మోడీ ఓటమికై సర్దుకుపోదాం రండి!
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి.. అన్నింటికంటే కీలకమైన సీట్ల సర్దుబాటుపై దృష్టి

ఆప్‌తో మొదలుపెట్టిన కాంగ్రెస్ నేతలు
పలు చోట్ల భాగస్వాములవే పెద్ద పార్టీలు
పంజాబ్, ఢిల్లీలో కుదరని పొత్తు!
బెంగాల్, యూపీ, కేరళలోనూ అదేసీన్
పొత్తు లేకున్న గెలుపుపై పార్టీల ధీమా
మోదీని ఓడించడం తథ్యమన్న నేతలు
(విధాత ప్రత్యేకం)
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి.. అన్నింటికంటే కీలకమైన సీట్ల సర్దుబాటుపై దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉండాలంటే విపక్ష పార్టీల నుంచి ఒక్కరే అభ్యర్థి ఉండాలని ఇండియా కూటమి సమావేశాల సందర్భంగా అన్నిపార్టీలు అంగీకరించాయి. అయితే ఆచరణలోకి వచ్చేసరికి అటు కాంగ్రెస్, ఇటు కూటమిలోని ఎస్పీ, ఆప్, టీఎంసీ, సీపీఎం తమ బెట్టువీడటం లేదు. అయినప్పటికీ కూటమిలోని మిగతా పార్టీలతో చర్చలు జరపడానికి కాంగ్రెస్‌పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. సీట్ల సర్దుబాటు ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
సొంత ఇంటిని చక్కదిద్దుకుని
ముందుగా సొంత ఇంటిని చక్కదిద్దుకునే పనిని కాంగ్రెస్ నెల రోజుల కిందటే ప్రారంభించింది. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటుపై ముకుల్ వాస్నిక్ కన్వీనర్‌గా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్ తదితర ఐదుగురు సభ్యుల బృందం అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో అంతర్గతంగా చర్చించింది. వారి అభిప్రాయాల నివేదికలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అందించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇండియా కూటమిలోని పార్టీలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.
ఇండియా కూటమి సమావేశం సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక ప్రతిపాదన చేస్తూ.. బెంగాల్లో తాను, పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్, యూపీలో అఖిలేశ్ బాధ్యతలు తీసుకుంటామన్నారు. కానీ పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ రాష్ట్ర శాఖల నేతలు గెలుపుపై ఎవరికి ధీమాగా ఉన్నారు. ఇక్కడ సీట్ల సర్దుబాటు అక్కరలేదని ఇరు పార్టీల నేతలు ఆయా పార్టీల అధిష్ఠానాలకు తెలిపారు. అందుకే ముందుగానే ఆప్‌తో కాంగ్రెస్ పార్టీ చర్చలు మొదలుపెట్టింది. పంజాబ్, ఢిల్లీలో సీట్ల సర్దుబాటుపై ఆమ్ ఆద్మీ పార్టీతో చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కూటమిలో పార్టీలతో చర్చల జరిపి సమస్యను కొలిక్కి తెచ్చే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు ఖర్గే సీనియర్ నాయకులకు అప్పగించినట్లు హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆప్, టీఎంసీలతోనే సవాళ్లు
ఇండియా కూటమికి మునుపే బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, తమిళనాడులో డీఎంకే, ఝార్ఖండ్‌లో జేఎంఎంలతో కాంగ్రెస్ పొత్తు కొనసాగిస్తున్నది. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, కేరళలోవామపక్షాలు, బెంగాల్లో సీపీఎం, టీఎంసీ, పంజాబ్, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి.
కుదరకపోతే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
ప్రధానంగా బెంగాల్లో ప్రధాన ప్రత్యర్థులైన సీపీఎం, టీఎంసీలు ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కలిసి పోటీచేసే విషయంలో విభేదిస్తున్నాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ సీపీఎం, టీఎంసీలలో ఒక్క పార్టీతోనే సర్దుబాటు చేసుకునే పరిస్థితి నెలకొన్నది. ఇటీవల టీఎంసీ నాయకులు, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధంతో పార్టీల మధ్య దూరం పెరిగింది. అలాగే 2019లో లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్.. 20 స్థానాలకు 19 గెలుచుకున్నది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఒక్క స్థానానికే పరిమితమైంది. అక్కడ సీపీఎంతో సర్దుబాటు చేసుకోవాలంటే కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. కేరళలోనూ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ సీపీఎంతో సీట్ల సర్దుబాటు వద్దని అధిష్ఠానానికి తేల్చి చెప్పింది. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే విపక్ష పార్టీల లక్ష్యమైతే ఆప్ అధినేత కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణతో వ్యవహరిస్తేనే పంజాబ్, ఢిల్లీ, బెంగాల్లో సీట్ల పంపకం కొలిక్కి వస్తుంది.
ఈ నేపథ్యంలోనే చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ వీలైనంత మేరకు సర్దుకుపోవాలని యత్నిస్తున్నదని సమాచారం. కాంగ్రెస్ పార్టీముందు ఇతర ప్రత్యామ్నాయాలు ఉండనే ఉన్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ తగ్గకపోతే అక్కడ సీపీఎంతో కలిసి సాగే అవకాశాలున్నాయి. కేరళలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకుని బెంగాల్ ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఆఫర్ చేస్తుందనేది వాదన. సీపీఎం దానికి అంగీకరిస్తే కేరళ, బెంగాల్, త్రిపుర ఈ మూడు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అధిష్ఠానం అంచనా వేస్తున్నది. అలాగే యూపీలో ఎస్పీ, ఆర్ఎల్డీతో అవగాహనకు రావొచ్చు. జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఇబ్బంది ఏమీ లేదు. అప్పటికీ కూటమిలోని కొన్నిపార్టీలు కలిసి రాకపోతే మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ, బీహార్‌లో మహా ఘట్బంధన్ పార్టీలతో సర్దుబాటు చేసుకోవాలనుకుంటున్నది. జనవరి చివరి నాటికి లేదా ఫిబ్రవరి మొదటి వారం వరకు ఈ ప్రక్రియను పూర్తిచేసి కాంగ్రెస్ తనదైన కార్యాచరణతో ముందుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇండియా కూటమిలో పలు పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయని, ఇక్కడ పొత్తులు ఉన్నా, లేకున్నా బీజేపీని ఓడించడం ఖాయమని నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.