ట్రెక్కింగ్ సాహసికులకు భారత్ లోని ఓ కోట సవాల్ విసురుతుంది. అత్యంత కఠినమైన, సాహసోపేతమైన ప్రమాదకరమైన ట్రెక్కింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికి ఈ కోట మార్గంలో ట్రెక్కింగ్ చేయడాన్ని సాహిసికులు అస్వాదిస్తున్నారు. అదే మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న హరిహర్ కోట (హర్షగఢ్). భారతదేశంలోని అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ ప్రాంతాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది.
వైరల్ వీడియో..
తాజాగా వందలాది మంది ట్రెక్కర్లు నిటారుగా ఉన్న రాతి మెట్లు, ప్రమాదకర వాలుల గుండా ఎక్కుతున్న దృశ్యాలు హరిహర్ కోట ట్రెక్కింగ్ వీడియో వైరల్ అవుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ ఆసక్తికర వీడియోనుషేర్ చేశారు. వర్షాకాలంలో అద్భుతమైన ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నప్పటికీ, ట్రెక్కింగ్ మార్గంలో ప్రమాదాల నివారణకు, భద్రతకు రైలింగులు లేకపోవడం, భద్రతా సదుపాయాలు పరిమితంగా ఉండటంతో ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలంలో హరిహర్ కోట ఎక్కడం చాలా ప్రమాదకరంగా మారుతుందని, రోజూ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక పెద్ద ప్రమాదానికి ఆహ్వానం అని చెబుతున్నట్లుగా ఉందని పర్యాటకులు గుబులు పడుతున్నారు. ప్రమాదాల నివారణకు పర్యాటక శాఖ ఒక రోజులో 300 మందిని మాత్రమే కోట మార్గంలో అనుమతిస్తున్నప్పటికి ఈ నిబంధన అమలు నామమాత్రమైపోవడంతో ఇక్కడ ట్రెక్కింగ్ ప్రమాదకరంగా మారిపోతుంది. ఈ కోట సహ్యాద్రి పర్వత శ్రేణిలో భాగంగా పరిగణించబడే త్రయంబకేశ్వర పర్వత శ్రేణిపై ఉంది. కోటపై ఒక చిన్న రాజభవనం ఉంది. ఇక్కడ చెరువు, శివుడు, హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలను కోట పై నుంచి వీక్షించడం నయాననందకరంగా ఉంటుంది.
హరిహర్ కోట ప్రత్యేకతలు
సముద్ర మట్టానికి 3,676 అడుగుల ఎత్తులో ఉన్న హరిహర్ కోట మెట్లు దాదాపు 90 డిగ్రీల ఎత్తులో చాలా నిటారుగా ఉంటాయి. రాతిని తొలిచి ఈ మెట్లను తయారు చేశారు. ఆ మెట్ల గుండా ఎక్కడం చాలా సాహసోపేతమైన ప్రయత్నం. ఈ కోటను 9వ శతాబ్ధం నుంచి 14వ శతాబ్దాల మధ్య మహారాష్ట్రలోని యాదవ రాజవంశానికి చెందిన రాజులు నిర్మించారు. వాణిజ్య మార్గాలపై నిఘా ఉంచడానికి ఈ కోటను నిర్మించారు. హరిహర కోటను మరాఠా పాలకులు కూడా ఆక్రమించారు. ఆ సమయంలో వారు ఈ కోటను వ్యూహాత్మక నిఘా కోసం ఉపయోగించేవారు. మరాఠా పాలకుడు శివాజీ 17వ శతాబ్దంలో ఈ కోటను ఆక్రమించి.. ఈ కోటను తన ముఖ్యమైన కోటగా మార్చుకున్నాడు. అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను పర్యవేక్షించేవారుఈ కోట మరాఠా పాలకులకు సైనిక స్థావరం లాంటిదిగా చరిత్ర కారుల కథనం. మరాఠాలకు ముందు ఈ కోటను అహ్మద్‌నగర్ సుల్తాన్ ఆక్రమించాడు. మరాఠాలు, మొఘలులు తరువాత బ్రిటిష్ వారు ఈ కోటను ఆక్రమించిన తర్వాత… ప్రస్తుతం ఈ కోట శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కొన్ని నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ కోట సహజ వాతావరణం చూసేందుకు పర్యాటకులు ఆసక్తిని చూపిస్తారు.
🌧️ హరిహర్ కోట ట్రెక్కింగ్.. సాహసికులకు సవాల్!⛰️
🔸 మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న హరిహర్ కోట (హర్షగఢ్) భారతదేశంలోని అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
🔸 ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియోలో వందలాది మంది ట్రెక్కర్లు… pic.twitter.com/V3ZGtoHxbT
— ముచ్చట్లు (@muchatlu_) June 17, 2026
