అయోధ్య విరాళాల చోరీ కేసులో ట్వీస్టు..రంగంలోకి ఈడీ !

అయోధ్య రామమందిరంకు సంబంధించి రూ.200కోట్ల మేరకు విలువైన నగదు, బంగారం, వెండి కానుకల విరాళాల చోరీ కేసులో యూపీ పోలీసులు మరో కీలక ట్వీస్టు ఇచ్చారు. ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ పోలీసులు ఈడీకి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఈ కుంభకోణంలో ఎస్‌బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై దర్యాప్తు చేయాలంటూ ఈడీకి పోలీసులు లేఖ రాశారు. ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ భారీగా విరాళాల మాయంపై మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనుంది.

విధాత : అయోధ్య రామమందిరంకు సంబంధించి రూ.200కోట్ల మేరకు విలువైన నగదు, బంగారం, వెండి కానుకల విరాళాల చోరీ కేసులో యూపీ పోలీసులు మరో కీలక ట్వీస్టు ఇచ్చారు. ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ పోలీసులు ఈడీకి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఈ కుంభకోణంలో ఎస్‌బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై దర్యాప్తు చేయాలంటూ ఈడీకి పోలీసులు లేఖ రాశారు. ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ భారీగా విరాళాల మాయంపై మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనుంది.

సిట్ దర్యాప్తులో కీలక పురోగతి…

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ వేగవంతం చేసింది. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసును తవ్వేకొద్దీ అవకతవకలు బయటపడుతున్నాయి. తాజాగా కీలక నిందితుడు అవినాష్‌ శుక్లాను విచారిస్తున్న అధికారుల బృందం మరో కోణంలో అక్రమాలను గుర్తించింది. ఆలయంలో వివిధ పోస్టుల నియామకాలను డబ్బులు తీసుకొని చేశారని నిందితుడు వెల్లడించినట్లు పోలీసు వర్గాల సమాచారం. అతనిచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు ట్రస్ట్‌ సభ్యుల్లో కీలకమైన వారిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ పోస్టుల్లో నియమించారు. వీరిలో కొందరి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు బృందానికి ఆలయ ఉద్యోగులకు చెందిన అపాయింట్‌మెంట్‌ లెటర్లు, ఫార్మల్‌ సర్వీస్ అగ్రిమెంట్లు వంటివి అందకపోవడంతో అసలు వీరి నియామకం ఎలా జరిగింది..ఎవరి ఆదేశాల మేరకు జరిగాయన్నదానిపై విచారణ కొనసాగిస్తున్నారు. విరాళాల మాయం విచారణలో భాగంగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, వారి లావాదేవీలపై అధికారులు విచారణ చేస్తున్నారు.

అయోధ్య ఆలయ విరాళాల చోరీ ఇంటిదొంగల పనే

ఆయోధ్య విరాళాల మాయం కేసులో అరెస్టయిన అనుకల్ప్‌ మిశ్రా, లవ్‌ కుశ్‌ మిశ్రా,ఆలయ మేనేజర్ గోపాల్ రావుతో పాటు 10 మంది నిందితులు కూడా గతేడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సమయంలోనే అత్యధిక మొత్తంలో విరాళాలు దోచుకున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఇప్పటికే వారి ఇళ్లల్లో జరిపిన సోదాల్లో పోలీసులు రూ.70.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా నిందితుల ఇళ్లపై మరోసారి అయోధ్య పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితులైన లవకుష్, అనుకల్ప్, కరుణేష్‌లు నివసించే మిల్కీపూర్, ఖండా, రుదౌలీ గ్రామాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని అత్యంత కీలకమైన పత్రాలతో పాటు ఒక రహస్య పెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ యోగా కేంద్రం నుంచి ‘రామరాజ్య కోశ్‌’ అనే పేరుతో ఉన్న విరాళాల హుండీని స్వాధీనం చేసుకున్నారు. దానిపై పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ ఉంది. నిందితుల్లో ఒకరైన అవినాశ్‌ శుక్లా.. ఈ యోగా కేంద్రంలోని ఓ గదిలో గత పదేళ్లుగా నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కేసులో మరింత పురోగతి కోసం లవకుష్ తండ్రి బచ్చులాల్ మిశ్రాను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ప్రధాన నిందితుడి భార్య ఖాతాలో రూ.24లక్షల నగదు

పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు లవకుష్ భార్య సుప్రియ బ్యాంక్ ఖాతాలో రూ. 24 లక్షల వరకు ఏడాదిలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఒక సాధారణ గృహిణి సుప్రియ ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ సొమ్ము విరాళాల చోరీకి సంబంధించినదా? లేక ఇంకా ఎవరైనా పెద్దల హస్తం ఉందా? అనే కోణంలో సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ అక్రమ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల ఐదేళ్ల బ్యాంకు ఖాతాలను రీఆడిట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

సిట్ దర్యాప్తుపై అసంతృప్తి

మరోవైపు రామాలయ విరాళాల కుంభకోణంపై సిట్ దర్యాప్తు అంత సంతృప్తిగా లేదని అయోధ్య ఆలయ పూజారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సహా పలువురు ట్రస్ట్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. కోట్లాది మంది నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని త్వరగా, పారదర్శకంగా ముగించాలని కోరుతున్నారు. సిట్ దర్యాప్తు తీరుపై ఆధ్యాత్మిక ప్రవచనకర్త కర్పత్రి మహారాజ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు కావడానికి తామే కారణ మని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రాయ్ పేర్కొన్నారు. తమ పార్టీ ఒత్తిడి వల్లే ఈ చట్టపరమైన చర్య ప్రారంభమైందని అన్నారు. అయోధ్య రామ మందిర నిధుల దుర్వినియోగానికి సంబంధించి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా, ఇతర సభ్యులు గోపాల్ రావు, చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలని తాను డిమాండ్ చేశానని గుర్తు చేశారు.

ఇకపోతే అయోధ్య విరాళాల మాయం కేసులో అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అరెస్టయిన నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని తీర్మానించింది. ఎవరైనా వాదిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

బీజేపీది నకిలీ హిందుత్వ : అవిముక్తేశ్వరానంద

అయోధ్య విరాళాల కుంభకోణం నేపథ్యంలో యుపీ ప్రభుత్వంపైనా, బీజేపీపైనా జ్యోతిర్మఠం పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో ఉన్నవాళ్లు నకిలీ హిందువులని, వారిది నకిలీ హిందుత్వ అని ఆయన విరుచుకుపడ్డారు. వేదాలను, శాస్త్రాలను వాళ్లు నమ్మరని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో అసలు దొంగలను వదిలేశారని, సిట్‌ అందుకే ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ‘ఈ కేసులో అసలు సూత్రధారులను వదిలేశారు. కింది స్థాయి ఉద్యోగుల పేర్లను మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. రామ మందిరం విషయంలో మొదటి నుంచి ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు ఎంపిక చేసిన వ్యక్తులతో ట్రస్ట్ నడుస్తోందని, సాధువులు, జ్ఞానులు, పండితులను ఆలయ నిర్వహణలో దూరంగా పెట్టారని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News