అవినీతిలో మహాదేవుడి పేరూ వదలలేదు.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై మోదీ విమర్శలు

రానున్న అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా విపక్ష పార్టీలపై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) పర్యటనలో ఉన్న ఆయన.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ (Congress) నాయకుడు భూపేశ్ బాఘేల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అవినీతి కార్యక్రమంలో మహాదేవుని పేరునీ వదలలేదని దెప్పిపొడిచారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App) నిర్వాహకుల నుంచి బాఘేల్‌కు వందల కోట్ల రూపాయల సొమ్ము ముట్టిందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మోదీ ఈ విమర్శలు చేశారు.
దుర్గ్ ప్రాంతంలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అవినీతి సొమ్మును ఉపయోగిస్తోందని.. ఈ క్రమంలో వారు మహాదేవుడి పేరునూ వదలలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ దోచుకున్న ప్రతి రూపాయినీ వెనక్కి తీసుకొస్తామని.. నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సైతం కాంగ్రెస్ హవాలా సొమ్మును పార్టీ ప్రచారానికి వినియోగించుకుంటోందని దుయ్యబట్టారు.
అయితే తనపై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి బాఘేల్ తీవ్రంగా ఖండించారు. బీజేపీని గెలిపించే బాధ్యతను మోదీ, అమిత్‌షాలు దర్యాప్తు సంస్థలకు ఇచ్చినట్టున్నారని ఎద్దేవా చేశారు. గతంలో హిమంతబిశ్వ శర్మ, అజిత్ పవార్‌లపై బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేసి.. దర్యాప్తు కూడా చేయించిందని.. ఒక్కసారి వారు బీజేపీలోకి రాగానే మోదీ వాషింగ్ పౌడర్ పరిశుద్ధులను చేసేసిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఒక వ్యక్తి రూ.5 కోట్లతో దొరికిపోవడం ఈ ఆరోపణలకు ప్రధాన కారణంగా మారింది. విచారణలో ఆ వ్యక్తి తనను తాను మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యక్తిగా చెప్పుకొన్నాడు. తాను ఆ రూ.5 కోట్లను బాఘేల్ అనే రాజకీయనాయకుడికి ఇవ్వడానికి వెళుతున్నానని.. తమ సంస్థ ఇప్పటికే రూ.508 కోట్లను ఆ రాజకీయనాయకుడికి ఇచ్చినట్లు వెల్లడించాడు. అతడు చెప్పిన అంశాలపై తమ దర్యాప్తు కొనసాగుతోందని.. ఇంకా దేనినీ నిర్ధారించలేదని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అయితే విపక్ష భాజపా.. భూపేశ్ బాఘేల్‌పై ఆరోపణలు గుప్పిస్తోంది.