బ్రిజ్‌భూషణ్‌ బదులు ఆయన కుమారుడికి బీజేపీ టికెట్‌

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నకైసర్‌గంజ్‌ సిటింగ్‌ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు బదులు ఆయన కుమారుడికి బీజేపీ టికెట్‌ ఇచ్చింది

బ్రిజ్‌భూషణ్‌ బదులు ఆయన కుమారుడికి బీజేపీ టికెట్‌

న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నకైసర్‌గంజ్‌ సిటింగ్‌ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు బదులు ఆయన కుమారుడికి బీజేపీ టికెట్‌ ఇచ్చింది. బీజేపీ గురువారం ప్రకటించిన జాబితాలో ఈ స్థానం నుంచి కరణ్‌భూషణ్‌ సింగ్‌ను పేర్కొన్నది. బ్రిజ్‌భూషణ్‌ చిన్న కొడుకు కరణ్‌ భూషణ్‌. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. గోండా జిల్లాలోని నవాబ్‌జంగ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తనకు కుమారుడికి టికెట్‌ ఇవ్వడంపై పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడైన బ్రిజ్‌భూషణ్‌కు ఈసారి టికెట్‌ దక్కడే అంశంపై కొద్దిరోజులుగా సస్పెన్స్‌ నెలకొన్నది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్‌భూషణ్‌పై పలువురు ప్రముఖ రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం దేశంలో తీవ్ర చర్చనీయాంశం అయింది.

ఆయనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పలువురు మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా వంటివారు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీర్ఘకాలం ధర్నా కూడా చేశారు. ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తదుపరి ఆయనకు బెయిల్‌ లభించింది. ఆరుసార్లు ఎంపీ అయిన బ్రిజ్‌ భూషణ్‌ తన నియోజకవర్గం పరిధిలో దాదాపు 50 ప్రైవేటు విద్యా సంస్థలను నడుపుతున్నారు. దాదాపు దశాబ్దంపాటు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఉన్నారు.