ అని ఆయన ప్రశ్నించారు.
బస్సులో జనానికి చేతులు ఊపేది అసలు రాహుల్ గాంధీ కాదని ఆయన అన్నారు. జనం మాత్రం రాహుల్ గాంధీ న్యాయం కోసం కిలోమీటర్లకొద్దీ నడుస్తున్నారని భ్రమపడుతున్నారని వ్యాఖ్యానించారు. కానీ.. రాహుల్ గాంధీ మాత్రం సన్నిహితులతో చాయ్ తాగుతూ, స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారని అన్నారు. ఇదిలా ఉంటే.. అచ్చం రాహుల్‌లా జట్టు, గడ్డం పెంచిన వ్యక్తి ఒకరు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటున్నారు. రాకేశ్ కుశ్వాహా అనే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త మణిపూర్‌లో జనవరి 14న భారత్ జోడో న్యాయ్ యాత్ర మొదలైన దగ్గర నుంచి అందులో కొనసాగుతున్నాడు. ఈయన ఫొటోలు పేపర్లలో రావడాన్ని హిమంతబిశ్వ శర్మ ప్రస్తావిస్తూ.. రెండు శరీరాల కామెంట్లు చేశారు. దీనిపై నెటిజన్లు శర్మను తెగ ట్రోల్ చేశారు.