Kolkata murder case | ఆగస్ట్ 9న ‘కీలక డాక్టర్’కు ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపల్ ఫోన్ కాల్! ఏమిటా రహస్యం?
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College)లో పీజీ ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
Kolkata murder case | ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College)లో పీజీ ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. కేవలం ఒక సాధారణ లైంగిక దాడి, హత్య కాదు కాబట్టే ఈ ఘటన జరిగిన రోజు అనేక తతంగాలు జరిగాయన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ కేసును సీబీఐ (CBI) అధికారులు దర్యాప్తు చేస్తన్నారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన సమయంలో కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ (Sandip Ghosh) ఫోన్ కాల్ డాటాను విశ్లేషిస్తున్నారు.
ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. మహిళా డాక్టర్ చనిపోయి కనిపించిన రోజున సందీప్ ఘోష్.. ఒక ‘కీలక డాక్టర్’తో సుదీర్ఘ సమయం మాట్లాడినట్టు సీబీఐ అధికారులు గుర్తించారని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఆగస్ట్ 9న కళాశాల మేనేజ్‌మెంట్‌లో ‘కీలక డాక్టర్’తో ఆయన మాట్లాడినట్టు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయని ఆనంద్ బజార్ (Anand Bazar) పత్రిక ఆన్‌లైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఉదయం ఏడు గంటల సమయంలో ఆరోగ్యశాఖ అధికారులతోపాటు అనేక మందితో ఘోష్ ఫోన్‌లో మాట్లాడారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే.. తనకు ఈ ఉదంతం గురించి ఉదయం 9 గంటల తర్వాతే తెలిసిందని సీబీఐ దర్యాప్తులో ఘోష్ చెప్పాడు. అయితే.. అంతకు ముందు ఇంత మందితో సుదీర్ఘంగా ఆయన ఎందుకు ఫోన్‌లో మాట్లాడాడనే అంశంపై సీబీఐ అధికారులు దృష్టిపెట్టారు. ఘోష్ ఫోన్ కాల్స్‌కు సంబంధించి నెల రోజుల డాటాను అధికారులు సేకరించారని సమాచారం. అయితే.. ఇంత ఉదయాన్నే ఆరోగ్య శాఖ అధికారులు, కీలక డాక్టర్‌తో ఎందుకు మాట్లాడాడనేది తెలియాల్సి ఉన్నది.
ఇదిలా ఉంటే.. సందీప్ ఘోష్‌కు సీబీఐ అధికారులు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. గత మూడు రోజులుగా డిసెప్షన్ డిటెక్షన్ టెస్ట్స్ (DDT)లను సీబీఐ అధికారులు నిర్వహిస్తున్నారు. శనివారం లేయర్డ్ వాయిస్ టెస్ట్, అనంతరం సోమవారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. సోమవారం నాటి పాలిగ్రాఫ్ టెస్ట్ పూర్తికాకపోవడంతో మంగళవారం కొనసాగించారు. మాట్లాడే వ్యక్తి సత్యమే చెబుతున్నాడా? అనేది ఆయన స్వరాన్ని పరీక్షించడం ద్వారా నిర్ధారించుకునే ప్రక్రియే లేయర్డ్ వాయిస్ ఎనాలిసిస్.
ఫోరెన్సిక్ పరీక్షల్లో ఇది కొత్తరకం పరీక్ష. అసత్యాన్ని గుర్తించలేకపోయినా.. సంబంధిత వ్యక్తి స్ట్రెస్, భావోద్వేగ స్థాయిలను గుర్తించేందుకు దోహదం చేస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. కాలేజీలో ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై మనీలాండరిగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నది. కాలేజీకి సంబంధించిన మెడికల్ ప్రొక్యూర్‌మెంట్ డాక్యుమెంట్లను, బ్యాంకు ఖాతాల వివరాలను వివిధ వర్గాల నుంచి ఈడీ అధికారులు సేకరించినట్టు తెలుస్తున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram