వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన బీఎస్‌ఎన్‌ఎల్‌..! 2024 జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు..!

వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన బీఎస్‌ఎన్‌ఎల్‌..! 2024 జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు..!

దేశీయ ప్రముఖ ప్రభుత్వరంగ టెలీకాం సంస్థ భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) వినియోగదారులకు తీపి కబురును అందించింది. వచ్చే ఏడాది జూన్‌నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 5జీ సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న కంపెనీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పూర్వార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ ఏడాది డిసెంబర్‌లో పంజాబ్‌లో 4జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇప్పటికే ఎంపిక చేసిన 200 ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. పంజాబ్‌లో 3వేల ప్రాంతంలో సేవలను మొదలుపెట్టి.. దశలవారీగా విస్తరిస్తామని చెప్పారు. దశలవారీగా నెట్‌వర్క్‌ను 6వేలకు పెంచుతామని.. ఆ తర్వాత 15వేల వరకు పెంచనున్నట్లు వివరించారు.


అలాగే, 2024 జూన్‌ నాటికి 4జీని దేశవ్యాప్తంగా విస్తరించేలా బీఎస్‌ఎన్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. 4జీ సేవల విస్తరణ తర్వాత 5జీ అప్‌డేట్‌ చేయనున్నారు. ఇందు కోసం ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌, ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐకి బీఎస్‌ఎల్‌ రూ.19వేల కోట్ల విలువైన పనుల బాధ్యతలను అప్పగించింది.


పూర్తిస్థాయిలో 5జీ సేవల విస్తరణకు బీఎస్‌ఎన్‌ఎల్‌ వద్ద తగినంత స్పెక్ట్రమ్‌ ఉందని బీఎస్‌ఎల్‌ఎల్‌ ఎండీ వివరించారు. ఇదిలా ఉండగా.. అయితే, పోటీ టెలింకాం కంపెనీలు ఇప్పటికే 5జీ సేవలను అందిస్తుంటే.. ప్రస్తుతం బీఎస్‌ఎల్‌ఎల్‌ 4జీ సేవల విస్తరణలోనే ఉండడంపై బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వేగంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించాలని కోరుతున్నారు.