KEJRIWAL | సీఎం కేజ్రీవాల్ కేసు చార్జ్‌షీట్‌లో కవిత పాత్రపై ఈడీ ప్రస్తావన …100కోట్ల ముడుపులలో కీలమని అభియోగం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో కవిత పాత్రను ఈడీ ప్రస్తావించడం కీలకంగా మారింది. కవిత ద్వారా 100కోట్ల నగదు లిక్కర్ స్కామ్‌లో చేతులు మారాయని ఈడీ పేర్కోంది

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో కవిత పాత్రను ఈడీ ప్రస్తావించడం కీలకంగా మారింది. కవిత ద్వారా 100కోట్ల నగదు లిక్కర్ స్కామ్‌లో చేతులు మారాయని ఈడీ పేర్కోంది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా లావాదేవీలు జరిగినట్లుగా తెలిపింది. కవిత నుంచి రెండు బైకులు, నగదు తీసుకెళ్లి దినేష్ అరోరాకు అప్పగించారని, ఢిల్లీలోని వినోద్ చౌహన్ దగ్గర అశోక్, దినేష్ అరోరాలు కలుసుకున్నారని పేర్కోంది. గోవా ఎన్నికల సందర్భంగా వినోద్ చౌహన్ డబ్బుల పంపిణీ చేశాడని, ముత్తా గౌతమ్‌కు సంబంధించిన మీడియా సంస్థ ద్వారా హవాలా లావాదేవీలు జరిగాయని, అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్‌లు ఏడు కోట్ల రూపాయలను హవాల ద్వారా అరవింద్‌సింగ్‌కు ఇచ్చారని ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో తెలిపింది. లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 12వ తేదీన కేజ్రీవాల్‌భు న్యాయస్థానంలో హాజరు పర్చాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో 38 మందిని నిందితులుగా పేర్కొనగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును 37వ నిందితుడుగా ఈడీ చేర్చింది. గోవా ఎన్నికల్లో ముడుపుల సొమ్ము వినియోగించిన విషయం ఆయనకు తెలుసునని, సౌత్ గ్రూప్‌ఉతో కలిసి మద్యం పాలసీలో అక్రమాలకు కుట్ర చేశారని ఆరోపించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు, మరో నిందితుడు వినోద్ చౌహాన్‌కు మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్ వివరాలను ఛార్జిషీటులో ఈడీ ప్రస్తావించింది. గోవా ఎన్నికల సందర్భంగా కె.కవిత వ్యక్తిగత సహాయకుడు రూ .45 కోట్ల సొమ్మును వినోద్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి పంపాడని, అరవింద్ కేజ్రీవాల్‌తో వినోద్‌కు మంచి సంబంధాలున్నాయనే విషయం వారి మధ్య జరిగిన ఛాటింగ్‌తో స్పష్టమవుతోందని ఈడీ పేర్కొంది.