ఏప్రిల్ పదో తేదీ నుంచి యావత్ దేశంలో రహదారులపై ప్రయాణాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. భద్రత, పారదర్శకత, టోల్ ఆపరేషన్లను మరింత మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకువస్తున్నది. సవరించిన ఫ్రేమ్‌వర్క్.. అన్ని జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను, వాటిపై ప్రయాణించే వాహనదారులను ప్రభావితం చేయనుంది. ఇందులో అత్యంత కీలకమైనది ‘తప్పనిసరి ఐడీ తనిఖీ’. దానితోపాటు ఇకపై టోల్‌ఫీజు నగదు రూపంలో చెల్లించడానికి అవకాశం లేదు. వాహనాల పత్రాల తనిఖీ కూడా పకడ్బందీగా నిర్వహిస్తారు. వీటితోపాటు.. హైవే మేనేజ్‌మెంట్‌లో లొసుగులను సరిదిద్దేందుకు నిఘా వ్యవస్థలను సైతం పటిష్టం చేయనున్నారు.
ఏప్రిల్ పది తర్వాత రహదారులపై ప్రయాణించేవారు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఏదో ఒక ప్రభుత్వ ఐడీ కార్డును ఉంచుకోవాలి. అవసరమైన సమయంలో టోల్‌ప్లాజాల వద్ద, హైవే చెక్ పాయింట్లలో దానిని చూపించాల్సి ఉంటుంది. రహదారిపై ప్రయాణించే ప్రతి వాహనానాన్ని సదరు వాహన డ్రైవర్ లేదా ఓనర్ ట్రేసబిలిటీని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దొంగిలింతకు గురైన, స్మగుల్ చేస్తున్న వాహనాలను పట్టుకునేందుకు, అనధికారికంగా తిరిగే వాహనాలను గుర్తించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. వాహనదారులు తప్పనిసరిగా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, లేదా అన్ని వేళలా చెల్లుబాటయ్యే ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. లేనిపక్షంలో జరిమానా విధించే అవకాశం ఉంది. రహదారిపై ప్రయాణానికి కూడా అనుమతించకపోవచ్చు.
నగదు చెల్లింపులు బంద్
ఏప్రిల్ 10 నుంచి అన్ని రహదారుల టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపును అనుమతించబోరు. చెల్లింపులన్నీ ఫాస్టాగ్, యూపీఐ, డెబిట్ కార్డులు లేదా అనుమతించిన ఇతర వ్యవస్థల ద్వారానే చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ లీకేజీలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఈ చర్య తీసుకుంటున్నారు. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని నివారించి, క్యూలైన్లను నివారించేందుకు కూడా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
వాహన పత్రాల పకడ్బందీ తనిఖీ
వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్, పొల్యూషన్ కంట్రోల్, రిజిస్ట్రేషన్ పత్రాలను ఇకపై హైవే పెట్రోల్ టీమ్స్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తాయి. అంటే.. అన్ని నియమనిబంధనలను పాటించే, రోడ్లపై ప్రయాణించేందుకు అర్హత కలిగిన వాహనాలు మాత్రమే అనుమతిస్తారన్నమాట. తగిన ఫిట్‌నెస్‌లేని వాహనాలు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు.. వాహన యజమానులు ఎల్లప్పుడూ చెల్లుబాటయ్యే డాక్యుమెంట్లను కలిగి ఉండేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వాహనాల్లో ప్రయాణించేవారు తరచూ నిర్వహించే తనిఖీలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
ఆధునిక నిఘా వ్యవస్థలు…
కొత్త నిబంధనల్లో భాగంగా అన్ని టోల్‌ప్లాజాల వద్ద, మేజర్ జంక్షన్‌ల వద్ద మానిటరింగ్ వ్యవస్థను పట్టిష్టం చేస్తారు. సీసీటీవీ కెమెరాలు, ఆటోమెటిక్‌గా నంబర్ ప్లేట్లను చదవగలిగే వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా వాహనాలను ట్రాక్ చేస్తారు. ఎక్కడైనా నిబందనలను ఉల్లంఘించినట్టయితే.. రియల్‌టైమ్‌లో గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటారు. కొత్త నిబంధనలు వాహనాల్లో ప్రయాణించేవారిని, ట్రాన్స్‌పోర్టర్లను నేరుగా ప్రభావితం చేయనున్నాయి. ట్రక్ డ్రైవర్లు, లాజిస్టిక్ సంస్థలు కఠినమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. క్యాష్‌లెస్ టోల్ కు సిద్ధం కావాల్సి ఉంటుంది. మరింత క్రమబద్ధీకరించిన వ్యవస్థ ద్వారా రాకపోకల్లో జాప్యాలను, వృథా సమయాన్ని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
విస్తృత స్థాయిలో హైవేల ఆధునీకరణ
తాజా నిర్ణయాలతో భారతదేశ హైవే నెట్‌వర్క్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఈ విధానాలతో దీర్ఘకాలికంగా మేలు చేకూరుతుందని అంటున్నారు.
Read Also |
మూడు వేల కోట్లతో హైదరాబాద్‌లో మరో వెయ్యి కిలోమీటర్ల రహదారుల అప్‌గ్రేడ్
లైవ్‌లో పులుల వేట.. అభయారణ్యంలో మనుషుల అతి!
దొంగ చేతిలో స్కూటర్.. యజమాని చేతికి చలాన్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూపర్!
