అంతరిక్షంలో ఇక భారత్ గూడు.. 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్

- 2040 కల్లా చంద్రునిపైకి భారతీయుడు
- శుక్రుడిపైకి ఆర్బిటార్ మిషన్
- అంగారకుడిపైకి ల్యాండర్
- శాస్త్రవేత్తలతో సమీక్షించిన ప్రధాని
న్యూఢిల్లీ : భారత మొట్టమొదటి అంతరిక్ష మిషన్.. గగన్‌యాన్‌పై అంతరిక్ష విభాగ అధికారులతో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 2025 నాటికి గగన్‌యాన్ సంసిద్ధతను అంచనా వేసే క్రమంలో భాగంగా తొలి క్రూ ఎస్కేప్ టెస్ట్ వెహికల్‌ను పరీక్షించనున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అంతరిక్ష విభాగం గగన్‌యాన్‌కు సంబంధించిన సమ్రగ దృశ్యాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రధానికి వివరించారు. మానవసహిత లాంచ్ వెహికల్స్, వ్యవస్థల కోసం అభివృద్ధి చేసిన వివిధ సాంకేతికతలను తెలియజేశారు. మూడు మానవ రహిత మిషన్‌లు సహా దాదాపు 20 మేజర్ ప్రయోగాలకు హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్స్ (హెచ్ఎల్‌వీఎం3)ను ఉద్దేశించారు.
2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ (ఇండియన్ స్పేస్ స్టేషన్), 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడిని పంపే దిశగా పనిచేయాలని నిర్దేశించారు. ప్రధాని నేతృత్వంలోనే ఉన్న అంతరిక్ష శాఖ.. చంద్రుడిపైకి భారతీయుడిని పంపే మిషన్ రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయనుంది.
వరుస చంద్రయాన్ మిషన్‌లు, తదుపరి తరం లాంచ్ వెహికల్ (నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)ని అభివృద్ధి చేయడం, కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణం తదితరాలపై దృష్టి సారించనున్నారని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
#WATCH | PM Modi chairs high-level meeting to assess the progress of Gaganyaan Mission and to outline the future of India’s space exploration endeavours pic.twitter.com/kVwhBdLiI0
— ANI (@ANI) October 17, 2023
ఇదే సమయంలో శుక్రుడిపైకి ఆర్బిటార్‌ను పంపడంతోపాటు.. అంగారకుడిపైకి ల్యాండర్ పంపించేందుకు ప్రయత్నాలు చేయాలని శాస్త్రవేత్తలను ప్రధాని కోరారు. అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలు అధిరోహించగల సత్తా భారతదేశానికి ఉన్నదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గగన్‌యాన్‌లో భాగంగా తొలి మానవ రహిత టెస్ట్ ఫ్లైట్‌ను శ్రీహరికోట నుంచి అక్టోబర్ 21న ప్రయోగించనున్నారు. చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను దింపిన తొలి దేశంగా ఇప్పటికే భారతదేశం ఘనత సాధించింది. ఆ వెంటనే సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను విజయవంతంగా రోదసిలోకి పంపింది.