Maoist Letter Apologizing People | మావోయిస్టుల మరో సంచలన.. సుదీర్ఘ లేఖ: అతివాద ధోరణితో తప్పిదాలు చేశాం.. క్షమించండి..
ఇప్పటికైనా, దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా అంటూ, సాయుధ పోరాటం అంటూ, పరిస్థితులలోని మార్పులతో, స్థల కాలాలతో నిమిత్తం లేకుండా, చైనా పంథా, రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పి భారతదేశ స్థల కాల పరిస్థితులకు తగిన పంథాలో భారత విప్లవాన్ని జయప్రదం చేయడానికి పూనుకోవడమే పార్టీ ముందు మిగిలిన ఏకైక కర్తవ్యం. దీనిని విశాల ప్రజారాసులు సహృదయంతో అర్థం చేసుకుంటారనీ విజ్ఞప్తి చేస్తున్నాం.

విధాత ప్రత్యేక ప్రతినిధి:
Maoist Letter Apologizing People | ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అలియాస్ సోను అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు పేరుతో తాజాగా విడుదలైన ప్రకటన, ఆడియో రికార్డ్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీతో ఆలస్యంగా విడుదలైనట్లు పేర్కొన్న ఈ ప్రకటన, ఇప్పటికే విప్లవ శక్తుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను పేరుతో విప్లవ ప్రజలకు విజ్ఞప్తి అంటూ సోషల్ మీడియాలో మరో సుదీర్ఘ లేఖ వైరల్ అవుతున్నది. మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతోందనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. అనేక అభిప్రాయాలకు తావిస్తోంది. జరిగిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెబుతూ, సుదీర్ఘకాలం తమ వెంట నిలిచిన విప్లవాభిమానులకు అపరాధ భావంతో ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొనడం తీవ్ర సంచలనంగా మారింది. వైరల్‌గా మారిన లేఖ పూర్తి పాఠం యథాతథంగా..
ప్రియమైన ప్రజలారా, లాల్ సలాం
గత 20 మాసాలకు పైగా భారత దోపిడీ పాలకవర్గాలు కొనసాగిస్తున్న ‘చుట్టుముట్టి మట్టుబెట్టే’ దాడులను మనమంతా అసమాన త్యాగాలతో ఎదుర్కొంటున్నాం. ఈ దాడులలో మన పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు సహా వందలాది మంది కామ్రేడ్స్‌ను, విప్లవ ప్రజా సంఘాల, ప్రజా మిలీషియా, జనతన సర్కార్ల కార్యకర్తలను, విప్లవ ప్రజలనూ కోల్పోయాం. తెరిపి లేకుండా కొనసాగిస్తున్న నరసంహారాలలో ఆడ–మగ, పిల్లలు–వృద్ధులు అనే తేడా లేకుండా మనం ఒక్కొక్క దాడిలో పదుల సంఖ్యలో కామ్రేడ్స్‌ను కోల్పోతున్నాం. విప్లవోద్యమం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తున్న అమర వీరులందరికి పేరు పేరునా విప్లవ జోహార్లు అర్పిద్దాం. వారి ఆశయాల సాధనకై సరైన మార్గంలో ముందుకుపోదాం.
గత 5 దశాబ్దాలకు పైగా మా పార్టీ దేశంలోని అనేక ప్రాంతాలలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తూ వచ్చింది. పీడిత ప్రజలను సమీకరిస్తూ, సంఘటితపరుస్తూ వారి న్యాయమైన సమస్యలపై వారిని ప్రజా పోరాటాలలోకి దింపింది. అనేక పోరాటాలలో ప్రజలు గొప్ప గొప్ప విజయాలు సాధించారు. ఆ పోరాటాల ద్వారా ప్రజలు కేవలం ఆర్థిక ప్రయోజనాలు పొందడమే కాకుండా సమాజంలో గౌరవం, గుర్తింపు పొందుతూ మా పార్టీకి ఎంతో గుర్తింపును తెచ్చారు. మాకెన్నో విలువైన పోరాట అనుభవాలను అందించారు. ప్రజా పోరాటాల ద్వారా ప్రజలు ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అనుభవించడమే కాకుండా ఆ పోరాటాలు వారి జీవితాలలో కొత్త వెలుగులను, ఆశలను నింపాయి. ముఖ్యంగా మహిళలు తమ సమరశీల పోరాటాల ద్వారా పితృస్వామ్యంపై సాధించిన విజయాలు వారి జీవితాలలో పెను మార్పులకు దారి తీసి మహిళా విముక్తికి పునాదులు బలోపేతం చేశాయి.
