• Telugu News
  • /National

Supreme Court | హిందువు అని నిరూపించుకోవాలంటే గుడికే వెళ్లక్కర్లేదు.. ఇంట్లో దీపం పెట్టినా చాలు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court | హిందూ మత విశ్వాసాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువులు ఎవరైనా తమ విశ్వాసాన్ని చాటేందుకు దేవాలయానికి వెళ్లే పూజలు చేయాల్సిన అవసరం లేదని.. తన ఇంట్లో దీపం వెలిగించినా సరిపోతుందని స్పష్టం చేసింది.

Reported by: Chandram | జాతీయం | May 14, 2026, 3:07 pm IST
Read Time: 4 mins
Supreme Court | హిందువు అని నిరూపించుకోవాలంటే గుడికే వెళ్లక్కర్లేదు.. ఇంట్లో దీపం పెట్టినా చాలు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court | హిందూ మత విశ్వాసాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం అనేది కేవలం ఆచారాలు, సంప్రదాయాలకు పరిమితమైన మతం కాదని.. అది ఒక జీవన విధానం అని తెలిపింది. హిందువులు ఎవరైనా తమ విశ్వాసాన్ని చాటేందుకు దేవాలయానికి వెళ్లే పూజలు చేయాల్సిన అవసరం లేదని.. తన ఇంట్లో దీపం వెలిగించినా సరిపోతుందని స్పష్టం చేసింది. మతాన్ని బహిరంగంగా ఆచారాలతోనే కొలవలేమని.. వ్యక్తిగత విశ్వాసమే ప్రధానమని పేర్కొంది.

శబరిమల ఆలయంతో సహా పలు మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై, దావూదీ బోహ్రాలతో సహా పలు మతాలు పాటించే మత స్వేచ్ఛ పరిధిపై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్, జస్టిస్ ప్రసన్న ఆర్ వారాలే, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ఉన్నారు. 15వ రోజు ఈ విచారణ సందర్భంగా పిటిషనర్లలో ఒకరి తరఫు న్యాయవాది డాక్టర్ జీ.మోహన్ గోపాల్ 1966లో హిందువు అనే పదానికి ఇచ్చిన ఓ నిర్వచనాన్ని సవాలు చేశారు. మతం, తత్వ శాస్త్రానికి సంబంధించిన అన్ని విషయాల్లో వేదాలను పరమాధికారంగా అంగీకరించిన వ్యక్తినే హిందువుగా పరిగణించాలన్న అప్పట్లో తీర్పు ఇచ్చారని తెలిపారు.

దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. హిందూమతం కేవలం ఆచారాలకు పరిమితం కాకపోవడం వల్లే దాన్ని వే ఆఫ్ లైఫ్‌గా పరిగణిస్తారని తెలిపారు. దేవాలయాలకు వెళ్లకపోయినా వ్యక్తిగత విశ్వాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాల్సిన అవసరమేమీ లేదని తెలిపారు. అలా అని ఒకరి విశ్వాసాన్ని మరొకరు ప్రశ్నించాల్సిన అవసరమూ లేదని వ్యాఖ్యానించారు. మత విశ్వాసాలపై ప్రతి ఒక్కరూ న్యాయస్థానాల్లో ప్రశ్నించడం మొదలుపెడితే వందలకొద్దీ పిటిషన్లు వస్తాయని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

Read More:

బీఆర్ఎస్‌లో తగ్గని ‘బీటీ బ్యాచ్’ హవా! వాళ్లకే ఇన్‌చార్జ్‌ పగ్గాలు

ఐదు సీట్లిస్తే.. వెయ్యి కోట్లిస్తా… బీజేపీకి ఓ మాజీ మంత్రి బంపర్ ఆఫర్!