Delhi | ఇది హృదయ విదారక ఘటన. తన తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. చూద్దామని కుమారుడు, కోడలు, ఇద్దరు మనువరాండ్లు, మరో నలుగురు బంధువులు వచ్చారు. కానీ ఆ ఎనిమిది మంది కాలి బూడిదయ్యారు. ఈ విషాద ఘటన నిన్న దేశ రాజధాని ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని ఫ్లోరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. దీంతో తన తండ్రిని చూద్దామని తన భార్య, ఇద్దరు కూతుళ్లు, మరో నలుగురు బంధువులతో కలిసి వివేక్ అగర్వాల్(46) ఢిల్లీకి వచ్చాడు. ఇక మాలవీయ నగర్‌లోని ఫ్లోరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్‌లో రెండు గదులను అద్దెకు తీసుకున్నాడు. బుధవారం ఉదయం ఈ ఎనిమిది మంది టిఫిన్ చేస్తుండగానే అగ్నికీలలు ఎగిసిపడ్డాయి హోటల్‌లో. వీరంతా కాలి బూడిదయ్యారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివేక్ అగర్వాల్ తండ్రి రాధే శ్యామ్ అగర్వాల్ మాత్రమే ప్రాణాలతో బతికాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో రాధే శ్యామ్ ఒక్కరే మిగిలి ఉన్నారు. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే డీఎన్ఏ టెస్టుల అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
