లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరోసారి పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అధికార ఎన్డీయే ప్రభుత్వం గట్టిపట్టుదలతో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే.. ఈసారి తమిళనాడుకు చెందిన డీఎంకే, బెంగాల్‌లోని టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రెండు పార్టీల నేతలో బీజేపీ జాతీయ నాయకత్వం చర్చలు జరుపుతోందని తెలుస్తోంది.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలు కావడం, టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించే ప్రసక్తే లేదని డీఎంకే ప్రకటించడమే కాకుండా లోక్‌సభ, రాజ్యసభలో తమకు కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని లేఖలు రాసింది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే హాజరుకాలేదు. పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తరువాత టీఎంసీని బీజేపీ కోలుకోలేని విధంగా దెబ్బకొడుతున్నది. టీఎంసీ నుంచి గెలిచిన వారిలో ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక గ్రూపుగా ఏర్పాటు అయి మాజీ సీఎం మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగుర వేశారు. మరో ఇరవై మంది పార్లమెంటు సభ్యులు ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం డీలిమిటేషన్ బిల్లు విషయంలో సపోర్ట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
లోక్‌సభలో ఎన్డీయే కూటమికి అవసరమైనంత బలం లేకపోవడం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు అడ్డంకిగా మారింది. తాజా పరిణామాలపై బీజేపీ ముఖ్య నాయకుడు జాతీయ మీడియాకు సూచనప్రాయంగా వివరించారు. 1971 జనాభా లెక్కల ప్రతిపాదికన లోక్‌సభలో 850 వరకు సీట్లు పెరుగుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేయనున్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సీట్లు, 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించిన విషయం విదితమే. పాత జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేసేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సి ఉంటుంది. సభలో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోతే కథ మొదటికి వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీతో జన గణన పూర్తవుతుండడంతో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వేచి ఉండాల్సి ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా లెక్కల ప్రకారం నియోజకవర్గాలు విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై ఏపీతో తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ఉండేందుకు పాత జనాభా లెక్కలతో నియోజకవర్గాలను విభజన చేస్తే సంఖ్యాపరంగా నష్టం జరగదనేది కేంద్రం పెద్దలు నచ్చచెబుతున్నట్లు సమాచారం. పాత లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి రాష్ట్రంలో యాభై శాతం పెరగవచ్చని అంటున్నారు. ఆ మేరకు లోక్‌సభ బలం 543 నుంచి 816 సీట్లకు పెరుగుతుందని అంచనా. గత ఏప్రిల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, రాష్ట్రాలకు అన్యాయం జరగదని, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవని నమ్మబలికారు. ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్య దామాషా ప్రకారం సీట్లు పెరుగుతాయని హామీ ఇచ్చారు. రానున్న వర్షాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారని సమాచారం. దీనికి ముందు కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సవరణ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఒకవేళ రాజ్యాంగ సవరణ బిల్లు సభలో ఆమోదం పొందనట్లయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు సాధారణ మెజారిటీతో ఆమోదింప చేయించనున్నారని సమాచారం. ఇందుకోసం డీఎంకే, టీఎంసీ సభ్యుల మద్దతు తీసుకుంటారని తెలుస్తున్నది.
