Brazilian Model : ఐయామ్ షాకింగ్..ఇలా వైరల్ అవుతాననుకోలేదు: బ్రెజిల్ మోడల్‌ లారిసా నెరీ

నకిలీ ఓట్ల కేసులో రాహుల్ గాంధీ ప్రస్తావించిన బ్రెజిల్ మోడల్‌ లారిసా నెరీ స్పందించారు. నకిలీ ఓటర్ల జాబితాలో ఉన్నది తన పాత ఫోటో అని, స్టాక్ ఇమేజ్ ప్లాట్‌ఫామ్ నుండి కొని ఉంటారని తెలిపారు. భారత రాజకీయాలతో తనకు సంబంధం లేదని తెలిపింది.

Brazilian Model : ఐయామ్ షాకింగ్..ఇలా వైరల్ అవుతాననుకోలేదు: బ్రెజిల్ మోడల్‌ లారిసా నెరీ

న్యూఢిల్లీ : హర్యానా రాష్ట్రంలో నకిలీ ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో వెల్లడించిన బ్రెజిల్ మోడల్ ఎవరన్న సంగతి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హర్యానాలో ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌ ఫొటోతో 22 నకిలీ ఓట్లను సృష్టించిన వైనాన్ని బయటపెట్టారు. అయినా ఈసీ ఎందుకు కనిపెట్టలేకపోయిందని ప్రశ్నించారు. రాహుల్ ప్రెస్ మీట్ తో ఆ బ్రెజిల్ మోడల్ ఫోటో నెట్ లో వైరల్ అయిపోగా..ఆమె వివరాల కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ బ్రెజిల్ మోడల్ లారిసా నేరీ వైరల్ గా మారిపోయింది. తాజాగా ఈ వ్యవహారంపై మోడల్ లారిసా నేరీ తన ఇన్ స్టా పేజీలో స్పందించారు. నకిలీ ఓటర్ల జాబితాలో ఉన్నది తన పాత ఫోటో అని వెల్లడించారు. ఓట్ల చోరీ వార్తల్లో తన పేరు రావడం చూసి చాలా షాకయ్యానని తెలిపారు. చాలామంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇంటర్వ్యూలు అడుగుతున్నారని ..ఇలా వైరల్‌ అవుతానని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు

భారత రాజకీయాలతో నాకు ఏ సంబంధం లేదు

నకిలీ ఓటర్ల జాబితాలో చూపిన నా పాత ఫోటో 18-20 ఏళ్ల వయసులో తీసుకున్నది అనుకుంటానని, స్టాక్‌ ఇమేజ్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఆ ఫొటోను కొనుగోలు చేసి ఉంటారనుకుంటున్నానని లారిసా నేరీ పేర్కొన్నారు. నన్ను భారతీయురాలిగా పేర్కొంటూ ఓట్ల చోరీ స్కామ్‌లో భాగం చేశారని..ఇదెక్కడి పిచ్చితనం అని.. ఎలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం అని అసహనం వ్యక్తం చేశారు. భారత రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని.. నేను బ్రెజిల్‌కు చెందిన డిజిటల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను మాత్రమేనన్నారు. ఇలాంటి వదంతులు రావడం చూసి నమ్మలేకపోయానని.. ఆ తర్వాత నుంచి నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఇంటర్వ్యూలు కావాలంటున్నారని..వారందరికి సమాధానం చెప్పలేకపోతున్నానని లారిసా నేరీ వివరణ ఇచ్చారు. ఈ వీడియోను ఫ్యాక్ట్‌ చెకర్‌ మహమ్మద్‌ జుబేర్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.