INDIA Alliance | దేశవ్యాప్తంగా ఎన్డీయేకు ‘ఉప’ దెబ్బలు
లోక్‌సభ ఎన్నికల్లో బలాన్ని గణనీయంగా పెంచుకున్న ఇండియా కూటమి.. దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయాల దిశగా దూసుకుపోతున్నది

10 సీట్లలో ఇండియా కూటమి విజయం
2 స్థానాల్లో ఎన్డీయే మిత్రపక్షాల ఆధిక్యం
ఒక సీటులో విజయం దిశగా ఇండిపెండెంట్
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ క్లీన్ స్వీప్
ఉత్తరాఖండ్‌లోని రెండు సీట్లలో కాంగ్రెస్
పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌లోనూ బీజేపీ ఓటమి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో సొంతగా మెజార్టీ మార్కు చేరుకోలేక పోయిన బీజేపీకి మరో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే రెండు స్థానాల్లోనే గెలుపు దక్కించుకోగలిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాలు సాధించిన ఇండియా కూటమి.. మరోసారి సత్తాను చాటింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అగ్నిపరీక్షను సిద్ధం చేసింది. మొత్తం పది సీట్లలో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.
పశ్చిమబెంగాల్‌లోని నాలుగు స్థానాల్లోనూ తృణమూల్‌కాంగ్రెస్ స్వీప్ చేసింది. హిమాచల్‌లోని మూడు స్థానాలకుగాను కాంగ్రెస్ రెండింటిలో, బీజేపీ ఒక సీటులో గెలుపొందాయి. ఉత్తరాఖండ్‌లోని రెండు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇందులో పుణ్యక్షేత్రం బద్రీనాథ్ కూడా ఉండటం విశేషం.
హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేశ్ ఠాకూర్ సమీప బీజేపీ అభ్యర్థి హోశ్యార్‌సింగ్‌ను ఓడించారు. హమీర్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పుష్పీందర్ వర్మపై బీజేపీ అభ్యర్థి అశిశ్ శర్మ 1571 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాలాగఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్‌సింగ్ బావా తన సమీప బీజేపీ ప్రత్యర్థి కేఎల్ ఠాకూర్‌పై 8,990 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం సుస్థిరంగా పరిపాలన కొనసాగించే అవకాశం కలిగింది.
పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్‌లో ఆప్ అభ్యర్థి భగత్.. సమీప బీజేపీ అభ్యర్థి షీతల్ అంగురాల్‌పై 37,325 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన సురిందర్‌కౌర్ 16,757 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుర్జీత్‌కౌర్‌కు 1242 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ తరఫున పోటీ చేసిన బిందర్ కుమార్ లఖా 734 ఓట్లు తెచ్చుకున్నారు. శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) ( సిమ్రన్‌జీత్ సింగ్ మాన్) అభ్యర్థి సరబ్‌జీత్ సింగ్ ఖల్సా 662 ఓట్లతో సరిపెట్టుకున్నారు.
ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్రం బద్రీనాథ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలా 5224 ఓట్ల తేడాతో తన సమీప బీజేపీ అభ్యర్థి రాజేంద్రసింగ్ భండారిపై విజయం సాధించారు. మంగ్లౌర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఖాజీ నిజాముద్దీన్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి కర్తార్‌సింగ్ భదానాపై 422 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి ఉబైదుర్ రహమాన్ 19559 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. రాయ్‌గంజ్ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి కృష్ణ కల్యాణి.. బీజేపీ అభ్యర్థి మానస్ కుమార్ ఘోష్‌పై 50077 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మోహిత్‌సేన్ గుప్తా 23116 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. రాణాఘాట్ దక్షిణ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ బిశ్వాస్‌పై తృణమూల్ అభ్యర్థి ముకుత్‌మణి అధికారి 39048 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ సీపీఎం అభ్యర్థి అరిందామ్ బిశ్వాస్ 13,082 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బగ్డా స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మధుపర్ణ ఠాకూర్ చేతిలో బీజేపీ అభ్యర్థి బినయ్ కుమార్ బిశ్వాస్ 33455 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. ఇక్కడ లెఫ్ట్ ఫ్రంట్ తరఫున పోటీ చేసిన ఆలిండియాఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గౌర్ బిశ్వాస్‌కు 8189 ఓట్లు వచ్చాయి. మణికట్లలో టీఎంసీ అభ్యర్థి సుప్తి పాండే తన సమీప బీజేపీ అభ్యర్థి కల్యాణ్ చౌబేపై 62,312 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. సీపీఎం అభ్యర్థి రజిబ్ మజుందార్ 9502 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
బీహార్‌లోని రూపాలిలో జేడీయూ అభ్యర్థి కళాధర్ ప్రసాద మండల్ తన సమీప స్వతంత్రుడి చేతిలో పరాజయం పాలయ్యారు. లెక్కింపు ముగిసే సరికి కళాధర్ ప్రసాద్ 8246 ఓట్లు వెనుకబడి ఉన్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్‌సింగ్ విజయం సాధించారు. ఆర్జేడీ తరఫున పోటీ చేసిన బిమా భారతి 30,619 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బీమా భారతి.. జేడీయూకు రాజీనామా చేసి ఆర్జేడీలో చేరి, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ.. స్వతంత్రుడి చేతిలో ఓడిపోయారు. మళ్లీ అసెంబ్లీకి పోటీచేసినా విజయం లభించలేదు. మధ్యప్రదేశ్‌లోని అమర్వారాలో బీజేపీ అభ్యర్థి కమలేశ్ ప్రతాప్ షా తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ధీరన్‌షా సుఖ్‌రామ్ దాస్ ఇన్వటిపై 3027 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థి దేవరేవణ్ భలావి 28723 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ సీటులో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ.. పీఎంకే అభ్యర్థి అన్బుమణి సీ పై 67,757 భారీ ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీకి దూరంగా 240 సీట్ల వద్దే ఆగిపోయి, ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీయూపై ఆధారపడిన నేపథ్యంలో తాజా ఉప ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి తీవ్ర నిరాశను కలిగించాయనడంలో సందేహం లేదు. రెండు పర్యాయాలు సొంతగా మెజార్టీ సాధించిన బీజేపీ.. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు, నితీశ్‌కుమార్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ సమయంలో ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయాలు సాధించడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది.
ప్రత్యేకించి పశ్చిమబెంగాల్‌లో ఏదో ఒక రూపంలో పాగా వేద్దామని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి.. ఇక్కడ పప్పులు ఉడకవని బెంగాల్ ఓటరు తేల్చి చెప్పాడు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి అదే పరిస్థితి ఎదురైంది. ఇక తమిళనాడులో బీజేపీకి చోటే లేదని అక్కడి ఓటర్లు తేల్చి చెప్పారు.
హిమాచల్‌లో కాంగ్రెస్ సర్కార్ భద్రం
హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్ సుఖు ప్రభుత్వం మిగిలిన మూడేళ్ల పదవీకాలాన్ని సజావుగా కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది. 68 సీట్లు ఉన్న అసెంబ్లీలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌కు 40 మంది, ప్రతిపక్ష బీజేపీకి 38 మంది సభ్యులు అయ్యారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తగిన మెజార్టీతో సుఖు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. మార్చిలో ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా రెబల్స్‌గా మారడంతో సర్కారు మనుగడకు సవాళ్లు ఎదురయ్యాయి. తర్వాత ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారనే అంచనాతో ఈ తొమ్మిది మందిని బీజేపీ చేర్చుకున్నది. లోక్‌సభ ఎన్నికలతోపాటే నిర్వహించిన నాలుగు సీట్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు మరో రెండు సీట్లను గెల్చుకున్నది.