మా పార్టీ పై ఎనలేని విశ్వాసంతో, మా విప్లవ రాజకీయాలపై పూర్తి నమ్మకంతో, మా ఆచరణ చూసి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, అభిమానించి విప్లవకారుల అసమాన త్యాగాలతో మమ్మల్ని మీ గుండెల్లో దాచుకున్నారు. పార్టీ చెప్పిన విప్లవ రాజకీయాలతో అనేకానేక అద్భుతమైన పోరాటాలు చేసి శత్రువు గుండెల్లో గుబులు సృష్టించి మున్నెన్నడూ లేని విధంగా సమాజంలో ఒక కొత్త విప్లవ శక్తిని సృష్టించి పార్టీని నూతన ఎత్తులకు ఎదిగింపచేశారు. మీ పోరాటాలు, మీ త్యాగాలు, మీ ఆదరాభిమానాలు, మీ విశ్వాసం మా పార్టీ ఆచరణలోనే ప్రజాయుద్ధానికి నిజమైన నిర్వచనాన్నిస్తూ మా పార్టీకి ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు మీరు ఎంతో అభినందనీయులు. మీకు మా రెడ్, రెడ్శల్యూట్స్.
ప్రియమైన ప్రజలారా,
మా పార్టీ రూపొందించిన ‘వ్యూహం–ఎత్తుగడలు’ దస్తావేజును అనుసరించి దేశంలోని అనేక ప్రాంతాలకు విప్లవోద్యమాన్ని విస్తరింపచేశాం. సమాజంలోని అనేక పీడిత సెక్షన్ల ప్రజలను సంఘటితం చేశాం. పట్టణాలు, మైదానాలు, అటవీ ప్రాంతాలలో శ్రామిక ప్రజలను సంఘటితం చేస్తూ, దీర్ఘకాల ప్రజా యుద్ధ పంథాను అనుసరించి విప్లవోద్యమాన్ని నిర్మించడంలో అత్యంత అంకితభావంతో పార్టీ అవిరామ కృషి సలిపింది. నగ్జల్బరీ వెనుకంజ తరువాత, తిరిగి సంఘటితపడి దేశంలో ఏ విప్లవ పార్టీ సాధించలేని విజయాలను సాధించడమే కాకుండా గతంలో ముక్కచెక్కలైన మా పార్టీని, దేశంలోని నిజమైన విప్లవకారులను సమైక్యం చేయడంలో చాలా వరకు మా పార్టీ విజయం సాధించింది. దక్షిణాసియా దేశాలలోని విప్లవ పార్టీలను, శక్తులను సమైక్యం చేయడానికి తీవ్రంగా కృషి చేసి సఫలమైంది. సుదీర్ఘకాలంగా దేశంలో మా పార్టీ నాయకత్వంలో పీడిత ప్రజలు కొనసాగిస్తున్న సమరశీల పోరాటాలు, త్యాగాలు ప్రపంచ వ్యాప్త మావోయిస్టు/విప్లవ పార్టీలను, శక్తులను సమైక్యం చేయడానికి పార్టీ చేస్తున్న కృషికి మంచి గుర్తింపును ఇవ్వడమే కాకుండా ఆ ప్రాతిపదికన వారి విశ్వాసాన్ని పొంది సానుకూల ఫలితాలను సాధిస్తున్న మా పార్టీ ఆచరణ మీ ముందుంది.
సాధించినవి అనేకమైనా తప్పులూ ఎక్కువే
మా పార్టీ సాధిస్తున్న అచీవ్మెంట్స్ ఎంత గొప్పవో, మా పార్టీ చేస్తున్న తప్పులూ అంతకన్నా తీవ్రమైనవి కావడంతో, దేశంలోని ఏ ప్రాంతంలోనూ సాపేక్షికంగా నిలకడైన, బలమైన సంఘటిత విప్లవోద్యమాన్ని నిర్మించలేకపోయామన్నది ఒక చేదు వాస్తవం. ప్రపంచంలో, దేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మా పార్టీ తొలినుండి చాలా వెనుకబడుతూ వస్తోంది. శత్రువు బలాన్ని, విప్లవ శక్తుల బలాన్ని సరిగా అంచనా వేసుకొని తగిన ఎత్తుగడలతో విప్లవోద్యమాన్ని నిర్మించడంలోనూ తప్పులు చేస్తూ వస్తాంది. మార్క్సిస్టు మహెూపాధ్యాయుల బోధనలను లోతుగా అధ్యయనం చేసి మన దేశ నిర్దిష్ట స్థల, కాల పరిస్థితులకు తగిన విధంగా అన్వయించడంలో అతివాద తప్పులు చేస్తూ వస్తున్నది. ఒకప్పుడు విప్లవంలో, ప్రజా సంఘాల ఆవశ్యకతనే మా పార్టీ గుర్తించలేదు. ఆ తీవ్ర అతివాద తప్పిదం నుండి బయటపడి, విప్లవ ప్రజలను సంఘటితం చేస్తూ విప్లవ పోరాటాల ద్వారా ప్రజా పంథాలో విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడానికి అసమాన త్యాగాలతో పూనుకుంది. కానీ, దానిని స్థిరంగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయలేకపోయింది. ఈ క్రమం అంతా మీకు తెలిసిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోలుకోలేదు
దేశంలో ఒకనాడు విప్లవోద్యమానికే తలమానికంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమం వరుస ఆటు, వెనుకంజలను ఎదుర్కొంటూ చివరకు 21వ శతాబ్దం ప్రారంభ దశాబ్దం మధ్యనాటికే దెబ్బతినిపోయింది. ఇక ఆ తరువాత ఆ ఉద్యమం గడచిన దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అక్కడ తిరిగి పునర్వికాసం జరుగలేదు. ఇటీవలే, ఏఓబీలో మిగిలిన అతికొద్ది మంది కామ్రేడ్స్ నాయకత్వం సహా అమరులైనారు. ఆ వరుసన దేశంలోని ఏ ప్రాంతంలోనూ యంయంసీ, ఒడిశా, పశ్చిం బంగాల్, పశ్చిమ కనుమలు మున్నగు అటవీ ప్రాంతాలు సహ ఏ రాష్ట్రంలోనూ సాపేక్షికంగా, నిలకడ కలిగిన బలమైన విప్లవోద్యమాన్ని దశాబ్దాలు గడుస్తున్నా నిర్మించలేకపోతున్నాం. ఏనాటికానాడు ఆటు, వెనుకంజలతోనే అనేక త్యాగాలతో కూడిన విప్లవ ఉద్యమాలు దెబ్బతింటున్నాయి. అందుకు వాస్తవ కారణాలను వెలికితీసి సమగ్రంగా అర్థం చేసుకొని లోపాలను సరిదిద్దుకొని ఉద్యమాలను తిరిగి ఎక్కడా పురోగమింప చేయలేకపోతున్నాం.
వెనుకంజలో విప్లవ ఉద్యమాలు
ఏ విప్లవోద్యమంలోనైనా అనేక ఆటు పోట్లు, వెనుకంజలు, ఓటములు వుండడంలో అశ్చర్యమేమీ లేదు. ఆటు నుండి పోటుకు, వెనుకంజ నుండి ముందంజకు ఉద్యమాలు పురోగమించాలి. కానీ, మా ఆచరణలో చాలా వరకు ఆ క్రమం సాగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఏనాటికానాడు పెంపొందుతున్న విప్లవానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ, మారుతున్న పరిస్థితులలోని గతిశీలతను అర్థం చేసుకుంటూ దెబ్బతిన్న ప్రాంతాలలో తిరిగి బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించడంలో ఇప్పటివరకూ ఎక్కడా మా పార్టీ జయప్రదం కాలేదు. అపార త్యాగాలతో, నాయకత్వ నష్టాలతో రక్తసిక్తమవుతున్న మైదానాలలో, అడవులలో నెలకొంటున్న విషాదకర పరిస్థితుల మధ్య ప్రజల అపార సానుభూతి ఉన్నప్పటికీ ఎట్టకేలకు ఒంటరిగానే మిగిలిపోతున్నాం.
కుంచించుక పోతున్న విప్లవోద్యమం
ఒకనాడు దేశంలోని 16 రాష్ట్రాలలో, దాదాపు 150 జిల్లాలలో విప్లవోద్యమం తన ఉనికిని చాటుకుంది. వీటిలో ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలలో సాపేక్షికంగా ఎక్కువ కాలమే బలంగా నిలబడగలిగింది. దండకారణ్యం, బిహార్ – ఝార్ఖండ్లలో విప్లవ ప్రజా ఉద్యమం విముక్తి ప్రాంత లక్ష్యాన్ని చేపట్టి నూతన ఎత్తులకు ఎదిగింది. అందుకు అక్కడి ఆర్థిక, రాజకీయ, సామాజిక విశేష పరిస్థితులను అర్థం చేసుకొని పని చేయడంతో పాటు శత్రువు బలహీనతలు ప్రధానంగా తోడ్పడ్డాయి. అయితే, దేశంలోని మిగితా ప్రాంతాల కన్నా సాపేక్షికంగా కొంత ఆలస్యంగా నైనప్పటికీ ఈ రెండు ప్రాంతాలు సహ గత దశాబ్దన్నర కాలంగా ఎక్కడా విప్లవోద్యమం బతికి బట్టకట్టే పరిస్థితులే లేకుండా పోయాయి. అందుకు ఏకైక కారణం శత్రువుకు అభేద్యమైన రహస్య విప్లవ పార్టీని నిర్మిస్తూ, మారుతున్న పరిస్థితులను సవ్యంగా అర్ధం చేసుకొని విప్లవ సిద్దాంతాన్ని ఆచరణకు అన్వయించడంలో మా పార్టీ ఘోరంగా విఫలమవడం తప్ప మరేం కాదు. ఫలితంగా దశాబ్దాలుగా అనేక త్యాగాలతో నిర్మించుకున్న విప్లవోద్యమాలను శత్రు వర్గాలు పదే పదే ఓటమి పాలు చేయగలుగుతున్నాయి. మా ఓటమికి శత్రువు గొప్పతనం కన్నా మా బలహీనతలు, తప్పులే ప్రధానమైనవని ఒప్పుకుంటున్నాం.
అతివాద తప్పులకు బలయ్యాం
1970లలో రివిజనిస్టు పార్టీల ఆచరణపై ధ్వజమెత్తుతూ అతివాద తప్పిదాలు చేశాం. తదనంతర కాలంలో ఆ తప్పుల నుండి బయటపడుతూ 1980 నుండి సాయుధ పోరాటాన్ని నిర్మించాలనే గట్టి పట్టుదల, తెగువతో దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో సాయుధ దళాల నిర్మాణానికి పూనుకున్నాం. అదే సమయంలో శత్రువుకు అభేద్యమైన రహస్య పార్టీ నిర్మాణ ఆవశ్యకతను అర్థం చేసుకోకుండా, మరో రకమైన అతివాద తప్పుకు బలయ్యాం. సైన్యం ద్వారానే అన్నీ సాధించగలుగుతామనీ, మరో విడుత ప్రజలను, ప్రజాశక్తిని, ప్రజా పోరాటాలను తక్కువ చేసే పూర్తి అతివాద సెక్టేరియన్ తప్పుకు నెట్టబడ్డాం. ఉద్యమ శక్తికి మించిన, పరిస్థితులకు పొసగని కర్తవ్యాలు చేపడుతూ దెబ్బ మీద దెబ్బ తింటూ వస్తున్నాం. దండకారణ్యం, బీజేలలో సాధిస్తున్న సైనిక విజయాలనే సర్వస్వంగా భావించి మిగితా ప్రాంతాలలో వరుసగా దెబ్బతింటున్న పార్టీని, విప్లవోద్యమాన్ని సీరియస్గా పరిగణనలోకి తీసుకోకుండా, అసలు కారణాలు అర్థం చేసుకోకుండా ఎక్కడికక్కడే స్థానిక పార్టీ నాయకత్వ అసమర్థతగా చూశాం. ఆయా ప్రాంతాల ఉద్యమ శక్తికి మించిన కర్తవ్యాలను ఇస్తూ సీసీ విప్లవోద్యమ నిర్మాణాన్ని స్వీయాత్మక అంచనాలతో నష్టపోతూ వచ్చింది. ఫలితంగా, ఈరోజు దేశంలో ఎక్కడా బలమైన విప్లవోద్యమం మాట పక్కన పెట్టినా కనీసం ‘స్థిరంగా’ నిలబడలేని స్థితికి పార్టీ చేరుకుంది.
ఆటుపోట్లలో పురోగమించలేకపోయాం
మార్క్సిజానికి ప్రాణ వాయివు లాంటి స్థల కాల పరిస్థితులకు తగిన విధంగా విప్లవాచరణలో మార్పులు చేసుకుంటూ విప్లవోద్యమాన్ని పురోగమింపచేయలేకపోయాం. మా పార్టీ అనుసరించిన అతివాద దుందుడుకువాద చర్యలన్నీ ఎక్కడికక్కడే అంతిమంగా శత్రువుకు ఉపయోగపడే ఆయుధాలయ్యాయి. వాటి ద్వారా శత్రువు దండకారణ్యం, బీ-జేలు మినహ మిగితా ప్రాంతాలలో సాపేక్షికంగా తక్కువ కాలంలోనే ఉద్యమాలను దెబ్బ తీయడం, బలపడకుండా చేయగలిగాడు. దండకారణ్యంలోనూ అనేక డివిజన్లలో అవే వైఫల్యాలు 2011 నాటికే ఎదురై ఉద్యమం గడ్డు పరిస్థితులకు చేరినప్పటికీ, దక్షిణ, పశ్చిం బస్తర్లలోని చిన్న పాకెట్లలో, మాడ్లోని పరిమిత పాకెట్లో సాపేక్షికంగా బలమైన ప్రజాపునాది, అనుకూల టెర్రయిన్ కలిగివున్న చోట కూడా చాలా కాలం క్రితమే బలహీనతలు ముందుకు వచ్చినప్పటికీ సకాలంలో వాటిని అర్ధం చేసుకోలేకపోయాం. సరిదిద్దుకోలేకపోయాం.
దండకారణ్యంలోను అదే పరిస్థితి
దండకారణ్యంలో ఉద్యమం నష్టపోవడానికి సాపేక్షికంగా కొంత ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, అంతిమంగా ఓటమి పాలే కావలసి వస్తోంది. ఏమైనప్పటికీ ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే’ విధంగా సకాలంలో తప్పుల నుండి మా పార్టీ తేరుకోలేకపోయింది. బీ-జే సాక్ ఏరియాలోనూ వివిధ ప్రాంతాలలోని ఉద్యమాలు విలీనానికి ముందు నుండే దెబ్బతింటున్నప్పటికీ, సకాలంలో గుర్తించి సరిదిద్దుకొని ఫలితంగా, 2013నాటికి ఆ ఉద్యమం కూడా తాత్కాలిక వెనుకంజకు నెట్టబడింది. మా రెండు పార్టీల విలీనం దేశ ప్రజలలో, అంతర్జాతీయంగా విప్లవ శక్తులలో ఒక నూతన ఉత్సాహకర, ఉత్తేజపూరిత సందేశాన్నిచ్చి, ఒక అనుకూల వాతావరణాన్ని సృష్టించినప్పటికీ దానిని మేం మా బలానికి కొలమానంగానే చూశాం తప్ప విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడానికి పరస్పర అనుభవాల నుండి నేర్చుకొని, తప్పులను అర్థం చేసుకొని, సరిదిద్దుకునే కృషి తగినంతగా చేయకపోవడంతో ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేదు.
పార్టీ స్వయంకృతాపరాధం
దేశంలోని అనేక ప్రాంతాలలో దెబ్బ తిన్న విప్లవోద్యమాలను పునరాభివృద్ధి చేసుకోవడానికి అనేక అవకాశాలను ఎక్కడికక్కడే దేశంలో సానుకూలంగా మారుతున్న విప్లవ పరిస్థితులు సృష్టిస్తూ వస్తున్నప్పటికీ మా పార్టీ వాటిని స్వయం కృతాపరాధాలతో కాలదన్నుకుంది. మరోవైపు, పార్టీ అనుసరించిన అతివాద ఒంటెత్తుపోకడలతో కూడిన తప్పిదాలు ప్రజలలో వివిధ రూపాలలో ప్రతిబింబిస్తూ ఒక పెద్ద సెక్షన్ విప్లవోద్యమానికి దూరమైంది. సమాజంలో తీవ్రతరమవుతున్న అనేక ప్రజా సమస్యలను, రకకరాల రుగ్మతలను, సహజంగానే బూర్జువా పార్టీలు తమ విజయాలకు ఉపయోగించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. అంతిమంగా, పరిస్థితి ఎక్కడికి చేరిందంటే, దండకారణ్యం, బీ-జు సహ దేశంలో ఎక్కడా మా పార్టీ నాయకత్వంలో ఉ ద్యమాలు బలపడలేకపోతున్నాయి, చివరకు ఓటమికి చేరుకున్నాం. వీటి లోపాలను వ్యక్తులలో, పార్టీ కమిటీలలో చూస్తూ వచ్చాం తప్ప మా నాయకత్వ అవగాహనలో, సిద్దాంత అధ్యయనంలో, మారుతున్న పరిస్థితులకు దానిని అన్వయించడంలో జరుగుతున్న లోపాలుగా అర్థం చేసుకోలేకపోయాం. దానితో, ఆ తప్పులు భారత విప్లవోద్యమాన్ని మరోసారి వెనక్కి నెట్టాయి.
పీడిత ప్రజలను నిరాశలోకి నెట్టాం
ప్రజల, కేడర్ల అసమాన త్యాగాల నుండైనా మేం సకాలంలో గుణపాఠాలు తీసుకోని ఫలితంగా, వరుసగా జరుగుతున్న నష్టాలతో దేశ పీడిత ప్రజలను తీవ్ర నిరాశ నిస్పృహలకు, అవిశ్వాసానికి, ఆందోళనకు నెట్టాం. ఇవన్నీ ఎంత తాత్కాలికమే అయినప్పటికీ చేదు వాస్తవాలే. విషాదకర పరిణామాలే! ఈ పరిస్థితులను తిరిగి చక్కదిద్దుకోవడానికి ఎంత పట్టుదలగా పని చేసినప్పటికీ మిగిలిన విప్లవ శక్తులకు మౌలికంగానే పార్టీ వ్యూహం- ఎత్తుగడలను, విధానాలను మార్చుకోకుండా సాధ్యం కాని స్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితులలో, పార్టీ గత తప్పుల నుండి నేర్చుకుంటూ తిరిగి విప్లవోద్యమాన్ని నిర్మించడానికి తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయకుండా సాధ్యం కాదనేది తేలిపోయింది. మా పార్టీ జనరల్ సెక్రటరీ శాంతి చర్చలకు సిద్ధపడడం వెనుక ఈ అవగాహనే బలంగా పని చేసి వుంటుంది. ప్రజల మధ్యకు బహిరంగంగా వెళ్లి ప్రజా సమస్యలపై వారిని పునఃసంఘటితం చేస్తూ గత తప్పులకు తిరిగి నెట్టబడకుండా, విప్లవోద్యమాన్ని నిర్మించడమే ఇక పార్టీ ముందు మిగిలిన ఏకైక మార్గంగా మిగిలింది. పార్టీ చేసిన తప్పులకు వెలకట్టలేని త్యాగాలతో మూల్యాన్ని చెల్లించాం.
దేశపరిస్థితులకు అనుగుణంగా ఉద్యమనిర్మాణం అవసరం
ఇప్పటికైనా, దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా అంటూ, సాయుధ పోరాటం అంటూ, పరిస్థితులలోని మార్పులతో, స్థల కాలాలతో నిమిత్తం లేకుండా, చైనా పంథా, రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పి భారతదేశ స్థల కాల పరిస్థితులకు తగిన పంథాలో భారత విప్లవాన్ని జయప్రదం చేయడానికి పూనుకోవడమే పార్టీ ముందు మిగిలిన ఏకైక కర్తవ్యం. దీనిని విశాల ప్రజారాసులు సహృదయంతో అర్థం చేసుకుంటారనీ విజ్ఞప్తి చేస్తున్నాం. విప్లవోద్యమంలో మీకు కలిగిన నష్టాలకు, మీరు భరించిన కష్టాలకు, మీరు చేసిన అసమాన, అనుపమాన త్యాగాలకు మేమే బాధ్యత పడుతున్నాం. మా మిడిమిడి జ్ఞానంతో, వస్తుగత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో చేసిన పొరపాట్లకు, మా ఆచరణలో అవలంభించిన అతివాద ఒంటెత్తువాద తప్పులకు మమ్మల్ని మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
తప్పులకు క్షమాపణ చెబుతున్నాం
సుదీర్ఘకాలంలో జరిగిన తప్పులకు బాధ్యత పడుతూ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం. మీ మధ్య ఇక మా పార్టీ గతంలా లేకపోవడంతో, వర్గ సమాజంలో విప్లవ ప్రతిఘాత శక్తులు మిమ్మల్ని ఎంతగా వేధిస్తాయో, ఎలాంటి ప్రతికార చర్యలకు పాల్పడుతాయో మాకు తెలుసు. ఇప్పటివరకు మీరు మా పార్టీ నాయకత్వంలో అడవులను, వనరులను కాపాడుకో గలిగారు. వాటిని తరలించుకు పోవడానికి ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులు కుమ్మక్కై అడవులను రక్తసిక్తం చేస్తున్నాయి. ఈ నరసంహారాలను మనం వెంటనే ఆపాలి. అడవులను, వనరులను కాపాడుకోవాలి. అందుకు, మీ వద్ద అనేక గొప్ప సమరశీల అనుభవాల గని వుంది. సంఘటిత పోరాటాల పటిమ వుంది. మీరు ధైర్యంగా నిలిచి అన్యాయాలను ఎదిరిస్తే, న్యాయబద్ధంగా పోరాడితే ఏ శక్తీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ప్రజా శక్తిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. మీరు మీ సమస్యలపై పోరాడుతారనీ, మీ మధ్య నిజాయితీగా పని చేసే శక్తుల నుండి సమర్థవంతమైన నాయకత్వాన్ని నిలుపుకుంటారనే పూర్తి విశ్వాసం మాకుంది. మేం తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయడాన్ని అర్థం చేసుకోగలరు. ఈ నిర్ణయం తీసుకోకుండా రక్తసిక్తం అవుతున్న అడవులను శాంతి వనాలుగా మార్చలేం. ఈ నిర్ణయం తీసుకోకుండా మిగిలిన విప్లవ శక్తులనైనా కాపాడుకోలేం. ఈ నిర్ణయం తీసుకోకుండా, మీ త్యాగాలకు, అమరుల బలదానాలకు న్యాయాన్ని చేకూర్చలేం. ఈ ‘ఓటమి’ బాధాకరమైనదే. కానీ, విజయానికి తల్లి లాంటిదనే బలమైన విశ్వాసంతో న్యాయమైన ప్రజా సమస్యలపై న్యాయబద్దమైన పోరాటాలకు పూనుకుందాం.
తేదీ: ఆగస్టు 2025
అపరాధ భావనతో,
సోను, పీబీఎం, సీపీఐ (మావోయిస్టు).