డెసిషన్ డే.. మూడు బిల్లులపై నేడు ఓటింగ్

దేశ చరిత్రలో కీలకమైన మూడు బిల్లులపై నేడు శుక్రవారం లోక్ సభలో సాయంత్రం 4గంటలకు ఓటింగ్ నిర్వహించనుంది. రాజ్యంగ సవరణ అవసరమయ్యే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజార్టీతో కూడిన ఆమోదం అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి రెండు సభలలోనూ అంత మెజార్టీ లేకపోవడంతో బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది.

విధాత : దేశ చరిత్రలో కీలకమైన మూడు బిల్లులపై నేడు శుక్రవారం లోక్ సభలో సాయంత్రం 4గంటలకు ఓటింగ్ నిర్వహించనుంది. మహిళా రిజర్వేషన్ల(నారీ శక్తి వందన్)ను 2029నుంచి అమలు చేసేందుకు వీలుగా 2011జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కోసం తెచ్చిన 131రాజ్యాంగ సవరణ బిల్లు-2026పై ఓటింగ్ జరుగునుంది. అలాగే మహిళా రిజర్వేషన్ల కోసం నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2026 పైన కూడా ఓటింగ్ జరుగనుంది. ఇక దేశ వ్యాప్తంగా లోక్ సభల, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు డీలిమిటేషన్ బిల్లు-2026పైన కూడా ఓటింగ్ జరుగనుంది. మూడు బిల్లులో 131రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 2/3 మెజార్టీతో ఆమోదం తప్పసరి కాగా..డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు బిల్లుకు సాధారణ మెజార్టీ సరిపోతుంది.

131రాజ్యంగ సవరణ బిల్లు గట్టెక్కేనా..!

మహిళా రిజర్వేషన్లను 2029నుంచి అమలు చేసేందుకు వీలుగా గత జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కోసం తెచ్చిన 131రాజ్యాంగ సవరణ బిల్లు-2026 ఆమోదంపై  తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజ్యంగ సవరణ అవసరమయ్యే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజార్టీతో కూడిన ఆమోదం అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి రెండు సభలలోనూ అంత మెజార్టీ లేకపోవడం గమనార్హం.

2/3 మెజార్టీతో ఆమోదం సాధ్యమేనా..?

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం సభలో సభ్యుల హాజరు 50శాతంకు పైగా ఉండాలి.  హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది బిల్లుకు మద్దతు తెలుపాల్సి ఉంటుంది. లోక్ సభలో ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 540 ఉండగా..రాజ్యంగ సవరణకు 2/3 మెజార్టీ మేరకు బిల్లు ఆమోదానికి 360మంది సభ్యుల మద్దతు అవసరం. అధికార ఎన్డీఏ బలం 293కాగా..ప్రతిపక్షాల బలం 233గా ఉంది. బిల్లు ఆమోదానికి కేంద్రానికి మరో 68మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బిల్లుకు అనుకూలంగా ప్రతిపక్షాల మద్దతు కూడగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది.
విపక్షాల మద్దతు కూడగట్టడం, లేదా విపక్షాలలో క్రాస్ ఓటింగ్..లేక  విపక్ష సభ్యుల్లో ఎక్కువ మంది ఓటింగ్ కూ దూరంగా ఉంచడం అనే ఎత్తుగడలను కేంద్రం అనుసరిస్తుంది. రాజ్యంగ సవరణకు 2/3 మెజార్టీ ఆమోదం కోసం కేంద్రం 540మంది సభ్యులలో 104మంది సభ్యులు సభకు దూరంగా ఉంచగలిగితే.. అప్పుడు 291సభ్యులతో కూడి మూడింట రెండొంతుల మెజార్టీతో బిల్లు గట్టేక్కే అవకాశం కూడా ఉంది.

రాజ్యసభలోనూ కష్టమే..!

ఇక రాజ్యసభలో సైతం ఈ బిల్లు ఆమోదం పొందాలంటే అధికార కూటమికి 163మంది సభ్యుల మద్దతు కావాలి. రాజ్యసభలో బీజేపీకి 107మంది, కాంగ్రెస్ కు 28, టీఎంసీకి 19, ఆప్ 10, డీఎంకేకు 8మంది సభ్యులు ఉన్నారు. ఒక వేళ లోక్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందని పక్షంలో ఆ బిల్లు రద్దు కానుంది. లేదంటే బిల్లును మార్చుకుని తదుపరి సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతునివ్వకపోతే…మహిళా రిజర్వేషన్ల బిల్లును అవి అడ్డుకున్నాయని ఎన్డీఏ ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షాల మద్దతుతో బిల్లు ఆమోదించుకుంటే ఆ ఘనతను కేంద్రం తమ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా విపక్షాలు ఓటు వేస్తామని ప్రకటించడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఏం జరుగనుందన్నది సాయంత్రం 4గంటలకు జరిగే ఓటింగ్ లో తేలిపోనుంది.

మహిళా రిజర్వేషన్ యాక్ట్ అమలుపై గెజిట్ నోటిఫికేషన్

మరోవైపు కేంద్రం 131రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి ముందు అంతకుముందు ఆమోదించబడిన.. ది ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ -2023ను గురువారం నుంచి అమలులోకి వచ్చినట్లుగా అర్థరాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. ప్రస్తుతం లోక్ సభలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు సాంకేతిక అవరోధాలు లేకుండా నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా కేంద్రం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి :

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
OTT Movies | ఓటీటీలో ఈ రోజు సంద‌డే సంద‌డి… ఒక్కరోజే 26 సినిమాలు రిలీజ్, అందులో 17 స్పెషల్!

Latest News