2016లో అదృశ్యమైన ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్.. బంగాళాఖాతంలో గుర్తింపు..!
2016లో అదృశ్యమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలు ఇటీవలే గుర్తించబడ్డాయి

చెన్నై : బంగాళాఖాతంలో 2016లో అదృశ్యమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలు ఇటీవలే గుర్తించబడ్డాయి. చెన్నై తీర ప్రాంతానికి 310 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఏఎన్-32 శకలాలు గుర్తించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 29 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ శకలాలు ఏఎన్-32 కు చెందినవే అని అధికారులు తెలిపారు. ఈ శకలాలు గుర్తించబడ్డ ప్రాంతంలో గతంలో ఎలాంటి విమానాలు కూలలేదని తేల్చారు. దీంతో ఆ విమాన శకలాలు 2016లో కుప్పకూలిన ఐఏఎఫ్ ఏఎన్-32(కే-2743) ఎయిర్‌క్రాఫ్ట్‌వేనని నిర్ధారించారు.
2016, జులై 22వ తేదీన చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లేయిర్‌కు బయల్దేరింది. ఆ సమయంలో సిబ్బందితో సహా 29 మంది ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఎగిరిన కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం బంగాళాఖాతంలో కుప్పకూలిపోయినట్లు తెలిసింది. కానీ శకలాలు అప్పట్లో గుర్తించలేదు. చివరకు 2016, సెప్టెంబర్ 15వ తేదీన 29 మంది కుటుంబ సభ్యులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లేఖలు రాసింది. ఎయిర్‌క్రాఫ్ట్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు. వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు లేఖల్లో ఐఏఎఫ్ పేర్కొంది. మొత్తానికి ఆ ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలు తాజాగా బయటపడినట్లు ఐఏఎఫ్ ధృవీకరించింది.