ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్‌ బ్లూకార్నర్‌ నోటీస్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్డీయే హసన్‌ నియోజకవర్గ సిటింగ్‌ ఎంపీ, ప్రస్తుత అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్‌ నోటీసు జారీ అయింది.

ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్‌ బ్లూకార్నర్‌ నోటీస్‌

కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వెల్లడి

బెంగళూరు : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్డీయే హసన్‌ నియోజకవర్గ సిటింగ్‌ ఎంపీ, ప్రస్తుత అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్‌ నోటీసు జారీ అయింది. అతడిని తిరిగి భారత్‌కు పంపేందుకు వీలుగా ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకుంటున్నామని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర ఆదివారం తెలిపారు.

ఒక నేరానికి సంబంధించి ఒక వ్యక్తి గుర్తింపు, లొకేషన్‌, ఆయన కార్యకలాపాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని తన సభ్య దేశాల నుంచి పొందేందుకు ఇంటర్నేషనల్‌ పోలీస్‌ కోఆపరేషన్‌ బాడీ జారీ చేసేదే బ్లూకార్నర్‌ నోటీసు. ప్రజ్వల్‌ను ఏ విధంగా భారత్‌కు తీసుకురావాలన్న విషయంలో లైంగిక వేధింపుల వీడియోల కేసులో ఏర్పాటు చేసిన సిట్‌ నిర్ణయం తీసుకుంటుందని కర్ణాటక హోం మంత్రి తెలిపారు. ‘ఇప్పటికే బ్లూకార్నర్‌ నోటీసు జారీ అయింది. ఆయనను గుర్తించేందుకు ఇంటర్‌పోల్‌ తన సభ్యదేశాలకు సమాచారం ఇస్తుంది’ అని ఆయన మీడియాతో అన్నారు.

ఈ కేసులో సిట్‌ పనితీరును ప్రశంసించిన మంత్రి.. అందిన ఫిర్యాదుల ఆధారంగా సిట్‌ చట్టబద్ధంగా పనిచేస్తుందని స్పష్టంచేశారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనుమడైన 33 ఏళ్ల ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన కొన్ని సెక్స్‌ వీడియోలు గత కొద్ది రోజులుగా హసన్‌ నియోజకవర్గ పరిధిలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి