Cuddalore : మత్తులో బెట్టింగ్..సముద్రంలోకి కారు
మద్యం మత్తులో యువకుడు కారును సముద్రంలోకి నడిపి ప్రాణాలను పణంగా పెట్టాడు. మత్స్యకారులు రక్షించగా వీడియో వైరల్‌గా మారింది.

విధాత : మద్యం మత్తులో తన లవర్, ఫ్రెండ్స్ చేసిన ఛాలెంజ్ కు రెచ్చిపోయి బెట్టింగ్ కాసిన ఓ యువకుడు సముద్రంలోకి కారు నడిపిన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన వైరల్ గా మారింది. చెన్నైకు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు కడలూర్(Cuddalore) హర్భర్ పరంగిపేట తీర ప్రాంతానికి విహార యాత్రకు వచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య సముద్రంలోకి ఎవరైన కారు నడుపుతారా అన్న ఛాలెంజ్ తలెత్తింది. అప్పుటికే వారంతా మద్యం సేవించి ఉన్నారు. తన లవర్ తో పాటు, మిగతా మిత్రులు విసిరిన ఛాలెంజ్ కు స్పందించిన ఓ యువకుడు నేను సముద్రంలో కారు నడుపుతానంటూ మద్యం మత్తులో బెట్టింగ్ కు దిగాడు.
కడలూరు సోదికుప్పం వద్ద కారులోని నలుగురిని దించేసి..తాను గూగుల్ మ్యాప్(Google Map) పెట్టుకుని కారుతో నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లిపోయాడు. సముద్రం నీళ్లలోకి వెళ్లిన కారు ఆగిపోయింది. అలల ధాటికి కొట్టుకుని తెలియాడుతున్న కారుపై యువకుడు కనిపించాడు. ఇది చూసిన స్థానిక మత్స్యకారులు వెంటనే ఆ యువకుడిని రక్షించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారును ట్రాక్టర్ సహాయంతో సముద్రం నీటి నుంచి తీరానికి లాక్కొచ్చారు. మద్యం మత్తులో ఈ నిర్వాకానికి పాల్పడిన యువతీయువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం మత్తులో యువత ఈ తరహా దుస్సాహాసానికి పాల్పడిన వీడియోను చూసిన నెటిజన్లు వారి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.