కర్ణాటకలో సీఎం మార్పు వ్యవహారం పార్టీలో అసమ్మతి రాజకీయాలను రగిలిస్తుంది. అధికార మార్పిడిలో భాగంగా సీఎం సిద్దరామయ్య స్థానంలో కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ పదవి ప్రమాణం చేసిన రెండు రోజులకే కేబినెట్ లో తిరుగుబాటు మొదలైంది. తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖ నచ్చలేదంటూ సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
డీకే శివకుమార్ తనకు బెంగుళూర్ నగరాభివృద్ది శాఖ ఇస్తారని మాట ఇచ్చారని, అందుకు విరుద్దంగా ఇరిగేషన్ శాఖను కేటాయించారని రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మంత్రిత్వ శాఖ కేటాయింపు విషయంలో డీకే శివకుమార్ ఇచ్చిన మాటను తప్పారని..అడిగిన నగరాభివృద్ధి శాఖ కాకుండా, అవగాహాన లేని ఇరిగేషన్ శాఖ ఇచ్చారని మండిపడ్డారు. నన్ను పదే పదే అవమానాలకు గురిచేశారు. ఇక ఎంతమాత్రం దీనిని నేను భరించలేను. నా అంతరాత్మను చంపుకుని నేను మంత్రిగా పని చేయలేను” అని స్పష్టం చేశారు.అందుకే మంత్రి పదవికి రాజీనామా చేశానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని రామలింగారెడ్డి ప్రకటించారు.
రామలింగారెడ్డి నిన్న జరిగిన మంత్రిత్వ శాఖల కేటాయింపు సమావేశాన్ని సైతం బహిష్కరించారు. 2023లోనే నగరాభివృద్ది శాఖకు సంబంధించి తనకు ఒక స్పష్టమైన హామీ లభించిందని రామలింగారెడ్డి గుర్తు చేశారు. రెండున్నరేళ్ల తర్వాత డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక.. ఆ శాఖను పూర్తిగా తనకు అప్పగిస్తారనే ముందస్తు అవగాహన తమ మధ్య కుదిరిందని.. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయని రామలింగారెడ్డి పేర్కొన్నారు. తాను పదవులు అడగలేదని, శాఖల కేటాయింపు నచ్చలేదని స్పష్టం చేశారు.
అంతకుముందు రామలింగారెడ్డి గత సీఎం సిద్దరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 53 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తూ.. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న రామలింగారెడ్డి కేబినెట్ నుంచి తప్పుకున్నట్లుగానే .. మరో ఇద్దరు సీనియర్ నేతలు కూడా మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తుంది. తాజా పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్ లో రేగిన ముసలానికి నిదర్శనంగా భావిస్తున్నారు.
